ఆసియా క్రీడల్లో భారత్ మళ్లీ పతక జోరు పెంచింది. గురి తప్పుతున్న షూటర్లు తిరిగి గాడిలో పడ్డారు. షూటర్లు ఓ స్వర్ణం, రజతం గెలిచి అందించిన ఉత్సాహాన్ని అథ్లెట్లు ట్రాక్‌పై కొనసాగిస్తూ మూడు పతకాలతో మెప్పిస్తే.. టీటీలోనూ ఓ కాంస్యం భారత్‌ను వరించింది. కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్లో అడుగు పెట్టగా.. స్కాష్‌లో మూడు మెడల్స్ ఖాయం అయ్యాయి. కానీ, స్వర్ణం తెస్తారని ఆశించిన డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ -చిరాగ్ తొలి రౌండ్లోనే ఓడిపోవడం ఒక్కటే నిరాశ కలిగించే అంశం.

నగోయా: భారత పిస్టల్ షూటర్లు ఆసియా క్రీడల్లో ఎట్టకేలకు మెరిశారు. వరుస ఎదురుదెబ్బల తర్వాత భారత శిబిరంలో పసిడి జోష్ నింపారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో కమల్జీత్- సురుచి ఇందర్ సింగ్ గేమ్స్ రికార్డు బ్రేక్ చేస్తూ స్వర్ణ పతకాన్ని ముద్దాడారు. వ్యక్తిగత విభాగాల్లో ఎదురైన నిరాశను చెరిపేస్తూ మెగా క్రీడల్లో దేశానికి రెండో పసిడి పతకాన్ని అందించారు. మరోవైపు, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, రుద్రాంక్ష్ పాటిల్, నీరజ్ కుమార్‌తో కూడిన భారత త్రయం రజత పతకాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ ఫైనల్లో కమల్జీత్- సురుచి జోడీ 484.6 పాయింట్లతో గేమ్స్, ఆసియా రికార్డులు బ్రేక్ చేసి అగ్రస్థానం అందుకుంది.
రజతం సాధించిన దక్షిణ కొరియా జోడీ సుహ్యాన్ హాంగ్ – గెయున్ చూ (478.0 పాయింట్లు) కంటే భారత జంట ఏకంగా 6.6 పాయింట్ల భారీ ఆధిక్యంలో నిలవడం విశేషం. సురుచి 245.7 పాయింట్లు సాధించగా, కమల్జీత్ 238.9 పాయింట్లు జత చేశాడు. ఇరాన్ జట్టు (415.8 పాయింట్లు) కాంస్య పతకాన్ని దక్కించుకుంది. అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్లోనూ భారత జంట అత్యధికంగా 587 పాయింట్లు సాధించింది. ఇది ఆసియాడ్ క్వాలిఫికేషన్ రికార్డు కాగా, ఆసియా రికార్డును సమమైంది.అంతకుముందు పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కమల్జీత్ 9వ స్థానంతో.. మహిళల్లో సురుచి 26వ స్థానంతో ఫైనల్ చేరుకోలేకపోయారు.

ఇక, పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ విభాగంలో ప్రతాప్ సింగ్, రుద్రాంక్ష్ , నీరజ్ కూడిన భారత జట్టు మొత్తంగా 1762 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రజతాన్ని దక్కించుకుంది. చైనా జట్టు 1766 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించగా, దక్షిణ కొరియా (1751 పాయింట్లు) కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అంతకుముందు వ్యక్తిగత విభాగం ఫైనల్లో ప్రతాప్ సింగ్ 327.6 పాయింట్లతో 5వ స్థానంతో సరిపెట్టుకోగా, నీరజ్ కుమార్ 8వ స్థానంలో నిలిచాడు.
భారత బాక్సర్ సచిన్ శివాచ్ పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. పురుషుల 60 కేజీల కేటగిరీ ప్రిక్వార్టర్స్ పోరులో సచిన్ 4-1తో జోర్డాన్‌కు చెందిన మహమ్మద్ అద్నాన్ అబు జజేహ్పై ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. కానీ, మహిళల 54 కేజీల విభాగంలో గత ఆసియా క్రీడల కాంస్య విజేత ప్రీతి పవార్ 0-5తో ఉత్తర కొరియా బాక్సర్ పాంగ్ చోల్ మి చేతిలో చిత్తుగా ఓడిపోయింది. మరోవైపు మహిళల హాకీ జట్టు 3-1తో ఆతిథ్య జపాన్ను ఓడించి సెమీఫైనల్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. ఫెన్సింగ్ పురుషుల ఫాయిల్, మహిళల యిపీ జట్లు ప్రిక్వార్టర్స్‌లోనే ఓటమి చవిచూశాయి.

టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత జోడీ మనుష్ షా – దియా చితలే కాంస్యం అందుకుంది. సెమీఫైనల్లో మనుష్ – దియా జంట 0-4తో చైనా ద్వయం, రెండో ర్యాంకర్ వాంగ్ చుకిన్ – సన్ యింగ్ చేతిలో ఓటమి పాలైంది. ఇక సింగిల్స్ విభాగంలో షా, యశస్విని ఘోర్పడే ప్రిక్వార్టర్స్ చేరగా..ఆకుల శ్రీజ సహా మిగతా ప్యాడ్లర్ల పోరాటం ముగిసింది. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో జోష్న చిన్నప్ప – వేలవన్ సెంథిల్ కుమార్, మహిళల సింగిల్స్‌లో అనాహత్ సింగ్, పురుషుల సింగిల్స్‌లో అభయ్ సింగ్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లడంతో భారత్‌కు మూడు పతకాలు ఖాయం అయ్యాయి. వీర్ చోత్రానీ క్వార్టర్స్‌లో ఓడాడు. ఆసియా క్రీడల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచే విజేతలకు 2028 ఒలింపిక్స్ బెర్తు కూడా లభిస్తుంది.

ఆసియాడ్‌లో భారత కబడ్డీ జట్లు తమ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. డిఫెండింగ్ చాంపియన్లు అయిన పురుషులు, మహిళల జట్లు ఏకపక్ష విజయాలతో ఫైనల్లోకి అడుగుపెట్టి స్వర్ణ పతకాలకు అడుగు దూరంలో నిలిచాయి. మహిళల సెమీఫైనల్లో భారత్ 48-24తో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచే రైడింగ్, డిఫెన్స్‌లో అమ్మాయిలు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. పురుషుల సెమీఫైనల్ పోరులో భారత్ 66-28తో థాయ్‌లాండ్‌ను చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచే విరుచుకుపడిన భారత ఆటగాళ్లు తొలి సగంలోనే 37-18 ఆధిక్యాన్ని దక్కించుకున్నారు. శనివారం జరిగే ఫైనల్లో ఇరు జట్లూ ఇరాన్‌తో తలపడనున్నాయి.

బ్యాడ్మింటన్‌లో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ. మరోసారి స్వర్ణ పతకం సాధిస్తుందని భావించిన డిఫెండింగ్ చాంపియన్ సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. పురుషుల డబుల్స్ తొలి పోరులో భారత ద్వయం 21-12, 19-21, 14-21తో థాయిలాండ్‌కు చెందిన పకపోన్- పిరాట్చయ్ సుక్ఫున్ చేతిలో అనూహ్యంగా ఓడింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ 21-16, 16-21, 21-16తో హాంకాంగ్ జంటపై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో – ధ్రువ్ కపిల జోడీ కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

భారీ అంచనాలున్న అథ్లెటిక్స్‌లో భారత్‌కు మరో మూడు పతకాలు లభించాయి. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ పురుషుల 10 వేల మీటర్ల పరుగులో రజతంగెలుచుకున్నాడు. 28 నిమిషాల 29.38 సెకన్ల టైమింగ్‌తో రేసును రెండో స్థానంలో ముగించాడు. భారత ఆర్మీలో నాయబ్ సుబేదార్‌గా విధుల్లో ఉన్న 28 ఏండ్ల గుల్వీర్ గత ఆసియాడ్‌లో సాధించిన కాంస్య పతకాన్ని ఈసారి రజతంగా మెరుగుపరుచుకున్నాడు. మహిళల పోల్ వాల్ట్‌లో 29 ఏండ్ల బరానికా ఇలంగోవన్ చరిత్రాత్మక కాంస్య పతకాన్ని సాధించింది. ఈ పోటీలో ఆమె 4.15 మీటర్ల ఎత్తును అధిగమించి మూడో స్థానంలో నిలిచింది. పోల్ వాల్ట్ విభాగంలో భారత్‌కు లభించిన తొలి పతకం ఇదే కావడం విశేషం. మహిళల షాట్‌పుట్ పోటీల్లో భారత అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ గుండును 17.17 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.