Wisconsin tornado : అమెరికాలోని విస్కాన్సిన్ (Wisconsin) రాష్ట్రాన్ని సోమవారం తీవ్రమైన టోర్నడో (Tournado) వణికించింది. ఈ టోర్నడో ధాటికి విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దాంతో విస్కాన్సిన్తోపాటు అమెరికా (USA) మధ్య పశ్చిమ ప్రాంతంలోని పలు రాష్ట్రాల్లో 3.9 లక్షల ఇళ్లకుపైగా విద్యుత్తు సరఫరా కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మెనాషా (Monasha), యాపిల్టన్ (Appleton) నగరాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిందని తెలిపారు.
టోర్నడో ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. మరోవైపు విద్యుత్తు స్తంభాలు పడిపోయి సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 20 నిమిషాలపాటు టోర్నడో విధ్వంసం సృష్టించిందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో విస్కాన్సిన్లోని వైట్వాటర్ ప్రాంతంలో చెట్ల కొమ్మలను తొలగిస్తున్న విద్యుత్తు శాఖ ఉద్యోగి పిడుగుపడి మృతిచెందాడు. అమెరికా వాతావరణ శాఖ ఈ టోర్నడోను అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రకటించింది.
సహాయక బృందాలు నష్టాన్ని అంచనా వేయడంతోపాటు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు గ్రేట్ లేక్స్, ఒహాయో వ్యాలీ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.