హైదరాబాద్ : నీట్ (NEET) పరీక్షా పత్రం లీకేజీ అవకతవకలపై ఆందోళనలు చేపట్టిన విద్యార్థులకు (Students )ఊరట లభించింది. నిరసనకారులపై నమోదైన కేసులను బీహార్, అస్సాం ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయి. అరెస్టయిన వారిని విడుదల చేయాలని, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవని నిర్ణయించాయి. నీట్ ఆందోళనలకు సంబంధించి నిరసనకారులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుం టామని, వివిధ ఆరోపణల కింద జైలు పాలైన వారిని విడుదల చేస్తామని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. జులై 26న సాయంత్రం 6 గంటలకు ముందు జరిగిన నిరసనల్లో పాల్గొన్న ఏ వ్యక్తిపైనా ప్రభుత్వం ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోదని పేర్కొంది.
అలాగే అస్సాంలో జూలై 26 నాటికి నమోదైన 5 కేసుల్లో అరెస్టైన 13 మందితో పాటు, ఇరు రాష్ట్రాల్లో అదుపు లోకి తీసుకున్న నిరసనకారులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. ఈ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ప్రతినిధులతో చర్చించిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు స్పష్టమైన హామీ ఇచ్చారు. అస్సాం, బిహార్ తరహాలోనే రాజస్థాన్లోనూ విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని తెలిపినట్లు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు.