మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్‌కు తెలిసింది ప్రతిపక్షాల మీద కమిషన్లు వేసుడు లేదా 30% కమీషన్లు తీసుకొనుడు మాత్రమేనని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని బుధవారం ఆయన పరామర్శించారు. తిరుగు ప్రయాణం లో జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నీటి నిర్వహణలో విఫలమైందని విమర్శించారు. ప్రస్తుత కరువు ఎల్ నినో వల్ల కాద ని, రేవంత్‌రెడ్డి తెచ్చిన కరువని, కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆరోపించారు. మోటర్లు ఆన్ ఆఫ్ చేయవద్దని ఇంజినీరింగ్ నిపుణులు ఎంత మొత్తుకున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని అన్నారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నడిపితే వాటి సామర్థ్యం దెబ్బతింటుందని, ఇలా చేయడం వల్లే కల్వకుర్తిలో ఒక మోటర్ కాలిపోయిందని అన్నారు.
కృష్ణా జలాల వినియోగంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తాత్కాలిక వాటా కింద మనకు 34% వాడుకునే హక్కు ఉన్నదని కానీ 2024-25లో 28%, 2025-26లో కేవలం 25% వాటా మాత్రమే వాడుకున్నట్టు తెలిపారు. మన హక్కుగా ఉన్న వాటాను కూడా వాడుకోలేని చేతగాని ప్రభుత్వమని విమర్శించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ జనరేషన్‌కు వాడిన నీటిని కూడా ఇందులో కలుపుతున్నారని, రైతులు వాడుకుంటేనే.. పొలాలకు ఇస్తేనే అది లెక్కలోకి వస్తుందని అన్నారు. సర్కార్ వైఫల్యం వల్ల పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద క్రాప్ హాలిడే ఇచ్చారని, ఏపీలో మాత్రం క్రాప్ హాలిడే లేదని అన్నారు. 88 టీఎంసీల నీళ్లు వాడినట్టు ఉత్తమ్ చెప్తున్నారని, ఎక్కడ వాడామో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ రిజర్వాయర్లు, చెరువులు నింపారు, ఎక్కడ పంటలకు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు కృష్ణా నదిలో ఎలాంటి హక్కు, బేసిన్ లేని 800 కి.మీ. దూరంలోని కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకెళ్లి పారిస్తున్నారని, మన సీఎం మాత్రం చేతకాక, చేవలేక.. అవకాశం ఉండీ సొంత జిల్లాను ఎండబెడ్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి పాలమూరులో భీమా, కోయిల్‌సాగర్ కింద కేవలం 26 వేల ఎకరాలు మాత్రమే సాగులో ఉండేదని చెప్పారు. రూ. 4 వేల కోట్లు ఖర్చుపెట్టి భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ కింద ఆరున్నర లక్షల ఎకరాలకు నీరిచ్చినట్టు గుర్తుచేశారు. ఉన్న నీళ్లు కూడా తీసుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నదని దుమ్మెత్తిపోశారు. ప్రస్తుతం శ్రీశైలంలో 96 టీఎంసీలు ఉన్నాయని, ఐదు మోటర్లు ఆన్ చేస్తే 4,000 క్యూసెక్కులు బయటకు వస్తాయని చెప్పారు. 4,000 క్యూసెక్కులు ఎత్తిపోయాల్సినచోట 800 క్యూసెక్కులే ఎత్తిపోస్తున్నారని, రేవంత్‌రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పాలమూరుకు ద్రోహం చేస్తున్న రేవంత్‌కు పాలమూరు బిడ్డ అని చెప్పుకొనే అర్హత లేదని మండిపడ్డారు. పాలమూరును ఎండబెట్టి ఏపీకి నీళ్లు పారించడమే నీ ఉద్దేశమా అని నిలదీశారు. తాము మూడు, నాలుగు నెలలు ఆఫ్ చేయకుండా మోటర్లు నడిపి నీళ్లు ఎత్తిపోశామని, ఈ సర్కార్‌కు ఐదు గంటలు నడుపడానికి కూడా చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. గోదావరిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉన్నదని అన్నారు. కేసీఆర్ సమ్మక్క బ్యారేజ్ కట్టి 365 రోజులు దేవాదులకు మోటర్లు నడిపే విధంగా ఏర్పాటు చేశారని, కానీ అక్కడా రోజుకు 8 గంటలే మోటర్లు నడుపుతున్నారని ఆరోపించారు. వరంగల్ కరవుకాటకాలతో ఉన్నదని, గోదావరిలో నిండుగా నీళ్లున్నాయని, రోజుకు అర టీఎంసీ ఎత్తిపోయవచ్చని, కానీ 8 గంటలే మోటర్లు నడుపుతూ కనీసం అందులో పావువంతు కూడా ఎత్తిపోయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటలూ దేవాదుల నడిపితే వరంగల్ జిల్లా సస్యశ్యామలమవుతుందని చెప్పారు. పూర్తి సామర్థ్యంతో మోటర్లు ఎందుకు నడుపడం లేదో సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరి జలాలను గురువుకు గురుదక్షిణగా అప్పగించారని ఆరోపించారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువని, ఎంతసేపూ టీఆర్ఎస్ను విమర్శించడం తప్పితే చేసింది ఏందో చెప్పాలని నిలదీశారు. నల్లగొండను ముంచి ఆంధ్రా మూడో పంటకు పులిచింతలను కట్టబెట్టినట్టు ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఈ మూడేండ్లలో కట్టిన ఒక ప్రాజెక్టు పేరు చెప్పాలని సవాల్ విసిరారు. ఉత్తమ్ అసెంబ్లీలో మాట్లాడుతూ శ్రీశైలంలో 88 టీఎంసీలు వాడినట్టు చెప్పారని, నీళ్లు ఎత్తితే రిజర్వాయర్లలో, రైతుల పొలాల్లో కనపడాలి కదా? ఎక్కడ ఎత్తారని ప్రశ్నించారు. కల్వకుర్తికి ఒకటే కాలువ ఉన్నదని, ఇప్పటివరకు 8.8 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసి 88 టీఎంసీలు అంటూ అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రాజెక్టులు కట్టలేదని అంటున్నారని, మేం కట్టకపోతే నువ్వు కట్టినవా? కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎవరు పూర్తి చేశారని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాకు నువ్వేం చేశావో చెప్పాలని నిలదీశారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చుపెట్టిందని హరీశ్‌రావు చెప్పారు. 27,191 ఎకరాల భూ సేకరణ పూర్తి చేశామని, 50 టీఎంసీల నిల్వ సామర్థ్యం తో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన నాలుగు రిజర్వాయర్లను కట్టినట్టు తెలిపారు. 16 సెప్టెంబర్ 2023న కేసీఆర్ మోటర్ ఆన్ చేసి నార్లాపూర్‌లో నీళ్లను ఎత్తిపోశారని గుర్తుచేశారు. నాలుగు రిజర్వాయర్లలో నీళ్లు ఎత్తిపోయడానికి చిన్న పని పెండింగ్ ఉన్నదని, ప్యాకేజ్ నంబర్ 3 కెనాల్లో 1.83 కోట్ల క్యూబిక్ మీటర్ల రాయిని తొలగించి కాలువ తవ్వాల్సి ఉ న్నదని చెప్పారు. సున్నపు తండా నుంచి తెల్లరాళ్లపల్లి వరకు పనులు చేయాల్సి ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1.50 కోట్ల క్యూబిక్ మీటర్ల పనిని పూర్తి చేసినట్టు తెలిపారు.
మూడేండ్లవుతున్నా 30 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేయకపోవడంతో 50 టీఎంసీల నీళ్లను నింపుకొనే అవకాశం కోల్పోయామని ఆందోళన వ్యక్తంచేశారు. రోజూ కల్వకుర్తిలో 4వేల క్యూసెక్కులు ఎత్తిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలన చేతకాక, నీటి నిర్వహణలో వైఫల్యం చెం ది.. ఇప్పుడు ఎల్ నినో పేరు చెప్పి ప్ర భుత్వం తప్పించుకుంటున్నదని విమర్శించారు. సమావేశంలో మాజీ మంత్రు లు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.