Strawberries | స్ట్రాబెర్రీలు రుచికరమైన బెర్రీ పండ్లలో ఒకటి. తీపి, స్వల్ప పులుపు కలిసిన వీటి ప్రత్యేక రుచి చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. రుచితోపాటు పోషక విలువలు కూడా సమృద్ధిగా ఉండే ఈ పండ్లు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, మాంగనీస్, ఫోలేట్, పొటాషియం, బి విటమిన్లు వంటి అనేక కీలక పోషకాలను అందిస్తాయి. అయితే మంచి నాణ్యమైన స్ట్రాబెర్రీలను ఎంపిక చేయడం, వాటిని సరైన విధంగా నిల్వ చేయడం తెలియకపోతే అవి త్వరగా మెత్తబడిపోవడం లేదా పాడైపోవడం జరుగుతుంది. కొన్ని సులభమైన సూచనలు పాటిస్తే తాజా స్ట్రాబెర్రీలను ఎక్కువ కాలం ఆస్వాదించవచ్చు. స్ట్రాబెర్రీలు సంవత్సరమంతా కొన్ని ప్రాంతాల్లో లభించినప్పటికీ, శీతాకాలంలో కొనుగోలు చేస్తే మరింత తాజా రుచి, మంచి నాణ్యత లభిస్తుంది. ఈ కాలంలో పండే స్ట్రాబెర్రీలు సహజమైన తీపి, సువాసనతో ఉంటాయి. అందువల్ల సీజన్లోనే వీటిని కొనుగోలు చేయడం ఉత్తమం. అయితే అన్ సీజన్లోనూ వీటిని సరిగ్గా ఎంపిక చేసి నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి.
స్ట్రాబెర్రీలను కొనుగోలు చేసే సమయంలో వాటి సువాసనను గమనించాలి. తాజాగా ఉన్న పండ్లకు సహజమైన తియ్యని వాసన ఉంటుంది. దుర్వాసన లేదా పులిసిన వాసన వస్తే వాటిని కొనుగోలు చేయకపోవడం మంచిది. వీలైతే సూపర్మార్కెట్ల కంటే స్థానిక రైతు బజార్లు లేదా తాజా పండ్లు విక్రయించే దుకాణాల నుంచి కొనుగోలు చేస్తే మంచి నాణ్యత లభించే అవకాశం ఎక్కువ. స్ట్రాబెర్రీల రంగు, ఆకారాన్ని కూడా పరిశీలించాలి. మంచి స్ట్రాబెర్రీలు గట్టిగా ఉండి ప్రకాశవంతమైన ఎరుపు రంగులో కనిపిస్తాయి. పండుపై నల్లని మచ్చలు, గాయాలు లేదా బూజు ఉండకూడదు. ఇంకా పచ్చగా ఉన్న పండ్లను ఇంటికి తీసుకెళ్లి పండిస్తామని భావించకూడదు. అలాంటి పండ్లకు పూర్తి రుచి ఉండదు. అలాగే పండుకు పైభాగంలో ఉండే ఆకుపచ్చ కాడ తాజాగా, గట్టిగా ఉండటం కూడా నాణ్యతకు సూచిక.
చాలా పెద్ద స్ట్రాబెర్రీల కంటే మధ్యస్థ పరిమాణంలో ఉన్న పండ్లను ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఎక్కువ రుచిగా, రసంతో నిండుగా ఉంటాయి. చాలా పెద్ద పండ్లు కొన్నిసార్లు లోపల ఖాళీగా లేదా నీటి శాతం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరీ చిన్న పండ్లలో గింజలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. స్ట్రాబెర్రీలను కొనుగోలు చేసిన వెంటనే కడగకూడదు. వెంటనే తినాలనుకుంటే మాత్రమే నీటితో శుభ్రం చేయాలి. ముందుగానే కడిగితే అవి నీటిని పీల్చుకుని త్వరగా మెత్తబడి పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల తినే ముందు మాత్రమే కడగడం ఉత్తమం. వారంలోపు ఉపయోగించాలనుకుంటే స్ట్రాబెర్రీలను ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే వాటిని పేపర్ టవల్లో చుట్టి ఉంచితే అదనపు తేమను పీల్చుకుని పండ్లు ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. తేమ ఎక్కువైతే అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
ఒక సంవత్సరం వరకు నిల్వ చేయాలనుకుంటే ఫ్రీజర్‌లో ఉంచడం ఉత్తమ మార్గం. ముందుగా స్ట్రాబెర్రీలను బాగా కడిగి పూర్తిగా ఆరబెట్టాలి. తరువాత కాడలను తొలగించి గాలి చొరబడని డబ్బా లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రీజ్ చేయాలి. ఇలా నిల్వ చేస్తే మంచు స్ఫటికాలు ఏర్పడకుండా ఉండటంతో పాటు పండ్ల నాణ్యత కూడా ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. నిల్వ చేసిన స్ట్రాబెర్రీలను పై, సాస్‌లు, సలాడ్లు, సిరియల్స్‌లో కలిపి ఉపయోగించవచ్చు. అలాగే స్మూతీలు, మిల్క్‌షేక్‌లు లేదా డెజర్ట్‌లలో కూడా వీటిని వినియోగించవచ్చు. సరైన విధంగా ఎంపిక చేసి నిల్వ చేస్తే స్ట్రాబెర్రీల రుచిని, పోషకాలను చాలా కాలం ఆస్వాదించవచ్చు.