సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, రూ.1,600 కోట్ల కుంభకోణం జరిగిందని నాలుగు నెలల క్రితమే బయటపెట్టినం. బొగ్గు ఎక్కడికీ పోలేదు.. ఎలాంటి స్కామ్ జరుగలేదని సింగరేణి సీఎండీ, విద్యుత్తు శాఖ మంత్రి డైలాగ్‌లు కొట్టిండ్రు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నమాట వాస్తవమే అయితే పవర్ జనరేటింగ్ స్టేషన్లు ఎందుకు బంద్ అవుతున్నయ్?
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రైతులకు 24 గంటలు కరెంటు ఇవ్వాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ సీనియర్ నేతల ఆధ్వర్యంలో ఆరు బృందాలు గురువారం విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్ల పరిశీలనకు వెళ్తాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రకటించారు. తెలంగాణలోని థర్మల్ పవర్స్టేషన్లలో నిజానిజాలను తేల్చడానికి ఈ బృందాలు వెళ్తాయని, కేంద్రాల్లో సామర్థ్యం ఉన్నా ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎందుకు విద్యుత్తును ఉత్పత్తి చేయడం లేదో ఈ బృందాలు పరిశీలిస్తాయని తెలిపారు.
యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌లో 4,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా, 400 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని విమర్శించారు. 270 మెగావాట్ల విద్యుతు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న భద్రాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌లో ఉత్పత్తి నిలిచిపోయిందని, నాణ్యత లేని బొగ్గు సరఫరా వల్ల రూ.2,900 కోట్ల ప్రజాధనం వృథా అయిందని దుయ్యబట్టారు. తెలంగాణ జెన్కో ద్వారా సింగరేణికి రూ.52 వేల కోట్లు బకాయి పడిందని అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యం, విద్యుత్తు రంగంలో మిస్మేనేజ్మెంట్, సింగరేణి-జెన్కో మధ్య ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళమే కారణమని విమర్శించారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు తాటికొండ రాజయ్య, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

Ktr
కేసీఆర్ విద్యుత్తు రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ పాలకులు వచ్చి అంతా చెల్లాచెదురు చేసి కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన విధంగా, కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా, 24 గంటలు కరెంటు ఇవ్వాలి.
– కేటీఆర్
కాంగ్రెస్ ఉన్నచోట కరెంట్ ఉండదు
‘కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ కరెంట్ ఉండదు.. కాంగ్రెస్ కావాల్నా? కరెంట్ కావాల్నా? అని బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజల ముందు కనిపిస్తున్నది. కేసీఆర్ పాలనలో వెలుగులు విరజిమ్మిన తెలంగాణలో రేవంత్ రాజ్యంలో మళ్లీ అంధకారం నెలకొన్నద’ని కేటీఆర్ ఉద్ఘాటించారు. దేశంలోని అన్ని రాష్ర్టాలకు కరెంటు అంటే ఒక విలాసవస్తువు కావచ్చు కానీ, తెలంగాణ ప్రజలకు మాత్రం ఓ జీవనరేఖ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్తు రంగానికి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిచ్చారని, దేశంలో ఎక్కడాలేనివిధంగా విద్యుత్తురంగాన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు.
లక్ష కోట్లు వెచ్చించినం.. 24 గంటల కరెంట్ ఇచ్చినం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్తు సామర్థ్యం ఉంటే, బీఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోయేనాటికి 2023లో సుమారు 20,000 మెగావాట్లకు పెరిగిందని కేటీఆర్ తెలిపారు. విద్యుత్తు కోసం ఏకంగా రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ‘400 కేవీ సబ్స్టేషన్లను 6 నుంచి 28కి, 220 కేవీ సబ్స్టేషన్లను 51 నుంచి 103కు పెంచినం. విస్తృతంగా థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు పెట్టినం. సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి పెద్దపీట వేసినం.
మొత్తంగా 19,472 మెగావాట్లకు పెంచినం. డిమాండ్‌కు మించి విద్యుత్తును ఉత్పత్తిచేసే స్థాయికి తీసుకెళ్లినం. దేశంలోనే 24 గంటల కరెంటు ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్ది చరిత్ర సృష్టించినం’ అని గణాంకాలు సహా వివరించారు. కేసీఆర్ పాలనలో భారతదేశంలోనే 91% పీఎల్ఎఫ్ (పవర్ లోడింగ్ ఫ్యాక్టర్) సాధించి 250 విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు అందించిన ఘనత సింగరేణికే దక్కిందని చెప్పారు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదని నాడు తాము చెప్పిందే ఇప్పుడు జరుగుతున్నదని, కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయిందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేము చెప్పిందే ఇప్పుడు జరుగుతున్నది. కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయింది. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం మొత్తం విద్యుత్తు కోతలతో అల్లాడిపోతున్నది.
– కేటీఆర్
ఇప్పుడు ఎక్కడికెళ్లినా ఆరు గంటల కరెంటే..
రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్ర మొత్తం విద్యుత్తు కోతలతో అల్లాడిపోతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఏ జిల్లాకు వెళ్లినా ఆరు గంటలకు మించి కరెంటు రావడంలేదని చెప్పారు. వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాలు చూపుతూ కరెంటు కోసం ప్రజలు పడుతున్న ఇక్కట్లను ఏకరువుపెట్టారు. వచ్చే యాసంగిలో వరికి క్రాప్‌హాలిడే పెట్టే పరిస్థితి కనిపిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సబ్స్టేషన్ల వద్ద, అన్ని మండలాల్లో రైతులు రాస్తారోకోలు చేస్తున్నారని చెప్పారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో 1980ల ట్రెండ్ నడుస్తున్నది.
మన ముఖ్యమంత్రి కూడా పాత ఫొటోలు పెట్టుకున్నట్టున్నరు. తెలంగాణలో 1980ల ట్రెండ్ ఇప్పటికే వచ్చింది. నాడు కరెంటు ఎట్లున్నదో ఇప్పుడు అట్లనే తయారైంద’ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంతూరైన కొండారెడ్డిపల్లి రైతులు కరెంటు కోసం శ్రీశైలం హైవేపై రాస్తారోకో చేశారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అసెంబ్లీలో స్పందిస్తూ ఇది ఎల్ నినో ప్రభావమని చెప్పారు. కానీ, విద్యుత్తు కోతలకు కారణం ఎల్ నినో కాదు.. కచ్చితంగా ఎల్కాంగోనే కారణం.. కాంగ్రెస్ భూతం వల్ల వచ్చిన శాపం తప్ప మరొకటి కాద’ని ఎద్దేవాచేశారు.
నాసిరకం బొగ్గు సరఫరాతోనే ఈ దుస్థితి
ప్రభుత్వరంగ సంస్థ జెన్కోకు నాసిరకం బొగ్గు సరఫరాతోనే కరెంటు ఉత్పత్తిలో సంక్షోభం నెలకొన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది తాను చెప్పడంలేదని, మంత్రి వివేక్‌కు చెందిన పత్రికలోనే వచ్చిందని క్లిప్పింగ్ చూపుతూ విమర్శించారు. బొగ్గు నిల్వలు లేకనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. నాలుగు నెలల క్రితమే హరీశ్‌రావు.. ఈశ్వర్, బాల్క సుమన్ సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, ఇందులో రూ.1,600 కోట్ల కుంభకోణం జరిగిందని బట్టబయలుచేశారని గుర్తుచేశారు.
నాడు సింగరేణి సీఎండీ, విద్యుత్తు శాఖ మంత్రి బొగ్గు ఎక్కడికిపోలేదని, ఎలాంటి కుంభకోణం జరుగలేదని, కావాలంటే చూపెడుతామని డైలాగ్‌లు కొట్టారని ఎద్దేవా చేశారు. ‘40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నమాట వాస్తవమే అయితే కోల్ నిల్వలు నిల్ అనే వార్తలు ఎందుకు వస్తున్నాయి? పవర్ జనరేటింగ్ స్టేషన్లు ఎందుకు బంద్ అవుతున్నయని ప్రశ్నించారు. నాలుగువేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో కేవలం 400 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతున్నదని, బొగ్గు లేకనే ఇలాంటి దుస్థితి నెలకొన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.
బొగ్గులేదని ప్లాంట్లను మూసివేసే పరిస్థితి
నల్లగొండ జిల్లా దామరచర్లలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ (వైటీపీఎస్)ను కేసీఆర్ హయాంలో కట్టుకున్నామని, కానీ, ఇప్పుడు అక్కడ కేవలం 400 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఎందుకు అంత తక్కువ ఉత్పత్తి చేస్తున్నారని అడిగితే బొగ్గు లేదంటున్నారని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)-3లో 270 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ను బొగ్గు లేదని మూసివేశారని మండిపడ్డారు.
నీళ్లు లేవని జల విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేశారని, బొగ్గులేదని థర్మల్ విద్యుత్తు ప్లాంట్లను కూడా మూసివేసే పరిస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేస్తుందని, బొగ్గు నాణ్యత వివిధ రకాలుగా ఉంటుందని చెప్పారు. జీ13-జీ14 అనేక మూడో రకం బొగ్గు మన థర్మల్ స్టేషన్లకు సరఫరా చేయడం వల్ల రూ.2,900 కోట్ల ప్రజాధనం వృథా అయినట్టు వార్తలు వచ్చాయని తెలిపారు.
సింగరేణికి కాంగ్రెస్ సర్కార్ 52 వేల కోట్ల బకాయి
జెన్కో నుంచి సింగరేణి సంస్థకు రూ.52 వేల కోట్ల పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నదని అధికారులు చెప్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. పెద్దఎత్తున బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని, అందువల్ల గ్రేడ్-1 బొగ్గును తమకు డబ్బులు వెంటనే చెల్లించేవారికి ఇస్తున్నట్టు తెలిపారని వెల్లడించారు. సింగరేణి ఉత్పత్తిచేసే మంచి బొగ్గును ఎన్టీపీసీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు బకాయిపెట్టడం వల్ల మూడోరకం బొగ్గు సరఫరా చేస్తున్నామని, తద్వారా పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని, నష్టం వాటిల్లుతున్నదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి తనతో చెప్పారని కేటీఆర్ వివరించారు. బొగ్గు ఉత్పత్తి కేంద్రాల సమీపంలోనే విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఉన్న మణుగూరు, పాల్వంచ కేంద్రాల్లో కూడా విద్యుత్తు ఉత్పత్తి జరుగడం లేదని మండిపడ్డారు.
సైట్ విజిట్ పేరిట స్కామ్
సింగరేణిలో గ్రాస్ మిస్మేనేజ్మెంట్ జరుగుతున్నదని ఆరు నెలలుగా తాము చెప్తున్నామని కేటీఆర్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి లీలలు ముందే బయటపెట్టామని, సైట్ విజిట్ పేరిట జరుగుతున్న కుంభకోణాలు, అక్కడ జరిగే భారీ దోపిడీలను బహిర్గతం చేశామని గుర్తుచేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశామని అన్నారు. సంస్థ కుప్పకూలి కార్మికులు రోడ్డునపడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించినా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రికి లేఖ రాస్తే.. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Ktr
విద్యుత్తు కోతలకు కారణం ఎల్ నినో కాదు..కచ్చితంగా ఎల్కాంగోనే కారణం. కాంగ్రెస్ భూతం వల్ల వచ్చిన శాపం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వరంగ సంస్థ జెన్కోకు నాసిరకం బొగ్గు సరఫరాతోనే కరెంటు ఉత్పత్తిలో సంక్షోభం నెలకొన్నది.
– కేటీఆర్
నాడు 70.. నేడు 58 మిలియన్ టన్నులు
ఎండిన పంటలు.. ఉత్త కోతలే.. వంటి వార్తలు వస్తున్నాయంటే కారణం.. ప్రకృతి కాదు.. ఎల్ నినో కాదు.. కాంగ్రెస్ పాలనా వైఫల్యం అని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అవినీతి, చేతగానితనం, బడా నాయకుల కుటుంబాల దోపిడీ కారణమని మండిపడ్డారు. ఇవి కేవలం ఆరోపణలు కావని, ఆధారాలు బయటపెట్టినట్టు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో భారీ దోపిడీకి తెరతీశారని మండిపడ్డారు. సోలార్ పవర్ టెండర్ల వ్యవహారంలో జరిగిన అవినీతిపై ఆధారాలు బయపెట్టినా కేంద్రం, రాష్ట్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
అందుకే 2023-24లో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పిత్తి చేసిన సింగరేణి సంస్థ.. 2025-26 సంవత్సం నాటికి 58 మిలియన్ టన్నులకు పరిమితమైందని ఆందోళన వ్యక్తంచేశారు. 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి పడిపోయిందని, 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని ఆరోపించారు. కేసీఆర్ విద్యుత్తు రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ పాలకులు వచ్చి అంతా చెల్లాచెదురు చేసి కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా, కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన విధంగా 24 గంటలు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనరేటర్ల ద్వారా తాము 30% విద్యుత్తును వాడుకుంటున్నట్టు పారిశ్రామికవేత్తలు చెప్తున్నారని కేటీఆర్ తెలిపారు. వైటీపీఎస్‌లో బొగ్గులేక 400 కిలోలీటర్ల డీజిల్‌తో కేంద్రాన్ని నడుపుతున్నట్టు అధికారులు చెప్తున్నారని అన్నారు.
సింగరేణితో రేవంత్ సర్కార్ ఫుట్‌బాల్
తమ ప్రభుత్వం సింగరేణి సంస్థను సిరులగనిగా తీర్చిదిద్దితే, కాంగ్రెస్ పాలకులు దానితో ఫుట్‌బాల్ ఆడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆఫీసులు నడుపొద్దని ఐటీ పార్కులకు నోటిమాటగా చెప్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్‌లోనే ఈ పరిస్థితి ఉంటే వేసవి పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తంచేశారు. తాగునీరు దొరుకుతుందా? యాసంగి పంట ఉంటదా? అని అనుమానం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక, ఆలోచన ఉన్నదా? అని ప్రశ్నించారు.
నేడు పవర్ ప్లాంట్ల పర్యటన వివరాలు ఇలా.
1) నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ (వైటీపీఎస్)ను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పరిశీలిస్తారు.
2) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్ (కేటీపీఎస్) ను బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్‌లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పరిశీలిస్తారు.
3) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పరిశీలిస్తుంది.
4) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పరిశీలిస్తారు.
5) మంచిర్యాల జిల్లా జైపూరులోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)ను ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్‌జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, వివాకర్, దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పరిశీలిస్తారు.
6) హైదరాబాద్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్టా మధు, దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు సందర్శిస్తారు.
నేడు క్షేత్రస్థాయి పరిశీలనకు బీఆర్ఎస్ బృందాలు
థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో ఏం జరుగుతున్నదో నిజానిజాలు తెలుసుకోవడానికి, ప్రజలకు చెప్పడానికి గురువారం బీఆర్ఎస్ నేతల నేతృత్వంలో ఆరు బృందాలు ఆయా కేంద్రాలను పరిశీలించనున్నట్టు కేటీఆర్ చెప్పారు. రైతాంగాన్ని ఆదుకోవాలని, పంటలు ఎండకుండా చూడాలని, నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ, నార్లాపూర్ వద్ద పంపులు ఆన్ చేసి పంటలు ఎండిపోకుండా చూడాలని కోరారు. రైతుల తిరుగబడితే చివరికి గత్యంతరం లేక ఇవాళ జూరాలలో నీళ్లు వదిలారని చెప్పారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వైటీపీఎస్ను సందర్శిస్తారని, పూర్తిస్థాయిలో ప్లాంట్‌లో ఎందుకు విద్యుత్తు ఉత్పత్తి జరుగడం లేదనే అంశాలను పరిశీలిస్తారని తెలిపారు.
1,200 మెగావాట్ల కెపాసిటీతో ఎస్టీపీపీని కేసీఆర్ పాలనలో ప్రారంభించామని, 544 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే జరుగుతున్నదని అన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నడిచే ఈ కేంద్రం కుడిచేత్తో బొగ్గు ఉత్పత్తి చేసి.. ఎడమచేతితో వాడుకొనే అవకాశం ఉన్నదని, ఇక్కడ కూడా సగమే విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సింగరేణి సంస్థలో ఏం జరుగుతున్నదో తెలుసుకొని ప్రజలకు తెలియజేయానికి ఆ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని కూడా తమ పార్టీ బృందం సందర్శిస్తుందని తెలిపారు.
ఈ పర్యటనలతోనే ఆగబోమని తదుపరి కార్యచరణ కూడా ప్రకటిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తే తమ బృందాల పర్యటనలను అడ్డుకోవద్దని కేటీఆర్ సూచించారు. అన్ని సక్రమంగా ఉంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. సబ్స్టేషన్లలో కరెంటు ఎప్పుడు సరఫరా చేస్తున్నామో తెలిపే లాగ్‌బుక్ కూడా ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నాయకత్వంలో విద్యుత్తు వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉన్నదని మండిపడ్డారు.