నగరానికి అత్యంత కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థగా మారిన మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు దశకు తెచ్చి, టేకోవర్ చేసుకోవడంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. మొదట జూన్ 30 నాటికి ప్రక్రియను ముగిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఆ తర్వాత సెప్టెంబర్ 30కి పొడిగించి, దసరా నాటికల్లా తుది ఘట్టం పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే నిధుల సమీకరణలో ఆశించిన పురోగతి లేకపోవడంతో తాజాగా వచ్చే డిసెంబర్ 31 వరకు ఎల్ అండ్ టీ మరోసారి గడువును పొడిగించాల్సి వచ్చింది. ఇప్పటికే రెండు సార్లు గడువు దాటిపోవడం, ప్రభుత్వం వద్ద స్పష్టమైన విధానం లేకపోవడంతో కాలయాపన అవుతుంది. దీంతో గడువులోగా ఈ సారైన మెట్రో స్వాధీనం పూర్తి చేస్తారా? అసలు నిబంధనల ప్రకారం టేకోవర్ సాధ్యమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
– సిటీబ్యూరో, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ)
ఎల్ అండ్ టీకి చెందిన రూ.1461.47 కోట్ల ఈక్విటీ భాగస్వామ్యంతోపాటు, మెట్రో పీపీపీ మోడల్లోని సుమారు రూ.13,600 కోట్ల బ్యాంకు రుణ భారాన్ని మోసేందుకు రేవంత్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. నిధులను తక్కువ వడ్డీతో బ్యాంకుల నుంచి రీఫైనాన్సింగ్ ద్వారా సమీకరించేందుకు ఎస్బీఐ క్యాప్స్ సంస్థకు రూ.2.50 కోట్ల కన్సల్టెన్సీ ఫీజుతో బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం ఎస్బీఐ క్యాప్స్‌కు తక్కువ వడ్డీకే రుణాలు తీసుకురావాలని నిబంధన పెట్టడంతో ఈ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. కాగా, పీక్ అవర్స్‌లో రైళ్లలో విపరీతమైన రద్దీలోనే ప్రయాణికులు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. మెట్రో స్టేషన్లలో నిర్వహణ అధ్వానంగా మారడంతో, సాంకేతిక పునర్ నిర్మాణ పనులు కూడా మందగించడంతో నిత్యం లక్షలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలయాపన జరుగుతున్న కొద్దీ ప్రాజెక్టుపై పడుతున్న ఆర్థిక భారం తడిసి మోపెడవుతోంది.