మాడ్గులపల్లి, జూలై 31 : మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామంలో అసంపూర్తిగా వదిలేసిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీపీఎం మండల కమిటీ సభ్యుడు పతాని శ్రీను, శాఖ కార్యదర్శి బంటు రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు ప్రారంభ నిర్మాణ దశలోనే అసంపూర్తిగా వదిలేసిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల క్రితం రూ.20 లక్షల నిర్మాణ వ్యయంతో గ్రామ పంచాయతీ నూతన భవనం మంజూరు చేశారు. నిర్మాణం ప్రారంభించిన సమయంలో బేస్ మెంట్ కు ఇసుకకు బదులుగా డస్ట్ వాడుతున్న క్రమంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రశ్నించగా సదరు కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోగా నిర్మాణం అర్థాంతరంగా నిలిపివేయడం సరికాదన్నారు.
ఇప్పటికీ నెలలు గుడుస్తున్నా కూడా మేస్త్రిలు, కూలీలు దొరకడం లేదని సాకుతో పట్టించుకోవడం లేదన్నారు. నిత్యం గ్రామస్తులు అనేక అవసరాల రీత్యా వస్తున్న ప్రస్తుత గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకున్నందున నూతన భవనం వెంటనే పూర్తి చేయాలన్నారు. లేని పక్షంలో ఈ విషయం పంచాయతీ రాజ్ శాఖ పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. వారి వెంట గ్రామస్తులు బంటు సైదులు, కోటయ్య, అంజయ్య, జానయ్య, నాగేష్, బొడ్డు శ్రీను, పల్ల జానయ్య పాల్గొన్నారు.