పాపిరెడ్డిపాలెం వాస్తవ్యులు కీ.శే. కోడూరు వెంకటరమణారెడ్డి – శాంతమ్మల స్మృత్యర్థం గా సామాన్యుల కంటి వెలుగు కోసం మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత శంకర నేత్రాలయ సంస్థ, శాంతా–వసంతా ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం ఫిబ్రవరి 15 నుంచి 23వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరగనుంది.
శాంతా బయోటెక్నిక్ వస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ కోడూరు ఈశ్వర ప్రసాద్ రెడ్డి, వసంత దంపతులు తమ స్వగ్రామం పాపిరెడ్డిపాళెంతో పాటు పరిసర గ్రామ ప్రజల కంటి ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలోని శంకర నేత్రాలయ కంటి వైద్యశాల, హైదరాబాద్‌కు చెందిన శాంతా–వసంతా ట్రస్టు సంయుక్తంగా ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నాయి.
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఇస్కపాళెం గ్రామంలోని ప్రభుత్వ బీసీ హాస్టల్ ప్రాంగణంలో శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు సుమారు 3 వేల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనుండగా, చివరి ఐదు రోజులు అవసరమైన వారికి ఉచితంగా కంటి పొర శస్త్రచికిత్సలు చేస్తారు. రోగులకు అవసరమైన మందులు, కంటి అద్దాలు కూడా ఉచితంగానే అందజేయనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు భోజన, వసతి సదుపాయాలు కల్పించనున్నారు.
– అత్యాధునిక పరికరాలతో కూడిన మొబైల్ వాహనాల ద్వారా గ్రామాల వద్దకే వెళ్లి ఉచిత కంటి పరీక్షలు
– కంటి పొరలుగా నిర్ధారణ అయిన వారికి అదే శిబిరంలో ఉచిత శస్త్రచికిత్స
– అవసరమైన లెన్స్‌లను ఎలాంటి ఖర్చు లేకుండా అమరిక
– మధుమేహం వల్ల కలిగే కంటి సమస్యలపై (డయాబెటిక్ రెటినోపతి) ప్రత్యేక అవగాహన
డబ్బు లేని కారణంగా ఎవరూ చూపు కోల్పోకూడదనే లక్ష్యంతో ఈ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తోటపల్లి గూడూరు మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వృద్ధులు, పేదలకు సమాచారం చేరవేసి శిబిరానికి తీసుకొచ్చేలా సహకరించాలని వారు కోరారు.