న్యూఢిల్లీ/హైదరాబాద్, ఫిబ్రవరి 12 : బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు, వడ్డీరేట్ల తగ్గింపుపై అమెరికా ఫెడరల్ రిజర్వు నీళ్లు చల్లడంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల నుంచి ఈక్విటీ మార్కెట్లకు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇదే క్రమంలో దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.400 తగ్గి రూ.1.6 లక్షలకు పరిమితమైంది. కానీ, వెండి ధరలు యథాతథంగా రూ.2.68 లక్షల వద్ద ఉన్నది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,200 దిగి రూ.1,58,400గా నమోదైంది.
అంతకుముందు ఇది రూ.1,59, 600గా ఉన్నది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,100 తగ్గి రూ.1,45,200కి దిగొచ్చింది. కిలో వెండి మాత్రం యథాతథంగా రూ.3 లక్షలుగా కొనసాగుతున్నది. గడిచిన మూడు రోజులుగా ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుండటంతో వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 114 డాలర్లు తగ్గి 4,984 డాలర్లకు పడిపోగా, వెండి 8 శాతం తగ్గి 76.83 డాలర్లకు పరిమితమయ్యాయి.