హైదరాబాద్ సౌత్ సర్కిల్ కిషన్‌బాగ్ సెక్షన్లో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సుమారు ఐదు గంటలకు పైగా కరెంట్ లేకపోవడంతో స్థానికులు చాలా ఇబ్బంది పడ్డారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పిన అధికారులు గణేశ్ నిమజ్జనం సమయంలో కరెంట్ తీసేయడంపై స్థానికులు మండిపడ్డారు. హైదరాబాద్ సౌత్ సర్కిల్ అత్తాపూర్ సెక్షన్లో నాలుగు గంటలకు పైగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. పెద్ద గణేశ్ విగ్రహాలు ఆ ప్రాంతం నుంచి ముందుకు సాగుతున్న క్రమంలో కరెంట్ లేకపోవడంతో స్థానికులు టీజీఎస్పీడీసీఎల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిటీబ్యూరో,(నమస్తే తెలంగాణ): విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా వారి నుంచి స్పందన లేదంటూ ఆరోపిస్తున్నారు. గణేశ్ నిమజ్జనం రోజున సౌత్ సర్కిల్లోనే అధికంగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. అత్తాపూర్, కిషన్‌బాగ్, పుత్లీబౌలి, మలక్‌పేట తదితర సెక్షన్లలో గంటల తరబడి కరెంట్ పోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. డిస్కం సిబ్బంది గణేశ్ నిమజ్జన విధుల్లో ఉన్నామంటూ ఈ సమస్యలు పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని చెప్పి ఐదారుగంటలు, చాంద్రాయణగుట్టలో ఉదయం నుంచి రాత్రి వరకు కరెంట్ లేని పరిస్థితి ఉందంటే నగరంలో అప్రకటిత విద్యుత్ కోతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నగరవాసుల ఫిర్యాదులతో తెలుస్తోంది.
ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడంలో దక్షిణ డిస్కం విఫలమవుతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనకు ఉన్న 21 సర్కిళ్లలో కరెంట్ కోతలపై వస్తున్న ఫిర్యాదులను పట్టించుకోకుండా నిరంతరాయ విద్యుత్ అందిస్తున్నామని, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారంటూ ప్రకటిస్తూనే వారి సమీక్షల్లో మాత్రం ఈ విద్యుత్ కోతల అంశం రానీయకుండా జాగ్రత్త పడుతున్నారన్న చర్చ జరుగుతోంది.
ఇటీవల సీఎం రేవంత్ కూడా రివ్యూ చేసినప్పుడు రైతుల ఆందోళనలు చర్చకు రాకుండా యూజీ కేబుల్ విషయమే ప్రధానంగా ప్రస్తావించేలా డిప్యూటీ వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది. నందనవనం సబ్‌స్టేషన్ నుంచి నందిహిల్స్ ఫీడర్ ఆరురోజుల క్రితం బ్రేక్ డౌన్ అయింది. అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో డిస్క్ ఇన్సులేటర్లో సమస్య తలెత్తి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. నాలుగు గంటల తర్వాత పునరుద్ధరించారు. తిరిగి మూడురోజుల క్రితం ఇదే ప్రాంతంలో డీటీఆర్‌లో వైర్ సమస్య వచ్చి ట్రాన్స్‌ఫార్మర్‌నే మార్చేశారు. మళ్లీ శుక్రవారం చంపాపేట్ డివిజన్ నందనవనం ఫీడర్లో ఉదయం నుంచి నాలుగుసార్లు కరెంట్ పోయి వస్తున్నదని స్థానికులు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఫీడర్ బాగానే ఉన్నప్పటికీ డీటీఆర్ న్యూట్రల్ సమస్యను సరిచేశామని సిబ్బంది చెప్పారు. ఇది ఒక్క వారంలోనే మూడుసార్లు అదే సబ్‌స్టేషన్‌కు సంబంధించిన సమస్య. ఫీడర్లు, డీటీఆర్‌లలో సమస్యలు తలెత్తుతున్నాయని సిబ్బంది చెబుతూనే తీవ్ర ఒత్తిడి ఉందంటూ తలలు పట్టుకుంటున్నారు. వారం రోజులుగా హైదరాబాద్ నగరంలోని పది సర్కిళ్ల పరిధిలో అప్రకటిత కరెంట్ కోతలపై వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో ఎక్కువగా హైదరాబాద్ సౌత్, సెంట్రల్, సైబర్‌సిటీ, హబ్సిగూడ సర్కిళ్లలోనే ఉన్నట్లుగా అధికారులు చెప్పారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రతిరోజూ గంటల తరబడి కరెంట్ కోతలతో పాటు లోవోల్టేజి సమస్యపైనే స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే విద్యుత్ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మళ్లీ మళ్లీ అవే ప్రాంతాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందుకు కారణాలపై సిబ్బంది సైతం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. విద్యుత్ వినియోగం విపరీతంగా పెరగడంతో ఫీడర్లపై, డీటీఆర్లపై ఒత్తిడి అధికమైందని, దీంతో అవి కాలిపోతున్నాయని ఒక సీనియర్ అధికారి చెప్పారు.
ఈ విషయంలో తామేం చేయలేకపోతున్నామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా దగ్గరలోని మరో ఫీడర్ నుంచి సరఫరా ఇచ్చినప్పటికీ అక్కడ కూడా ఒత్తిడి పెరుగుతున్నదని, సబ్స్టేషన్లు పెరిగి పెరుగుతున్న వినియోగాన్ని తట్టుకునే స్థాయిలో పరికరాలు ఏర్పాటైతే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం నగరంలోని చాలా సర్కిళ్లలో ప్రతిరోజూ గంటల తరబడి కరెంట్ పోతున్నా విద్యుత్ ఉన్నతాధికారులు మాత్రం అసలు కరెంట్ ఎక్కడ పోతున్నదంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
సోషల్‌మీడియాలోని టీజీఎస్పీడీసీఎల్ అధికారిక వాల్స్‌పై ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నప్పటికీ వాటి విషయంలో ఏఐ సమాధానాలే తప్ప పెద్దగా పట్టింపు లేకుండానే ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధిక వినియోగంతో ఎదురవుతున్న సమస్యలను తట్టుకునేందుకు తామేం చెప్పినా మింట్‌కాంపౌండ్ అధికారులు వినే పరిస్థితుల్లో లేరని మేడ్చల్ జోన్‌కు చెందిన ఓ అధికారి చెప్పారు. తమ దగ్గర ఉన్న సమస్యలపై కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సూచించామని, కానీ ఉన్నతాధికారులు మాత్రం కొత్తకొత్త ప్రయోగాలపై దృష్టి పెడుతున్నారే తప్ప సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించడం లేదని ఆ సీనియర్ అధికారి పేర్కొన్నారు.