దసరా పండుగకు ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక పీఆర్సీ నివేదికను 10 రోజుల్లో తెప్పించుకుని, కమిటీ ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆందోళన విరమిస్తున్నట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్‌జాజుతో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు బుధవారం రాత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లపై చర్చించారు. ఈ సందర్భంగా దసరాకు రెండు డీఏలను ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక తెప్పించుకుని తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తామని, సీపీఎస్ (కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్)పై కమిటీ ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. అదేవిధంగా పెండింగ్ బిల్లుల పరిష్కారానికి చర్యలు చేపడుతామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినట్టు జేఏసీ నేత మారం జగదీశ్వర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలను విరమిస్తున్నట్టు ప్రకటించారు.
ఉద్యోగ సంఘాల నేతలతో బుధవారం ఉదయం సీఎస్ సంజయ్‌జాజు సచివాలయంలో భేటీ అయ్యారు. చర్చలు నిర్వహించారు. దీంతో చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. 15 లక్షల మంది ఉద్యోగులు ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూశారు. సీఎస్ స్థాయిలో చర్చలు జరుగడంతో ఏదో పరిష్కారం లభిస్తుందని ఆశించారు. కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. సోషల్‌మీడియా వేదికగా టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్లు సర్కార్‌పై దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వం చర్చల పేరిట నమ్మించి మోసం చేసిందని ఫైర్ అయ్యారు. అదేసమయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకత్వం చర్చల అనంతరం అత్యవసరంగా భేటీ అయి అక్టోబర్ రెండు నుంచీ సత్యాగ్రహ దీక్షలకు దిగుతామని హెచ్చరించింది. సర్కార్ దిగి వచ్చే వరకు నిరవధికంగా దీక్షలు చేపడుతామని ప్రకటించింది.
ఉదయం నుంచి జరిగిన ఈ పరిణామాలపై ఇంటెలిజెన్స్ అధికారులు సీఎం, ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించినట్టు సమాచారం. ఉద్యోగుల ఆగ్రహం ఉద్యమ రూపం దాల్చే అవకాశముండటంతో నిఘావర్గాలు సర్కార్‌ను అప్రమత్తం చేసినట్టు తెలిసింది. చర్చలకు ఆహ్వానించి నాలుగు కీలక డిమాండ్లను పరిష్కరించకపోవడం.. పలుదఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగులంతా గుర్రుగా ఉన్నట్టు సర్కార్‌కు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఇది తేలిగ్గా తీసుకునే అంశం కాదని.. ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాలతో సర్కార్‌కు తలనొప్పులు తప్పవని సూచించినట్టు తెలిసింది. రాబోయే రోజుల్లో కీలక ఎన్నికలుండటంతో వాటిపై ప్రభావం చూపుతుందని నివేదికల్లో ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో సర్కార్ హుటాహుటిన రాత్రివేళ మరోసారి చర్చలకు పిలిచింది. అందుబాటులో ఉన్న ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలను ఆహ్వానించింది. డిప్యూటీ సీఎం రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో సీఎస్ సంజయ్‌జాజుతో కలిసి మరోసారి ఉద్యోగ నేతలతో చర్చించారు. దసరాకు డీఏల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.