Kiara Advani | బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బట్వారా 1947’ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సన్నీ డియోల్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ఓ క్యారెక్టర్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నటి కనికా కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫ్లోరల్ సూట్, లైట్ బ్రౌన్ దుపట్టాతో ఎలాంటి గ్లామర్ హంగులు లేకుండా సింపుల్ లుక్‌లో కనిపించిన కనికాను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోస్టర్లో ఆమె రూపం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని పోలి ఉండటంతో సోషల్ మీడియాలో పోలికలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
“ఇది కనికా కపూర్ కాదు.. కియారా అద్వానీయే కదా?”, “పోస్టర్లో కియారా పేరు ఎందుకు లేదు?”, “ఏఐతో పోస్టర్ డిజైన్ చేశారా?” అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం లైటింగ్, మేకప్, ఫోటో ఎడిటింగ్ కారణంగానే ఈ పోలికలు వచ్చాయని అభిప్రాయపడుతున్నారు. ఈ పోస్టర్ వైరల్ కావడంతో కనికా కపూర్ కూడా సరదాగా స్పందించారు. సోషల్ మీడియాలో తనను కియారా అద్వానీతో పోలుస్తూ వచ్చిన ఓ కామెంట్‌కు ఆమె నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు. దీంతో ఈ చర్చకు మరింత ఊపు వచ్చింది. అయితే కనికా కపూర్ ఇతర ఫొటోలను పరిశీలిస్తే ఆమెకు కియారా అద్వానీతో పెద్దగా పోలికలు కనిపించవని అభిమానులు చెబుతున్నారు. ఈ ఒక్క పోస్టర్లో మాత్రమే కెమెరా యాంగిల్, లైటింగ్, మేకప్ కారణంగా ఇద్దరి రూపాల్లో సారూప్యత కనిపించిందని అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీకి చెందిన కనికా కపూర్ ‘బట్వారా 1947’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. అంతకుముందు ‘ఏక్ దుజే కే వాస్తే 2’ వంటి టెలివిజన్ సీరియల్స్, పలు వెబ్ సిరీస్‌లు, మోడలింగ్ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. పలు బ్యూటీ పేజెంట్లలో విజేతగా నిలిచిన ఆమె చిన్నప్పటి నుంచే నటిగా రాణించాలని కలలు కనగా, ఇప్పుడు భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌తో సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. దేశ విభజన నేపథ్యంలో రూపొందుతున్న బట్వారా 1947 లో సన్నీ డియోల్, ప్రీతి జింటా, షబానా ఆజ్మీ, కరణ్ డియోల్‌తో పాటు కనికా కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.