బీఆర్ఎస్తోనే మా పోటీ.. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఉనికే లేదు
రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్సే తమకు ప్రధాన ప్రత్యర్థి అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఆ పార్టీని తానే బతికిస్తున్నానంటూ గొప్పలకు పోయిన ముఖ్యమంత్రి.. బీజేపీకి రాజకీయంగా పెద్దగా ఉనికి లేదని వ్యాఖ్యానించారు.
- ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో సీఎం
- రాష్ట్రంలో బీజేపీ బలంపై నమ్మకముంటే మోదీ, షా
- హైదరాబాద్ నుంచే లోక్సభకు పోటీ చేయాలి
- మా మూడేండ్ల కాంగ్రెస్ పాలనకు 6.5 మార్కులే
- మెరుగైన ఫలితాలను సాధించాల్సి ఉన్నది: రేవంత్
- ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డోను తీసుకొస్తానని వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్సే తమకు ప్రధాన ప్రత్యర్థి అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఆ పార్టీని తానే బతికిస్తున్నానంటూ గొప్పలకు పోయిన ముఖ్యమంత్రి.. బీజేపీకి రాజకీయంగా పెద్దగా ఉనికి లేదని వ్యాఖ్యానించారు. ఇక తన మూడేండ్ల పాలనకు పదికి 6.5 మార్కులు వేసుకున్న ఆయన.. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉన్నదని చెప్పుకొచ్చారు. మిగిలిన రెండేండ్లలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని. అదానీ పెట్టుబడుల అంశాన్ని సమర్థించుకోవ డంతోపాటు ప్రధాని మోదీ పాలన, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏబీపీ నెట్వర్ హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన నాలుగో ఎడిషన్ ‘సదరన్ రైజింగ్ సమ్మిట్-2026’లో ‘లాస్ట్ మైల్ గవర్నెన్స్, మేకింగ్ తెలంగాణ ఫ్యూచర్ రెడీ’ అంశంపై సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించారు.
బీఆర్ఎస్ మాకు ప్రత్యర్థి
రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ మాత్రమేనని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొని రాజకీయంగా బలపడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించిందని, అదే తరహాలో తాను వ్యవహరించి ఉంటే బీఆర్ఎస్ను పూర్తిగా తుడిచిపెట్టేవాడినని వ్యాఖ్యానించారు. ఆ పార్టీని తానే బతికిస్తున్నానంటూ గొప్పలకు పోయారు.
బీజేపీది ప్రేక్షక పాత్రే
తెలంగాణలో బీజేపీ రాజకీయ బలంపై రేవంత్రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో బీజేపీకి రాజకీయంగా ఎదిగే అవకాశాలు లేవని, కాంగ్రెస్ , బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల రాజకీయాలు చేయడానికి కూడా అవకాశాలు లేవన్నట్టు వ్యాఖ్యానించారు. ‘ఇకడ కేసీఆర్ వర్సెస్ రేవంత్రెడ్డి. బీజేపీ ప్రేక్షక పాత్ర పోషిస్తూ బయట కూర్చొని చప్పట్లు కొట్టాల్సిందే’ అనే అర్థంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. తెలంగాణలో బీజేపీకి బలం ఉన్నదని చెప్పుకొంటున్న నాయకులు తమ రాజకీయ ప్రభావాన్ని నిరూపించుకోవాలని రేవంత్ సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని కూడా రేవంత్ సవాల్ చేశారు.
మేమింకా మెరుగ్గా పనిచేయాల్సి ఉన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు పూర్తయిన సందర్భంగా తన పనితీరును అంచనా వేసుకున్న రేవంత్రెడ్డి.. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉన్నదని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత పనిచేయాల్సి ఉన్నదనే సంకేతాలిచ్చారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో సమగ్ర విధానాలు రూపొందించినట్టు తెలిపారు. రాష్ట్రాన్ని పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుపాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన వివరించారు.
అదానీ పెట్టుబడులపై గట్టిగా సమర్థన (బాక్స్)
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు, పెట్టుబడుల ఆహ్వానంపై రేవంత్రెడ్డి తన వైఖరిని స్పష్టం చేశారు. అదానీ గ్రూపు నుంచి పెట్టుబడులు ఆహ్వానించడంలో తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణకు పెట్టుబడులు రావడం, యువతకు ఉద్యోగాలు లభించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం ముఖ్యమని పేరొన్నారు. ప్రధాని మోదీ ప్రజాధనాన్ని అదానీకి అందిస్తుంటే, తాము అదానీ జేబులోని డబ్బును తెలంగాణ పెట్టుబడుల రూపంలో బయటకు తీసుకొస్తున్నామని వ్యాఖ్యానించారు. కేంద్రంలో అదానీకి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఆరోపిస్తూ విమర్శలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం, అదే అదానీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆహ్వానించడం ఏమిటన్న ప్రశ్నకు రేవంత్ తనదైన రీతిలో సమాధానమిచ్చారు. పెట్టుబడిదారులతో రాజకీయ సంబంధాలను ముడిపెట్టబోమని, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే పెట్టుబడులను ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మోదీపై తీవ్ర విమర్శలు..
ప్రధాని మోదీ పాలనపై రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని, ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. జాతి, మతం, భాష, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. పేదరికం, నిరుద్యోగం, విద్య, వైద్యం వంటి ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వకుండా రాజకీయ విభజనలకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. గత ప్రధానమంత్రులందరూ కలిసి సుమారు రూ.53 లక్షల కోట్ల అప్పులు చేస్తే, మోదీ ప్రభుత్వం 12 ఏండ్లలోనే దాదాపు రూ.125 లక్షల కోట్ల అప్పులు చేసిందని రేవంత్ పేరొన్నారు. ఇంత భారీగా అప్పులు చేసినా వాటి ద్వారా ప్రజలకు ఎంత ప్రయోజనం కలిగిందని ప్రశ్నించారు. పెద్ద కార్పొరేట్ సంస్థలకు కేంద్రం ప్రయోజనాలు కల్పిస్తున్నదని విమర్శలు చేశారు.
రొనాల్డో హైదరాబాద్కు వచ్చేలా చేస్తా!
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన అనంతరం మరో అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను కూడా నగరానికి ఆహ్వానించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదని రేవంత్రెడ్డి వెల్లడించారు. అయితే రొనాల్డో పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. క్రీడల ద్వారా హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతోపాటు ప్రపంచ స్థాయి క్రీడా కార్యక్రమాలకు నగరాన్ని వేదికగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. మొత్తంగా సదరన్ రైజింగ్ సమ్మిట్లో రేవంత్రెడ్డి ప్రసంగం పాలన సమీక్షతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై దాడి, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు, పెట్టుబడుల విధానానికి సమర్థన, భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాల చుట్టూ సాగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

