నాగర్ కర్నూల్ : జిల్లాలోని కోడేరు మండలం ఎత్తం గ్రామ పంచాయతీ నిధుల దుర్వి నియోగంపై ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను ( Panchayat Secretaries ) జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సస్పెన్షన్ ( Suspension) చేశారు. ఈ సందర్భంగా ఎత్తం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు
కోడేరు మండలం ఎత్తం, ఎర్రన్నబావి తండా గ్రామపంచాయతీలకు చెందిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ నిధులను దుర్వినియోగం పరిచారని ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టి ఇద్దరిని సస్పెన్షన్ చేశారు. ఇదే వ్యవహారంలో ఎత్తం గ్రామపంచాయతీ సర్పంచ్ బి. లక్ష్మి, ఉపసర్పంచ్ బి. ధర్మరాజులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఎత్తం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న రమేష్‌తో పాటు, గతంలో కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం ఎర్రన్నబావి తాండ గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బి. నరసింహాను సస్పెండ్ చేశారు. ఎత్తం గ్రామపంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరైన గ్రామపంచాయతీ అభివృద్ధి నిధుల వినియోగంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు.
విచారణలో నిధుల వినియోగంలో నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే బాధ్యులపై మరిన్ని శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు వెల్లడించారు.