ట్రక్‌పార్క్ భూములపై నం.2 మంత్రి కన్ను
వివాదాలు చుట్టుముట్టిన భూముల వేలానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మూసాపేటలోని ట్రక్ పార్క్ భూములపై కన్నేసిన నం.2 మంత్రి ప్రోద్బలంతో విలువైన భూములను అమ్మేసేందుకు హెచ్ఎండీఏ అంతా రెడీ చేసుకున్నది.
- వివాదాలు చుట్టుముట్టినా వేలానికి హెచ్ఎండీఏ సిద్ధం
- హుడా హైట్స్ వేలం బెడిసికొట్టినా ఇక్కడ ఆగని ప్రక్రియ
- హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉన్నా మొండిగా ముందుకు
- ప్రజావసరాలను కాలరాస్తూ.. ఆందోళనలను బేఖాతరు చేస్తూ మంత్రికి కట్టబెట్టేందుకు యంత్రాంగం కసరత్తు
- నేషనల్ హైవే వెంబడి వందల కోట్ల భూములకు ఎసరు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : వివాదాలు చుట్టుముట్టిన భూముల వేలానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మూసాపేటలోని ట్రక్ పార్క్ భూములపై కన్నేసిన నం.2 మంత్రి ప్రోద్బలంతో విలువైన భూములను అమ్మేసేందుకు హెచ్ఎండీఏ అంతా రెడీ చేసుకున్నది. భూముల వేలంపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉండగానే ప్రజావసరాలను కాలరాస్తూ మొండిగా ముందుకు పోతున్నది. ఈ భూములను కాపాడాలని స్థానికులు చేస్తున్న ఆందోళనను బేఖాతరు చేస్తూ, సదరు మంత్రికి అప్పనంగా కట్టబెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తున్నది.
కూకట్పల్లి పరిధిలోని మూసాపేట లేఅవుట్లో ఉన్న 3.15 ఎకరాల ట్రక్ పారు భూమి విలువ వందల కో ట్లలో ఉంటుంది.
వీటిని నెం.2 మంత్రికి చెందిన సంస్థలకు అప్పనంగా కట్టబెట్టేందుకే హెచ్ఎండీఏ అధికారులు తెరవెనుక అన్ని ఏర్పాట్టు పూర్తిచేశారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో భూములను వేలం వేయవద్దని స్థానికులు, ట్రక్ అసోసియేషన్‌తోపాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆందోళనలు చేపట్టారు. ఈ వేలాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్లు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైనప్పటికీ, న్యాయస్థానం ఎలాంటి మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న ఈ-వేలాన్ని యథావిధిగా నిర్వహించేందుకు హెచ్ఎండీఏ రంగం సిద్ధం చేసింది. ఆన్లైన్లో వేలం ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరుగుతున్నట్టు కనిపించినప్పటికీ, అంతిమంగా ఈ భూములు సదరు మంత్రి అనుయాయుల కంపెనీ చేతుల్లోకే వెళ్లేలా వ్యూహరచన జరిగిందనే చర్చ జోరుగా సాగుతున్నది.
మంత్రి కోసం ప్రజాప్రయోజనాలకు తూట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు వేలం వేసిన భూముల్లో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో బడా నేతల ప్రయోజనాలు దాగి ఉన్నాయనే ఆరోపణలున్నాయి. గడిచిన మూడేండ్లలో ఇదే తీరుగా విలువైన భూములను కొల్లగొట్టారనే చర్చ నడస్తున్నది. తాజాగా అదే తరహాలో జాతీయ రహదారి వెంబడి ఉండే విలువైన భూమి వేలానికి సిద్ధపడటం వివాదస్పదంగా మారింది.
హుడా హైట్స్‌లో బెడిసికొట్టినా..
ఇదే సమయంలో బంజారాహిల్స్ సమీపంలోని అత్యంత ఖరీదైన హుడా హైట్స్ ప్లాట్ల ఈ-వేలం పూర్తిగా విఫలమై హెచ్ఎండీఏకు గట్టి షాక్ ఇచ్చింది. షేక్‌పేట మండలం ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని 8 ప్రీమియం ప్లాట్ల విక్రయానికి ఈ నెల 25న వేలం వేయగా, ఒక బిడ్డర్ కూడా ముందుకు రాలేదు. రూ.600 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు భారీ అంచనాలు వేసుకున్నారు. కానీ రియల్ ఎస్టేట్ సంస్థలు వెనకి తగ్గడంతో హుడా హైట్స్ వేలం అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. గతంలో హెచ్ఎండీఏ వేలమంటే ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా ఉండేది.
కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వివాదాస్పద భూములతోపాటు ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన స్థలాలను విక్రయానికి పెట్టడంతో సంస్థ ప్రతిష్ఠ మసకబారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హుడా హైట్స్ వేలం బెడిసికొట్టి కొనుగోలుదారులు వెనుకంజ వేసినప్పుడైనా ప్రభుత్వం పునరాలోచించకుండా వివాదాలున్న ట్రక్పార్ భూముల వేలంతో ముందుకెళ్లడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మొదటి ప్రయత్నం విఫలమైనప్పటికీ, హుడా హైట్స్ ప్లాట్లను డిసెంబర్లో మరోసారి వేలం వేయాలని హెచ్ఎండీఏ యోచిస్తున్నది.
‘భూముల పరిరక్షణకు సుప్రీంకోర్టుకెళ్తా’
ప్రజా ప్రయోజనాలను మరచి కాంగ్రెస్ సర్కార్ భూములను విక్రయిస్తున్నది. విలువైన భూములను పరిరక్షించాలని ఓవైపు న్యాయపోరాటం సాగుతుండగానే, తీర్పు రిజర్వ్‌లో ఉన్నదనే విషయాన్ని పట్టించుకోకుండా వేలానికి సిద్ధమైన తీరు దుర్మార్గం. తుది తీర్పుపై ఎలాంటి స్పష్టత రాక ముందే కేవలం భూములను విక్రయిస్తామని ప్రకటించడం సరైనది కాదు. ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకొని, మూసాపేట ట్రక్కు పార్కు భూముల పరిరక్షణకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తా. ప్రజల పక్షాన పోరాడి, ట్రక్ పార్కు భూములను కాంగ్రెస్ పెద్దల చేతుల్లోకి వెళ్లకుండా కచ్చితంగా అడ్డుకుంటాం. – మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

