రాయ్‌పూర్: ఒక వ్యక్తి తన కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఒకసారి అబార్షన్ చేయించాడు. మరోసారి గర్భవతి కావడంతో వివాహమైనట్లు తప్పుడు ఆధారాలు సృష్టించాడు. ఆసుపత్రిలో ఆమె ప్రసవించిన బిడ్డను డాక్టర్ సహాయంతో అమ్మేశాడు. (Father rapes Daughter) బాధిత యువతి ఫిర్యాదుపై ఆమె తండ్రితో సహా ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 16 ఏళ్ల కుమార్తెపై ఆమె తండ్రి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. ఆ బాలిక గర్భం దాల్చగా మాత్రలతో అబార్షన్ అయ్యేలా చేశాడు.
కాగా, ఆ తర్వాత కూడా ఆ వ్యక్తి తన కూతురుపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో 2025లో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఆమెను ఒక మహిళ ఇంటికి తీసుకెళ్లాడు. ఆ మహిళ తనకు తెలిసిన వ్యక్తి ఇంట్లో ఆ యువతిని కొన్ని రోజులు ఉంచింది. అతడితో వివాహమైనట్లు నమ్మించేందుకు, ఆ బాలికను మేజర్‌గా చూపించేందుకు ఆధార్ కార్డును ఫోర్జరీ చేశారు.
మరోవైపు రాయ్‌పూర్‌లోని దంగనియాలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కాన్పు కోసం ఆ యువతిని అడ్మిట్ చేశారు. సిజేరియన్ ద్వారా మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అయితే ప్రసవం తర్వాత డాక్టర్ సహాయంతో ఆ బిడ్డను యువతి తండ్రి అమ్మేశాడు. ఆ తర్వాత 15 రోజుల పాటు తనకు తెలిసిన వ్యక్తి ఇంట్లో ఆమెను ఉంచాడు. అనంతరం తన ఇంటికి తీసుకెళ్లాడు.
ఆ యువతి చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె తండ్రితో సహా ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోక్సో, పిల్లల చట్టాలతో సహా పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.