పర్మిట్ రూములా.. ఓపెన్ బార్లా?
వైన్స్‌లకు అనుబంధంగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూములు.. పలు ప్రాంతాల్లో ఓపెన్ బార్లను తలపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం 20 నుంచి 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఉండాల్సిన పర్మిట్ రూములు.. కొన్నిచోట్ల వేలాది చదరపు అడుగులకు విస్తరించాయి. కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటుచేయడమే కాకుండా ప్రత్యేకంగా వంట గదులు నిర్మించి మటన్, చికెన్, బిర్యానీ సహా రకరకాల ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు.
- బరితెగిస్తున్న వైన్స్ వ్యాపారులు
- వేల చదరపు అడుగుల్లో ఓపెన్ బార్ల తరహాలో పర్మిట్ రూములు
- ఫిర్యాదు చేసినా పట్టని ప్రభుత్వం
- మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ
కరీంనగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వైన్స్‌లకు అనుబంధంగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూములు.. పలు ప్రాంతాల్లో ఓపెన్ బార్లను తలపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం 20 నుంచి 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఉండాల్సిన పర్మిట్ రూములు.. కొన్నిచోట్ల వేలాది చదరపు అడుగులకు విస్తరించాయి. కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటుచేయడమే కాకుండా ప్రత్యేకంగా వంట గదులు నిర్మించి మటన్, చికెన్, బిర్యానీ సహా రకరకాల ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. మద్యం సీసాలు కొనుగోలు చేసి, కొద్దిసేపు సేవించి వెళ్లాల్సిన చోట.. గంటల తరబడి కూర్చొని తాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు, యువత ఈ కేంద్రాలకు ఆకర్షితులు అవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఇంత బాహాటంగా నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ కట్టడి చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలతో సమాజంలో అనేక దుష్ర్పభావాలు ఏర్పడుతున్నాయని పలు నివేదికలు హెచ్చరిస్తున్నా.. సర్కార్ మాత్రం పర్మిట్ రూముల పేరుతో ఓపెన్ బార్లను ప్రోత్సహిస్తూ మద్యానికి బానిసల సంఖ్యను పెంచుతున్నదన్న విమర్శలు వస్తున్నాయి.
రూ.40 వేల కోట్ల మద్యం వ్యాపారం
రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024-25లో రూ.37,487 కోట్లుగా ఉన్న విక్రయాలు 2025-26లో రూ.40,209 కోట్లకు చేరాయి. అమ్మకాలు 7 శాతం వృద్ధితో రూ.2,722 కోట్ల మేర పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో 382.91 లక్షల కేసుల హార్డ్ లిక్కర్, 487.34 లక్షల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. గత డిసెంబర్లో అత్యధికంగా రూ.5,051 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 ఏ4 మద్యం దుకాణాలు, 1,214 బార్లు ఉన్నాయి. వైన్స్ లైసెన్స్‌ల దరఖాస్తుల రూపంలో రూ.2,869 కోట్లు, దుకాణాల లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.1,771 కోట్లు, బార్ల ద్వారా రూ.549 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తంగా రూ.44,557 కోట్ల ఎక్సైజ్ ఆదాయం లభించింది. ఈ ఏడాది విక్రయాల జోరు మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
బహిరంగ బార్లుగా మార్చి..
నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కొన్ని వైన్స్‌లకు అనుబంధంగా ఏర్పాటుచేసిన పర్మిట్ రూములు 10 నుంచి 20 గుంటలు, మరికొన్ని చోట్ల ఎకరం స్థలంలో విస్తరించాయి. వేలాది చదరపు అడుగుల్లో షెడ్లు, రేకుల నిర్మాణాలు ఏర్పాటు చేసి వందలాది మంది ఒకేసారి కూర్చొని మద్యం తాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఒకటి రెండు ప్రాంతాలకే పరిమితం కాలేదు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే పది నుంచి పన్నెండు ప్రాంతాల్లో ఈ తరహా నిర్వహణ సాగుతున్నది. కొందరు వ్యా పారులు 3 వేల నుంచి 5 వేల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఇదే దందా నడుస్తున్నదన్న ఆరోపణలున్నాయి.
మటన్, చికెన్, బిర్యానీ.. అన్నీ అక్కడే
నిబంధనల ప్రకారం పర్మిట్ రూములలో వంటలు చేయడం, ఆహారం వడ్డించడం నిషిద్ధం. అయితే కొన్ని చోట్ల ప్రత్యేకంగా కిచెన్లు ఏర్పాటు చేసి మటన్, చికెన్, బిర్యానీ, ఫ్రైలు, ఇతర నాన్‌వెజ్ వంటకాలను విక్రయిస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లలో లభించే ఆహార పదార్థాలన్నీ ఇక్కడా అందుబాటులో ఉంటున్నాయి. ప్యాకేజ్డ్ స్నాక్స్ విక్రయాలకే పరిమితం కావాల్సిన చోట పూర్తిస్థాయి భోజనశాలల తరహాలో కార్యక లాపాలు కొనసాగుతున్నాయి.
మామూళ్ల మత్తులో అధికారులు
పర్మిట్ రూముల నిర్వహణపై ఎక్సైజ్ అధికారులు నిరంతరం నిఘా ఉంచాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ, జిల్లా కేంద్రాల్లోనే భారీ విస్తీర్ణంలో పర్మిట్ రూములు కొనసాగుతున్నా.. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు ఒక్కో పర్మిట్ రూమ్ నిర్వహణ కోసం నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు, భారీ స్థాయిలో నిర్వహిస్తుంటే రూ. 2 లక్షల వరకు ముడుపులు ముట్టజెప్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే అక్రమ పర్మిట్ రూముల నుంచి నెలకు రూ.60 నుంచి రూ.70 లక్షల వరకు మామూళ్లు చేతులు మారుతున్నాయని ఓ అధికారి వెల్లడించారు. గంటలపాటు కూర్చొని, అధికంగా మద్యం సేవించే అవకాశం ఉండటంతో రోడ్డు ప్రమాదాలు, ఘర్షణలు, శాంతిభద్రతల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నదన్నారు. కాబట్టి ఈ అక్రమ కార్యకలాపాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆధారాలు ఇచ్చినా చర్యల్లేవు
కొందరు వైన్స్ వ్యాపారులు విచ్చలవిడిగా పర్మిట్ రూములు నిర్వహిస్తున్నారు. 3-4 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో వాటిని నడుపుతున్నారు. దీనివల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తినుబండారాలు కూడా విక్రయిస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఈ విషయంపై ఆధారాలతో జిల్లా నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. కానీ చర్యలు తీసుకోవడం లేదు. వీటి వల్ల బార్ అండ్ రెస్టారెంట్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పర్మిట్ రూములపై చర్యలు తీసుకోవాలి.
– బైరం పద్మయ్య, బార్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
పర్మిట్ రూములకు పక్కా నిబంధనలు
బార్లకు వెళ్లలేని వారు వైన్స్‌లో కొనుగోలు చేసిన మద్యాన్ని అక్కడే తాగి వెళ్లేందుకు పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఉన్నది. ఇందుకోసం తెలంగాణ ఎక్సైజ్ (గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ సెల్లింగ్ బై షాప్ అండ్ కండిషన్స్ ఆఫ్ లైసెన్స్) రూల్స్-2012 ప్రకారం స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.
- పర్మిట్ రూమ్ కనిష్ఠంగా 20, గరిష్ఠంగా 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండాలి.
- వైన్స్‌కు అనుకొని ఉండాలి, స్వతంత్రంగా నిర్వహించడానికి వీల్లేదు.
- కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటు చేయరాదు.
- బార్ అండ్ రెస్టారెంట్ తరహాలో కస్టమర్లు కూర్చొని గంటల తరబడి మద్యం తాగే ఏర్పాట్లు చేయడానికి అనుమతి లేదు.
- మద్యం పెగ్గుల రూపంలో పోసి విక్రయించడం నిషిద్ధం.
- వినియోగదారులు వైన్స్‌లో కొనుగోలు చేసిన సీసాలను మాత్రమే పర్మిట్ రూమ్‌లో సేవించాలి.
- కిచెన్ ఏర్పాటుచేసి ఆహార పదార్థాలు వండడం, వడ్డించడం వంటివి చేయరాదు.
- తాగునీరు, చేతులు కడుక్కునే సదుపాయం, మరుగుదొడ్లు వంటి పారిశుధ్య వసతులు కల్పించాలి.
- విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలు, దవాఖానల నుంచి 100 మీటర్ల దూరం పాటించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

