కాంగ్రెస్ సర్కార్ ‘భూ’ వేటకు దళితులు, బలహీన వర్గాల రైతులు బలి అవుతున్న్నరు. విలువైన అసైన్డ్ భూములు ఎక్కడ కనిపించినా మూడేండ్లుగా గద్దల్లా వాలిపోతున్నరు. ఇప్పుడు వారి కన్ను సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పేదల భూములపై పడింది. ‘అడగ్గానే భూమి ఇస్తే మంచిది.. లేదంటే గుంజుకునుడే’ అని ధమ్కీ ఇస్తూ భూ దందా సాగిస్తున్నరు. పైకి చట్టబద్ధత అనే కలరింగ్ ఇస్తున్నప్పటికీ, తరచిచూస్తే అడుగడుగునా అక్రమాలే కనిపిస్తున్నయ్. దీనికి పారిశ్రామిక పార్కుల ముసుగు తొడుగుతున్నరు. ఒకటీ రెండూ కాదు.. ఇలా ఏకంగా 1,100 ఎకరాలను కొల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేశారు. ఇప్పటికే 700 ఎకరాలను ఖతం చేశారు. మరో 400 ఎకరాలను హస్తగతం చేసుకోబోతున్నరు.
స్థానిక టీజీఐఐసీ ‘పెద్ద’ల కుటుంబం, మరో జాతీయస్థాయి నేత కనుసన్నల్లోనే ఈ అసైన్డ్ భూముల ఆరగింత కార్యక్రమం సాగుతున్నదని బాధితులు కన్నీరుమున్నీరు అవుతున్నరు. కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారని వారు వాపోతున్నరు. పరిశ్రమల పేరుతో సాగిస్తున్న భూసేకరణ వెనుక రాజకీయ జోక్యం, కంపెనీలతో బేరసారాలు, ముడుపుల దందా నడుస్తున్నయ్. అసైనీలకే అన్ని హక్కులు కల్పిస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్.. ఇప్పుడు బలవంతపు భూసేకరణతో పేద రైతుల్ని బాధితులుగా మారుస్తున్నది.
వాళ్లంతా దళితులు.. దశాబ్దాలుగా అసైన్డ్ భూమిని నమ్ముకుని బతుకు సాగిస్తున్నరు. భూముల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ పాలనలో దళారుల చేతికి చిక్కి దగా పడ్డరు వాళ్లు. సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకు జాతీయ రహదారి వెంబడి విలువైన అసైన్డ్ భూములపై కన్నేసిన అధికార పార్టీ నేతలు.. పారిశ్రామిక పార్కు ముసుగులో భూదందా సాగిస్తున్నరు. రైతుల్ని నయానోభయానో బెదిరించి, లొంగితే ఎంతోకొంత విదిలించి విలువైన భూముల్ని అగ్గువకు గుంజుకుంటున్నరు. మార్కెట్లో ఎకరం భూమి ధర రూ.9 కోట్ల వరకూ పలుకుతుండగా, రూ.25 లక్షలకే రైతులనుంచి తీసుకుంటున్నరు. లొంగకపోతే సర్కార్ తమదేనని, చూసుకుంటామని ధమ్కీ ఇస్తున్నరు.
కాంగ్రెస్ సర్కార్ ‘భూ’ వేటకు దళితులు, బలహీన వర్గాల రైతులు బలి అవుతున్నారు. విలువైన అసైన్డ్ భూములు ఎక్కడ కనిపించినా మూడేండ్లుగా గద్దల్లా వాలిపోతున్నారు. ఇప్పుడు వారి కన్ను సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పేదల భూములపై పడింది. ‘అడగ్గానే భూమి ఇస్తే మంచిది.. లేదంటే గుంజుకునుడే’ అన్నట్టుగా వ్యవహరిస్తూ, యథేచ్ఛగా భూ దందా సాగిస్తున్నారు. పైకి చట్టబద్ధత అనే కలరింగ్ ఇస్తున్నప్పటికీ, తరచి చూస్తే అడుగడుగునా అక్రమాలే వెలుగుచూస్తున్నాయి. దీనికి పారిశ్రామిక పార్కుల ముసుగు తొడుగుతున్నారు. ఒకటికాదు.. రెండు కాదు.. మొత్తం 1,100 ఎకరాలను కొల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేశారు.
ఇప్పటికే 700 ఎకరాలను పొతం పట్టించారు. మరో 400 ఎకరాలను హస్తగతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదంతా స్థానిక టీజీఐఐసీ ‘పెద్ద’ల కుటుంబం, మరో జాతీయ స్థాయి నేత కనుసన్నల్లోనే సాగుతున్నదని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘నీ భూమిని గుంజుకోవడం మాకు పెద్ద లెక్కకాదు.. మా వెనుక ఎవరున్నరో తెలుసా!’ అని బెదిరింపులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ కుంభకోణం వెనుక పెద్దలు ఉన్నారనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు. ‘కంచే చేనుమేసినట్టు’.. కాపాడాల్సిన సర్కార్ పెద్దలే అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారంటూ అసైనీలు బిక్కుబిక్కుమంటున్నారు.
అసలైన లబ్ధిదారులకు భూములపై అన్ని హక్కులు కల్పిస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికి, ఇప్పుడు పాలకులై అసలుకే ఎసరుపెట్టారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండాలెత్తారు. ‘గత ప్రభుత్వంలో స్వాధీనం చేసుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను అసలైన లబ్ధిదారులకు తిరిగి ఇస్తాం. ప్రజా ప్రయోజనం కోసం భూమి సేకరించినప్పుడు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం ఇస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నిస్తున్నారు.
పరిశ్రమల పేరుతో చేస్తున్న ఈ భూ సేకరణ వెనుక రాజకీయ జోక్యం, కంపెనీలతో బేరసారాలు, ముడుపుల వ్యవహారం నడుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఎకరాకు రూ.5-9 కోట్ల వరకు పలుకుతున్న భూములకు అసైనీలకు కేవలం రూ.25-50 లక్షలే చెల్లిస్తున్నారని చెప్తున్నారు. తరాలుగా భూమినే నమ్ముకున్న తమకు భిక్షం వేసి, దళారుల అవతారం ఎత్తిన నేతలు మాత్రం రూ.కోట్లు పంచుకుంటున్నారని మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ మోసంపై బాధితులు ఎదురు తిరుగుతున్నారు. భూములు ఇచ్చేది లేదని గ్రామసభల్లో తేల్చి చెప్తున్నారు. హైకోర్టును ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు .
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : ‘దళితులకు సంపూర్ణ భూహక్కులు కల్పిస్తాం. అసైన్డ్ భూములకు పట్టాలిస్తాం’ ఇదీ ఎన్నికల ముందు తెలంగాణ దళిత బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన భరోసా. కానీ అధికారంలోకి వచ్చాక, మాట మారింది. దళితులకు భూములు ఇవ్వడం మాట అటుంచితే, అప్పటికే ఇచ్చిన భూములను గుంజుకొన్నారు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో దళిత భూములపై కాంగ్రెస్ పెద్దలు కన్నేశారు. పటాన్చెరు నుంచి జహీరాబాద్ వరకూ.. ముంబయి జాతీయ రహదారి 65 మొదలు.. హైదరాబాద్ -మెదక్ ప్రధాన రోడ్డు వరకూ అటూ ఇటూ అనే తేడాలేకుండా రోడ్డుకు 10 కిలోమీటర్ల పరిధిలో అసైన్డ్ భూమి ఉంటే చాలు.. గద్దల్లా వాలిపోతున్నారు.
కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత ఒకరు బెదిరింపులతో దళిత రైతుల నుంచి భూములు గుంజుకొనే బాధ్యత తీసుకోగా.. అదే పార్టీకి చెందిన మరో జాతీయ స్థాయి నేత ఆ భూములను కట్టబెట్టడానికి పరిశ్రమల ప్రతినిధులతో మంతనాలు సాగిస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్టు ఈ వ్యవహారంలో ప్రభుత్వ సంస్థ టీజీఐఐసీ కూడా చేరింది. అలా మొత్తంగా 700 ఎకరాల దళిత, బహుజన వర్గాల భూములను ఇప్పటికే తమ ‘హస్త’వాసితో ఖతం పెట్టగా.. మరో 400 ఎకరాలను చెరబట్టడానికి రంగం సిద్ధమైంది. రూ.3 వేల కోట్ల విలువైన ఈ చీకటి భూదందా కథ పూర్తిగా తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే!
అది సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం ఆరూర్ గ్రామం. హైదరాబాద్ నగరానికి 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దశాబ్దాల కిందటి నుంచి పేద, దళిత కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. ఇక్కడి 134 మంది పేద, దళిత కుటుంబాల జీవనోపాధి కోసమంటూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో దాదాపు 193 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఈ భూముల్లోనే ఆయా కుటుంబాలు ఇప్పటికీ వ్యవసాయం చేసుకొంటున్నాయి. కాలగమనంలో ఆరూర్ గ్రామ శివార్లలో అభివృద్ధి ఊపందుకొన్నది. పైగా ఈ గ్రామం గుండానే హైదరాబాద్ -ముంబయి జాతీయ రహదారి-65 కూడా వెళ్లడంతో భూముల రేట్లు అమాంతం ఆకాశాన్నంటాయి. ఇప్పుడు ఎకరం ధర గరిష్ఠంగా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు పలుకుతున్నది. దీంతో దళిత రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇదే సమయంలో టీజీఐఐసీ ఇచ్చిన నోటిఫికేషన్ వారి ఆశలపై నీళ్లు చల్లింది.
ఆరూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 224, 263, 268లో ఉన్న 193.14 ఎకరాల అసైన్డ్ భూముల సేకరణకు టీజీఐఐసీ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఏండ్ల నుంచి తాము వ్యవసాయం చేసుకొంటున్నామని, ఈ భూములే తమకు జీవనాధారం అని, వీటిని లాక్కొంటే ఎలా బతికేదని? దళిత రైతులు అడ్డుపడినప్పటికీ భూసేకరణ ప్రక్రియ మాత్రం ఆగలేదు. అంతేకాదు, ఎకరం రూ. 6 కోట్లు పలుకుతున్న భూములకు.. రూ. 25 లక్షలు మాత్రమే చెల్లించి తమ వద్ద నుంచి ఎకరాలకు ఎకరాలను టీజీఐఐసీ బలవంతంగా లాక్కొన్నదని బాధిత రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఆరూర్లోనే కాదు ఇదే సదాశివపేట మండలం పెద్దాపూర్‌లోని సర్వే నంబర్ 476లో కూడా 68 ఎకరాల భూమిని ఇదే విధంగా తక్కువ పరిహారం చెల్లించి బలవంతంగా తమ నుంచి సేకరించినట్టు బాధిత రైతులు వాపోతున్నారు. అలా సేకరించిన భూములను పెప్సీ అనుబంధ సంస్థ వరుణ్ బ్రూవరీస్‌కు కట్టబెట్టినట్టు చెప్తున్నారు. రూ.కోట్ల విలువజేసిన తమ భూములను సేకరించడంతో తమకు ఉపాధి కరువయ్యిందని, దీనికి పరిహారంగా తమకు రావాల్సిన న్యాయమైన పరిహారం రూ.2.50 కోట్లతో పాటు 250 గజాల ఇంటి స్థలాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఎకరాకు రూ.4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల ధర ఉన్నదని, కానీ ప్రతి రైతుకూ ఎకరాకు కేవలం రూ. 25 లక్షలు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంలో భూ సేకరణ నుంచి పరిశ్రమకు కేటాయింపు వరకు జరిగిన ప్రక్రియను బహిరంగపరచాలని బాధితులు కోరుతున్నారు. ఎంతకు సేకరించారు? ఎంతకు కేటాయించారు? కేటాయింపు సమయంలో భూమి ధర ఎంత? పరిశ్రమ పెట్టుబడి ఎంత? ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత? అనే వివరాల మీద శ్వేతపత్రం బయట పెట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక, కొండాపూర్ మండల పరిధిలోని ఆలియాబాద్, తొగర్పల్లి సర్వే నంబర్లు 29, 418లోని 43.15 ఎకరాలను కూడా రైతుల నుంచి సేకరించి.. కేజేఎస్ కంపెనీకి ధారాదత్తం చేశారని రైతులు గుర్తుచేస్తున్నారు. మరోవైపు, ఇదే మండలంలోని మునిదేవునిపల్లిలో సర్వే నంబర్ 92లో ఉన్న 293.17 ఎకరాలను సేకరించడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. అధికారులు సర్వే కూడా చేశారు. అయితే, తమకు ఎకరాకు కనీసం రూ.కోటి పరిహారం ఇవ్వకుండా భూసేకరణ చేస్తే, పోరాటానికి దిగాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని ఒక్క సదాశివపేట మండలంలోనే కాదు.. కంది, కొండాపూర్, గుమ్మడిదల తదితర మండలాల్లోనూ ఈ తరహా భూసేకరణే కొనసాగుతున్నది. టీజీఐఐసీ చట్టబద్ధంగా చేస్తున్నట్టు కనిపిస్తున్న ఈ భూ సేకరణను గ్రామాల్లోకి వెళ్లి లో తుగా పరిశీలిస్తే కొత్త కోణం బ యటపడింది. టీజీఐఐసీ సేకరిస్తున్నది మా రుమూల ప్రాంతాల్లోని బంజరు భూ ములు కాదు. జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న అత్యంత విలువైన అసైన్డ్ భూములను టార్గెట్ చేసి బలవంతంగా గుంజుకొంటున్నట్టు వెలుగులోకి వచ్చింది.
సదాశివపేట, కంది, కొండాపూర్, సంగారెడ్డి, గుమ్మడిదల మండలాల్లో పారిశ్రామిక పార్కుల కోసం టీజీఐఐసీ నేతృత్వంలో నోటిఫికేషన్లు, సర్వేలు, భూసేకరణ ప్రతిపాదనలు జరుగుతున్నాయి. సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా వివరాలను కలిపి చూస్తే సుమారు 1,100 ఎకరాల అసైన్డ్ భూములు భూసేకరణ ప్రక్రియలోకి వచ్చినట్టు తెలుస్తున్నది. ఇది చిన్నచిన్న భూసేకరణల సమాహారం కానేకాదు. హైవేలు, ఐఐటీ పరిసరాలు, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక కారిడార్లు, భవిష్యత్తు రీజినల్ రింగ్ రోడ్డుకు దగ్గర ప్రాంతాలు.. ఇలా ఈ భూసేకరణంతా ఒకే మ్యాప్‌పై స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే, ఇదేదో.. ఒకదానికొకటి సంబంధం లేకుండా సాగుతున్న భూసేకరణ ఎంతమాత్రం కాదని బాధిత రైతుల వ్యాఖ్యలను బట్టి అర్థమవుతున్నది.
ఇదే సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే జహీరాబాద్, పటాన్చెరు, పాశమైలారం, బుచ్చినెల్లి, సుల్తాన్పూర్ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున టీజీఐఐసీ పారిశ్రామిక భూముల వ్యవస్థ ఉన్నది. అధికారిక పారిశ్రామిక కారిడార్లలో పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇంకా మిగిలే ఉన్నాయి. పారిశ్రామికవేత్తలకు అవసరం అనుకుంటే అన్ని అనుమతులతో కూడిన భూమి సిద్ధంగా ఉన్నది. అయితే, సిద్ధంగా ఆధీనంలో ఉన్న భూమిని వదిలేసి.. హైవే పక్కనున్న దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములనే వరుసగా ఎందుకు సేకరిస్తున్నారు? నిజంగా పరిశ్రమల అవసరానికా?లేక హైవే ఫేసింగ్ భూముల భవిష్యత్తు విలువను దృష్టిలో ఉంచుకొనే ఈ సేకరణ జరుగుతున్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా దళితుల భూములే టార్గెట్‌గా ఈ భూసేకరణ కొనసాగుతున్నదని బాధితులు ఆరోపిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో భూసేకరణపై లోతుగా విశ్లేషిస్తే పలు విషయాలు తెలిశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే జాతీయ రహదారుల వెంట ఉన్న అసైన్డ్ భూములపై నిఘా పెట్టినట్టు బాధితులు చెప్తున్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, స్థానిక కాంగ్రెస్ కీలక నేతలకు నేరుగా ఫోన్లు చేసి అసైన్డ్ పట్టాదారులపై ఒత్తిడి తేవాలని ఉప్పందించినట్టు చెప్తున్నారు. ‘ఇది మీ పట్టా భూమి కాదు.. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమి. ఎప్పటికీ మీ సొంతం కాదు. ఇప్పుడు కాకపోతే రేపైనా ప్రభుత్వం తీసుకుంటుంది.
ఇక్కడ పరిశ్రమలు పెట్టే ఆలోచన ఉన్నది. మీరే ముందుకొచ్చి ప్రభుత్వానికి అప్పగిస్తే, పరిహారం వస్తుంది. ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటే రూపాయి కూడా దక్కదు’ అంటూ తమను భయపెట్టినట్టు బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ధైర్యం కోల్పోయిన కొందరు రైతులు ‘గంతకాదు.. గింతైనా ఇప్పించండి’ అంటూ బతిమాలుకున్నట్టు సమాచారం. ఇలా 10, 20 మంది రైతులు ఒకచోట చేరగానే స్థానిక నేతలు ఆయా బాధిత రైతులను అధికార కాంగ్రెస్‌కు చెందిన, టీజీఐఐసీతో అనుబంధం ఉన్న ఓ సీనియర్ నేత వద్దకు తీసుకెళ్లినట్టు చెప్తున్నారు. అక్కడ రైతులతో ఎకరాకు ఒక ధర మాట్లాడి, ఆ మొత్తాన్ని చెల్లించి ‘ఈ భూములు మాకు వద్దు’ అంటూ రైతుల చేతనే పట్టాలు, భూములను ఆర్డీవోకు సరెండర్ చేయించినట్టు రైతులు వాపోతున్నారు.
రైతుల నుంచి భూములను గుంజుకొన్న తర్వాత అధికార పార్టీకి చెందిన జాతీయ స్థాయి మరో నేత మల్టీనేషనల్ పారిశ్రామిక వర్గాలను రంగంలోకి దింపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌కు అతి సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని కోట్ల రూపాయల విలువైన భూమి అందుబాటులో ఉన్నదని, తక్కువ ధరకే దొరికే అవకాశం ఉన్నదని చెప్పి.. బహుళజాతి, భారీ పారిశ్రామిక సంస్థలను తీసుకువచ్చినట్టు చెప్తున్నారు. తర్వాత ఆయా కంపెనీలతో సంబంధిత గ్రామం, సర్వే నంబర్ పేర్కొంటూ తమ పారిశ్రామిక విస్తరణకు సదరు భూమిని కేటాయించాలని దరఖాస్తులు పెట్టించినట్టు సమాచారం.
దరఖాస్తు పడగానే స్థానిక స్థాయిలో కలెక్టరేట్ , రెవెన్యూ అధికార యంత్రాంగంపై రాజకీయ ఒత్తిడి తెచ్చి ‘ఆ భూమి అందుబాటులో ఉన్నది’ అని అనుకూల నివేదికలు ఇప్పించినట్టు చెప్తున్నారు. అనంతరం అధికారిక ప్రక్రియ పూర్తి చేసి అదే భూమిని పరిశ్రమలకు కేటాయించే మార్గం సుగమం చేసి వైట్ కాలర్ వ్యాపారానికి తెరతీసినట్టు ఆరోపిస్తున్నారు. దళితుల అసైన్డ్ భూములను పట్టాదారుల నుంచి ఎకరాకు గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు సమీకరించి, ఆ తర్వాత పారిశ్రామిక సంస్థలకు ఎకరాకు రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు విలువ కట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నామినల్ ధర, అభివృద్ధి, ఇతర వ్యయాలు కలిపి ఎకరాకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చయినా.. ఒక్కో ఎకరాపై కనీసం రూ.3 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.6 కోట్ల వరకు మిగులు ఉంటుందని ఈ వ్యవహారంపై ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. ధరలు, లాభాల లెక్కలకు సంబంధించి భూ కేటాయింపులు, చెల్లింపులు, కంపెనీల ప్రాజెక్టు ప్రతిపాదనలు, ప్రభుత్వ రికార్డులతో సమగ్రంగా నిర్ధారించాల్సి ఉంది.
టీజీఐఐసీ రంగంలోకి వచ్చిన తర్వాత ఈ తతంగానికి మరో రూపం వచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లతో రైతులను ఒప్పించి భూములు సరెండర్ చేయించే విధానం కొనసాగుతుండగానే, మధ్యలో టీజీఐఐసీ పేరుతో నోటిఫికేషన్లు జారీ చేసి భూసేకరణ చేపడుతున్నట్టు బాధితులు చెప్తున్నారు. టీజీఐఐసీ ద్వారా భూములు సేకరించి, అనంతరం పరిశ్రమలకు కేటాయించే విధానం అమల్లోకి వచ్చిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇందుకోసం పటాన్చెరు నుంచి జహీరాబాద్ వరకు ప్రతి తహసీల్దార్ పరిధిలోని అసైన్డ్ భూముల వివరాలను సేకరించి, రహదారుల వెంట ఉన్న విలువైన భూములను ప్రత్యేకంగా గుర్తించినట్టు సమాచారం. ముందుగా టీజీఐఐసీ నోటిఫికేషన్ .. ఆ వెంటనే ‘భూమి పోతుంది’ అనే ప్రచారం.. దాంతో రైతుల్లో భయాందోళనలు.. చివరికి ‘ఎలాగూ భూమి పోతుంది’ అన్న నిస్సహాయతలో ఎంతోకొంత ధర మాట్లాడుకొని రైతులు తమ భూమిని అప్పగించే పరిస్థితి కల్పిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటివరకూ ఈ విధానంలో సుమారు 700 ఎకరాల వరకు కేటాయించినట్టు టీజీఐఐసీ రికార్డులు చెప్తున్నాయని ఈ వ్యవహారంపై ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు.
ఒక్కో ఎకరాపై కనీసం రూ.3కోట్ల నుంచి రూ. 6 కోట్ల మిగులు అనే ఆరోపణలున్నాయి. వీటిలో కనిష్ఠంగా రూ.3 కోట్ల మిగులు పరిగణనలోకి తీసుకున్నా.. 700 ఎకరాలకు కనిష్ఠంగా రూ.2,100 కోట్ల భారీ స్కామ్ జరిగినట్టు చెప్తున్నారు. ఇప్పుడు భూ సేకరణ జరుగుతున్న 400 ఎకరాలను కలుపుకొంటే.. స్కామ్ విలువ రూ.3 వేల కోట్ల పైమాటేనని అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తంలో ఎంత భూమి నిజంగా కేటాయించబడింది? రైతులకు ఎంత చెల్లించారు? పరిశ్రమలకు ఏ ధరకు కేటాయించారు? ప్రభుత్వానికి వచ్చిన మొత్తం ఎంత? మధ్యలో ఎవరికెంత ప్రయోజనం కలిగింది? అన్నది టీజీఐఐసీ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులను పక్కపక్కన పెట్టి విచారిస్తేనే అసలు లెక్క తేలుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్నికల మ్యానిఫెస్టోలో అసైన్డ్ భూముల విషయంలో కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన చేసింది. అంతేకాదు ఓట్ల కోసం ఊరూరా తిరుగుతూ అప్పటి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘గతంలో స్వాధీనం చేసుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను అసలైన లబ్ధిదారులకు తిరిగి ఇస్తాం. పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. అమ్మకం, పునర్విక్రయ హక్కులు ఇస్తాం. ప్రజా ప్రయోజనం కోసం భూమి సేకరించినప్పుడు.. అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం ఇస్తాం’ అన్నారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల భూములకు ఇప్పుడు ఎసరు పెడుతున్నది.
దళిత, బహుజనుల భూసేకరణపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. పరిశ్రమల పేరిట ప్రభుత్వం దళితుల కడుపు కొట్టడంపై మండిపడ్డారు. పేదల భూములు కాకుండా బంజరు భూములను పరిశ్రమల కోసం ఉపయోగించాలని హితవు పలికారు. తప్పనిసరిగా అసైన్డ్ భూములు తీసుకోవాల్సి వస్తే, ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం.. బాధిత కుటుంబానికి న్యాయమైన పరిహారం చెల్లించడంతో పాటు, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రంతో పాటు భూసేకరణపై ఫిర్యాదు చేశారు. ఇందులో దాదాపు రూ 3,000 కోట్ల భారీ భూ కుంభకోణం ఉన్నదని, టీజీఐఐసీ భూసేకరణ వెనుక ఉన్న ముడుపులు, రాజకీయ జోక్యం, మల్టీనేషనల్ కంపెనీలకు భూములు కట్టబెట్టడం తదితర అంశాలపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.
దళితుల భూములను బలవంతంగా గుంజుకోవాలనుకోవటం అన్యాయమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. తరతరాలుగా సాగు చేసుకొంటున్న ఈ భూమే వారికి జీవనాధారమని, అలాంటి భూమిని పరిశ్రమల కోసం తీసుకోవడం సరికాదని సూచించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని హితవుపలికారు. రైతుల భూములను రైతులకే కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని, వారి పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే రైతులతో కలిసి కలెక్టరేట్, సచివాలయం స్థాయిలో ఆందోళనలు చేపట్టి, రైతులకు న్యాయం జరిగేవరకూ పోరాడుతామని తేల్చిచెప్పారు.
మాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. దాదాపు 40 ఏండ్ల నుంచి ఆ భూమినే నమ్ముకొని బతుకుతున్నం. ఏటా వరి, కూరగాయలు పండించుకొని కుటుంబాన్ని పోషించుకొంటున్నం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మా భూములను పరిశ్రమలకు కేటాయించేందుకు చూస్తున్నదని తెలిసి గుండెలు గుభేల్మంటున్నయ్. ఈ భూమి పోతే మాకు బతుకు దెరువు ఉండదు. పిల్లల్ని ఎట్లా సాదుకోవాల్నో కూడా అర్థం కావడం లేదు. మా భూములు మాకే ఉండాలె. ఊర్లోని రైతులంతా ఒక్కటై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతం. భూమి కోసం ఎంతదాకైనా పోరాడుతం.
-చాపల కళావతి, నల్లవల్లి గ్రామం
పంటలు పండించే భూములు మాకు ఉన్నదే గింత. గీ భూమినే సాగు చేసుకుంటూ బతుకుతున్నం. ఈ కాస్త భూమిని గుంజుకుంటే మేము ఎట్లా బతుకాలె? కాంగ్రెస్సోళ్లు ఎన్నికల సమయంలో తెలంగాణ మొత్తం అసైన్డ్ భూములకు పట్టాలిచ్చి రైతుల్ని పక్కా పట్టాదారులను చేస్తమని మాట ఇచ్చి.. ఇప్పుడేమో మా భూములను గుంజుకుంటున్నరు. మేం మీ భూముల్లో లేము కదా? మా తాత ముత్తాతాల నుంచి వస్తున్న భూముల్లోనే ఉన్నం. దళితుల వద్ద ఉన్న భూములను గుంజుకోవడమేనా ప్రజాపాలన అంటే? ఇప్పటికైనా అధికారులు నోటీసులను వెనక్కి తీసుకుని రైతులకు న్యాయం చెయ్యాలె. పరిశ్రమల పేరుతో రైతులను నట్టేట ముంచడం మానెయ్యాలె.
-డప్పు సాల్మన్, మల్కాపూర్ రైతు
డబ్బు ఏండ్ల నుంచి ఈ భూమినే నమ్ముకొని సాగు చేసుకుంటూ బతుకుతున్నం. ఇప్పుడు ప్రభుత్వం మా భూములు లాక్కొని పరిశ్రమలకు కేటాయిస్తే మేం రోడ్డున పడుతం. మాకున్న ఆరున్నర ఎకరాల భూమిని పరిశ్రమలకు ఇస్తే మేమేం కావాలె? ఈ భూముల్లో ఏటా వరి, మక్క, కూరగాయలు పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నం. భూమిపోతే మా బతుకు పోయినట్టే. మా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. రైతులందరం ఒక్కటై పోరాడుతం. అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని తరిమికొట్టేంత వరకు ఉద్యమిస్తం.
-బనుక నర్సమ్మ, నల్లవల్లి గ్రామం
కూరగాయల పంటలే మా బతుకు దెరువు. ఆ పంటల సాగుతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నం. మాకున్న నాలుగు ఎకరాల భూమిని పరిశ్రమలకు కేటాయిస్తామని అధికారులు నోటీసులిచ్చిండ్రు. ఈ భూమి పోతే మాకు ఇంకేం మిగులదు. మా పచ్చని భూములను పరిశ్రమలకు అప్పగిస్తే చావుకైనా సిద్ధమవుతం. రైతుల కడుపు కొట్టి పరిశ్రమలు పెట్టడం ఏం న్యాయం? రైతులను ఇబ్బందులు పెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలే. మా భూములను పరిశ్రమలకు కేటాయించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే రైతులంతా ఒక్కటై పోరాడుతం.
-దోమడుగు శంకర్, మాజీ సర్పంచ్, నల్లవల్లి గ్రామం
సదాశివపేట మండలంలోనే కాదు కంది మండలంలోనూ ఈ భూమాయ కొనసాగింది. కంది మండలం చెర్యాల్లోని సర్వే నంబర్ 741లో 107.34 ఎకరాలు మరో వివాదాస్పద భూసేకరణ కేంద్రంగా మారింది. ఐఐటీ హైదరాబాద్ సమీపంలో, హైదరాబాద్ -ముంబయి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ భూములను పారిశ్రామిక అవసరాల కోసం తీసుకునే ప్రక్రియ మొదలైంది. ఇక్కడి భూముల విలువపై రైతులు, ప్రభుత్వం చెప్తున్న లెక్కల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నదని బాధితులు చెప్తున్నారు. ఆ ప్రకారం.. మార్కెట్లో ఎకరానికి రూ.7 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు పలుకుతున్నది. స్థానిక కాంగ్రెస్ నాయకుడు, వారి అనుచరులు బెదిరించి కేవలం రూ.90 లక్షలు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరానికి రూ.2.50 కోట్ల పరిహారం.. 250 గజాల నివేశన స్థలం ఇవ్వాలని తాము డిమాండ్ చేశామని రైతులు చెప్తున్నారు. ఎన్నికలప్పుడు పట్టా భూమితో సమానంగా పరిహారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన ధర నిర్ణయించారని? మార్కెట్ విలువను ఎలా లెక్కించారని? తాము నిలదీశామని, భూమికి తగిన పరిహారం ఇవ్వకపోతే బీఆర్ఎస్ భవన్‌కు వెళ్తామని తెగేసి చెప్పటంతో, కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మరికొంత పరిహారం ఇప్పిస్తామని కాంగ్రెస్ నేత స్వయంగా హామీ ఇచ్చినట్టు బాధిత దళిత రైతు ఒకరు చెప్పారు.
ఇక కొండాపూర్ మండలం మల్కాపూర్‌లోని సర్వే నంబర్ 481లో సుమారు 250 ఎకరాలు ఈ భూమాయలో అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఈ భూములను 1955-1960 ప్రాంతంలో భూమిలేని దళితులు, బీసీలకు అప్పటి ప్రభుత్వం అసైన్ చేసినట్టు అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి. సుమారు 180 మంది పేదలకు ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు భూమి ఇచ్చినట్టు నమోదైంది. మూడు, నాలుగు తరాలుగా వారసులు సాగు చేస్తున్న ఈ భూములపై ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నేత దృష్టి పడ్డట్టు సమాచారం. ఈ భూముల్లో కొంత భాగం జాతీయ రహదారి 65కు ఆనుకొని ఉండటం, భవిష్యత్తు రీజినల్ రింగ్ రోడ్డుకు సమీపంగా ఉండటం వల్ల ఈ భూముల మార్కెట్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉన్నదని స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పట్టా భూముల విలువ ఎకరానికి రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు పలుకుతున్నదని స్థానికంగా చెప్తున్నారు. ఇదే సర్వే నంబర్ మీద గత వారం నిర్వహించిన గ్రామసభలో బాధిత రైతులు.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘ప్రాణాలైనా ఇస్తాం.. భూములు మాత్రం ఇవ్వం’ అంటూ రైతులు స్పష్టం చేయడంతో గ్రామసభ అర్ధాంతరంగా నిలిచిపోయింది.
పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలో మెదక్ -హైదరాబాద్ రహదారి వెంబడి ఉన్న నల్లవల్లి సర్వే నంబర్ 142లో 126.09 ఎకరాలు, సర్వే నంబర్ 160లో 211.28 ఎకరాలు, అన్నారం సర్వే నంబర్ 261/1లో 66 ఎకరాలు.. మొత్తం సుమారు 400 ఎకరాల అసైన్డ్ భూములకు టీజీఐఐసీ నోటిఫికేషన్లు జారీ చేసింది. అన్నారంలోని 261 సర్వే నంబర్లో గతంలో 117 మంది పేద రైతులకు ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు ఇచ్చినట్టు తాజా నివేదిక పేర్కొన్నది. అదే ప్రాంతంలో 66 ఎకరాలను టీజీఐఐసీ కోసం స్వాధీనం చేసుకునేందుకు ప్రాథమికంగా నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అయితే, తమ భూములను సేకరిస్తూ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను సవాల్ చేస్తూ నల్లవల్లి, అన్నారం రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో భూసేకరణ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు సమాచారం.