Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్ భారత్‌లో ఎప్పటికీ ముఖ్యమైన ప్రాంతం అని, ఈ ప్రాంతం సురక్షితంగా ఉంటుందని ఇండియాలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు. ఆయన బుధవారం రెండు రోజుల పర్యటనలో భాగంగా శ్రీనగర్ చేరుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌తోపాటు లదాక్ ప్రాంతాలను ఆయన సందర్శిస్తారు. ఈ సందర్భంగా శ్రీనగర్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లాను కలిశారు. జమ్మూ కాశ్మీర్ అంశంపై ఆయన స్పందించారు.
‘‘జమ్మూ కాశ్మీర్ ఇండియాలో ముఖ్యమైన ప్రాంతం. నేను తొలిసారి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నా. ఇదెంతో అందమైన ప్రదేశం. చాలా అద్భుతంగా ఉంది. సీఎంతో సమావేశం ఎంతో బాగా జరిగింది. ఈ ప్రాంతంతో సంబంధాలు బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తాం’’ అన్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లకూడదని అమెరికా తన పౌరులకు సూచించింది. ఈ అంశంపై సెర్గియో స్పందించారు. గతంలో ఈ విషయంలో అమెరికా ప్రకటన చేసిందని, ఇలాంటి అంశాల్లో ఎప్పటికప్పుడు పరిస్తితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే తమ దేశ పౌరులు జమ్మూ కాశ్మీర్ సందర్శించే అంశంపై ఉన్న సూచనల్ని తొలగించే అవకాశం ఉందన్నారు.
అయితే, ఇప్పటికిప్పుడు తాను ఎలాంటి ప్రకటనా చేయలేనని, కానీ, ఈ అంశంపై మాత్రం దృష్టి సారిస్తామని సెర్గియో అన్నారు. అంటే, అమెరికన్ పౌరులు కాశ్మీర్ పర్యటించకూడదంటూ గతంలో చేసిన సూచనను అమెరికా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ అమెరికా ఎప్పటికీ పరిష్కరించబోదని, కేంద్రంతోనే తమ సమస్యలు పరిష్కరించుకుంటామని సీఎం ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. విదేశీ ప్రతినిధుల వద్ద తన దేశం గురించి ఫిర్యాదు చేయబోనన్నారు.