Sumanth | అక్కినేని హీరో సుమంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. భౌతిక శాస్త్ర సూత్రాన్ని మానవ జీవితంలోని కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ
ఇంజినీరింగ్ విద్యార్థి అయిన వినయ్ (త్రినాథ్ వర్మ) అనుమానాస్పద రీతిలో ఇంటిపై నుంచి పడి మరణిస్తాడు. అయితే ఈ కేసును ఛేదించే బాధ్యతను పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ (సుమంత్) తన భుజాన వేసుకుంటాడు. విచారణలో భాగంగా వినయ్ తల్లిదండ్రులు పార్వతి (షెల్లి ఎన్. కుమార్), గంగాధర్ (రవి వర్మ)లను విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. మరోవైపు, జ్యోతి అనే మహిళ యాక్సిడెంట్ కేసును కూడా వాసుదేవ్ టేకప్ చేస్తాడు. అసలు వినయ్ ఎవరు? అతని మరణానికి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ స్టీఫెన్ మెర్క్యురీ (జగపతి బాబు)కి ఉన్న సంబంధం ఏమిటి? జ్యోతి యాక్సిడెంట్ కేసుకు, వినయ్ – మెర్క్యురీలకు మధ్య ఉన్న లింక్ ఏంటి? ఈ సంఘటనలన్నింటినీ ఆధారంగా చేసుకుని ‘న్యూటన్ థర్డ్ లా’ పేరుతో పుస్తకం రాసింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్ర కథ.
విశ్లేషణ
ప్రతి చర్యకు దానికి సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది అనే న్యూటన్ మూడో సూత్రాన్ని.. మంచైనా చెడైనా చేసే ప్రతి కర్మకు తగిన ఫలితం అనుభవించాలనే కర్మ సిద్ధాంతానికి అనుసంధానించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రధమార్థంలో కథంతా 1999 నేపథ్యంలో సాగుతుంది. వినయ్ మరణం, జ్యోతి ప్రమాదం అనే రెండు ప్రధాన సంఘటనలతో సినిమా ప్రారంభమవుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా సుమంత్ ఎంట్రీ ఇవ్వడం, విచారణను ప్రారంభించడం బాగుంది. అయితే, ప్రథమార్థంలో కథనం కొద్దిగా నెమ్మదిగా సాగుతుంది. ఇంటర్వెల్ పాటికి అసలు నిజాలపై ఆసక్తిని రేకెత్తిస్తూ ద్వితీయార్ధంపై అంచనాలను పెంచారు. ద్వితీయార్ధంలో అసలైన యాక్షన్ మరియు క్రైమ్ డ్రామా మొదలవుతుంది. వినయ్, అతని స్నేహితుడు కార్తీక్ చేసిన తప్పిదం ఏమిటి? మెర్క్యురీతో వారి ప్రయాణం ఎలా ముడిపడింది? అనే విషయాలను ఉత్కంఠభరితంగా చూపించారు.
నటీనటుల ప్రతిభ
సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుమంత్ తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. వినయ్‌గా త్రినాథ్ వర్మ, అతని స్నేహితుడు కార్తీక్‌గా పండిట్ గౌతమ్ తమ పాత్రలకు పూర్తిన్యాయం చేశారు. వినయ్ తల్లిగా నటించిన షెల్లి కుమార్ భావోద్వేగ సన్నివేశాల్లో చక్కటి నటన కనబరిచారు. జగపతి బాబు అతిథి పాత్రలో మెరిశారు. నేహా పఠాన్, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విభాగం
దర్శకుడు రాజేశ్ కర్ణ ఎంచుకున్న పాయింట్ రొటీన్‌గా అనిపించినా, స్క్రీన్ ప్లే ద్వారా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. సింజిత్ యర్రమిల్లి అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను ఎలివేట్ చేసింది. వేద వ్యాస్ గొట్టిపాటి సినిమాటోగ్రఫీ, ఎడిటర్ పనితీరు కథకు తగినట్లుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్లు
సుమంత్ నటన
కర్మ సిద్ధాంతం ఆధారంగా రూపొందించిన కాన్సెప్ట్
ద్వితీయార్ధంలోని కొన్ని కీలక మలుపులు
నేపథ్య సంగీతం, విజువల్స్
మైనస్ పాయింట్లు
అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం
ఫస్ట్ హాఫ్‌లో మరింత వేగం ఉంటే బాగుండేది
చివరిగా కథాకథనాల్లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది.