హైదరాబాద్ : పీఆర్వో మహేష్ ( PRO Mahesh) , పీఏ మహేందర్రెడ్డి ( PA Mahendar Reddy ) పై పోలీస్స్టేషన్లో గుండాలు చొరబడి దాడి చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ ప్రారంభం రోజున జరిగిన ఘటనలో విచారణ పేరిట తన సిబ్బందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. పోలీస్స్టేషన్లో 15 మంది గుండాలు అక్రమంగా చొరబడి వారిపై మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తోంది. ఇది కాంగ్రెస్ గుండాల పనా ? లేక మఫ్టీలో పోలీసులకే ముసుగులు వేసి కుట్రపన్ని దాడి చేయించరా ? అనే అనుమానాలు వస్తున్నాయని ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతో పెట్టిన పోలీసు కేసు విచారణ కోసం స్టేషన్ కు పిలిపించి ఖాకీల సమక్షంలో ఈ దాడి చేయించడం వెనక ముమ్మాటికి ముఖ్యమంత్రి హస్తం ఉందని అన్నారు.
ఉదయం విచారణకు రమ్మని చెప్పి చీకటి పడే వరకూ కాలయాపన చేయడం చూస్తే, ముందే ఈ దాడి చేయాలన్న కుట్ర పన్నినట్టు స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. హైకోర్టు తదుపరి ఆదేశాల వరకూ మహేష్, మహేందర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో కక్ష సాధింపులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ సంఘటనకు హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. ముసుగు ధరించిన గుండాల దాడిలో గాయపడ్డ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డి కి వెంటనే రక్షణ కల్పించి మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ లోపల, బయట ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని భద్రపరచా లని కోరారు. ఈ అరాచక పర్వానికి పాల్పడిన ప్రతి ఒక్క కాంగ్రెస్ గుండాను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.