మణిపూర్ మణిదీపం మీరాబాయి చాను మళ్లీ మ్యాజిక్ చేసింది. ఆసియా క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో 28 ఏండ్ల పతక నిరీక్షణకు తెరదించుతూ చాను చారిత్రక రజతంతో మెరిసింది. షూటింగ్లో స్కీట్ జట్లు, బ్యాడ్మింటన్‌లో పురుషుల జట్టు, సాఫ్ట్ టెన్నిస్‌లో జై మీనా కాంస్య పతకాలు గెలిచారు. వుషులో రోషిబినా దేవి ఫైనల్ చేరి స్వర్ణ ఆశలు సజీవంగా నిలిపినా.. భారీ అంచనాలున్న స్టార్ షూటర్లు మను భాకర్, ఇషా సింగ్ తీవ్రంగా నిరాశపరిచారు.

Meera With Medal
నగోయా (జపాన్): భారత స్టార్ లిఫ్టర్, ఒలింపిక్ మెడలిస్ట్ మీరాబాయి చాను మరో అరుదైన ఘనత సాధించింది. తన కెరీర్లో లోటుగా ఉన్న ఆసియా క్రీడల పతకం అందుకుంది. మెగా గేమ్స్‌లో భారత్‌కు 28 ఏండ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వెయిట్ లిఫ్టింగ్ మెడల్‌ను ‘ఎత్తు’కొచ్చింది. 2014 నుంచి ఈ మెగా క్రీడల్లో పతక బోణీ కొట్టాలని ఎదురుచూస్తున్న మీరాబాయి 12 ఏండ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు తన కల నెరవేర్చుకుంది. బుధవారం జరిగిన మహిళల 49 కేజీల కేటగిరీలో మీరా మొత్తం 198 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించింది.
1998లో కరణం మల్లేశ్వరి సాధించిన రజతం తర్వాత ఆసియాడ్ లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలి పతకం ఇదే కావడం విశేషం. ‘ఈ పతకంతో కల నిజమైంది. నా జీవితం పరిపూర్ణమైంది’ అని విజయం అనంతరం మీరాబాయి సంతోషం వ్యక్తం చేసింది. గత రెండు ఎడిషన్లలో కొద్దిలో పతకాలు చేజార్చుకున్న మీరా ఈసారి అంచనాలను అందుకుంది. స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీల బరువు మోసింది. నార్త్ కొరియాకు చెందిన డబుల్ వరల్డ్ చాంపియన్ రి సంగ్ గమ్ మొత్తం 215 (94+121 కేజీ) వరుసగా మూడోసారి స్వర్ణం కైవసం చేసుకుంది.
బ్యాడ్మింటన్‌లో కాంస్యంతో సరి
భారత పురుషుల జట్టు టీమ్ విభాగం సెమీఫైనల్లో 1-3తో బలమైన చైనా చేతిలో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్ 16-21, 18-21తో ఆరో ర్యాంకర్ షి యుకీ చేతిలో ఓడినా.. తొలి డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ 21-11, 22-20 ఒలింపిక్ రజత విజేతలు లియాంగ్ వే కెంగ్ – వాంగ్ చాంగ్‌ను ఓడించి జట్టును రేసులో నిలిపారు. కానీ, రెండో సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి 19-21, 13-21తో లి షి ఫెంగ్ చేతిలో ఓడగా.. రెండో డబుల్స్‌లో హరిహరన్-అర్జున్ జంట కూడా పరాజయం పాలవడంతో భారత్ ఫైనల్ చేరలేకపోయింది. అయినా 40 ఏండ్ల తర్వాత పురుషుల బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండు ఎడిషన్ల ఆసియాడ్‌లో భారత్‌కు పతకం లభించింది.
స్వర్ణ పోరుకు రోషిబినా

Roshibina Devi
వుషు మహిళల 60 కేజీల కేటగిరీ సెమీఫైనల్లో రోషిబినా దేవి 2-0తో ఇండోనేషియా ప్లేయర్ థానియా కుసుమాను ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో ఆమెకు కనీసం రజతం ఖాయమైంది. ఫైనల్లో చైనా క్రీడాకారిణి షియావోయు జంగ్ తో రోషిబినా తలపడనుంది. గత రెండు ఎడిషన్లలో రోషిబినా రజతం, కాంస్యం గెలిచింది.
సాఫ్ట్ టెన్నిస్లోతొలి మెడల్

Jay Meena
ఆసియా క్రీడల చరిత్రలో సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం లభించింది. పురుషుల విభాగంలో 26 ఏండ్ల జై మీనా కాంస్యం సాధించాడు. మెగా గేమ్స్‌లో మూడోసారి బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ ఆటగాడు జై సెమీఫైనల్లో 2-4తో జపాన్‌కు చెందిన టకుయా కురోసకా చేతిలో ఓడి కంచు పతకంతో తిరిగొచ్చాడు.
హాకీ, కబడ్డీ, టీటీలో జోరు

Womens Hockey
భారత మహిళల హాకీ జట్టు ఆసియాడ్‌లో గోల్స్ మోత మోగిస్తోంది. పూల్-బి మ్యాచ్‌లో భారత్ 20-1తో థాయిలాండ్‌ను చిత్తు చేసి వరుసగా మూడో విజయం అందుకుంది. డ్రాగ్ ఫ్లికర్ దీపికా సెహ్రావత్ ఒకే మ్యాచ్‌లో 9 గోల్స్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. 2, 8, 9, 24, 33, 36, 39, 51, 57వ నిమిషాల్లో లభించిన తొమ్మిది పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచింది. నవనీత్ కౌర్ 4 గోల్స్ కొట్టగా.. రుతుజా హ్యాట్రిక్ గోల్స్‌తో ఆకట్టుకుంది. కబడ్డీలో డిఫెండింగ్ చాంపియన్లు భారత పురుషుల, మహిళల జట్లు గ్రూప్ దశ మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించాయి. రెండో లీగ్ పోరులో అమ్మాయిలు 37-23తో ఇరాన్‌ను చిత్తు చేయగా.. అబ్బాయిలు 48-25తో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్నారు. ఇక, టీటీ మిక్స్డ్ డబుల్స్‌లో దియా- మానుష్, హర్మీత్ – యశస్విని జోడీలు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. పురుషుల కయాక్ ఫోర్స్ 500 మీటర్ల ఈవెంట్లో భారత జట్టు ఫైనల్ చేరగా.. మహిళల కనోయి సింగిల్ 200 మీటర్లలో మేఘా ప్రదీప్ సెమీస్‌కు క్వాలిఫై అయింది.
స్కీట్ జట్ల కాంస్య గురి మను, ఇషాకు షాక్..

Womens Skeet
మహిళల షూటింగ్లో ఎన్నో అంచనాలున్న ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మను భాకర్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్, యువ షూటర్ సురుచి సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో ఒట్టి చేతులతో తిరిగొచ్చారు. టీమ్ ఈవెంట్లో ఈ త్రయం నాలుగో స్థానంతో కొద్దిలో కాంస్య చేజార్చుకుంది. భారత్, వియత్నాం రెండు జట్లూ 1719 స్కోరుతో సమంగా నిలిచాయి. కానీ, వియత్నాంతో పోలిస్తే భారత త్రయం తక్కువసార్లు పదికి పది పాయింట్లు సాధించడంలో నాలుగో స్థానంతో పతక రేసు నుంచి వైదొలిగింది. వ్యక్తిగత విభాగంలో మను భాకర్ మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధించి తుదిపోరులో 181.1 స్కోరుతో ఐదో స్థానంతో సరిపెట్టింది.
ఇషా, సురుచి 15, 26 స్థానాలతో క్వాలిఫికేషన్ రౌండ్లో వెనుదిరిగారు. అయితే స్కీట్ ఈవెంట్లలో భారత షూటర్లు రాణించి రెండు కాంస్య పతకాలు అందించారు. మహిళల స్కీట్ టీమ్ కేటగిరీలో రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధాలివాల్‌తో కూడిన భారత జట్టు 331 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. మహిళల స్కీట్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. పురుషుల స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్‌జీత్, మైరాజ్ అహ్మద్ ఖాన్, భవతేఘ్ సింగ్ గిల్ తో కూడిన జట్టు 346 పాయింట్లతో కాంస్యం కైవసం చేసుకుంది. అనంత్‌జీత్ వ్యక్తిగత ఫైనల్లో 4వ స్థానంలో నిలిచి కొద్దిలో మరో పతకం కోల్పోయాడు.