Covid | చలికాలం ప్రారంభమయ్యే సమయంలో కోవిడ్-19, ఆర్ఎస్వీ, ఫ్లూ, సాధారణ జలుబు వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో చాలా వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉండడంతో పిల్లలకు వచ్చిన ఇన్ఫెక్షన్ ఏదో గుర్తించడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించినప్పుడు పిల్లలను స్కూల్‌కు పంపించాలా, ఇంట్లోనే ఉంచాలా అనే సందేహం తల్లిదండ్రులకు వస్తుంది. అనారోగ్యంగా ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపించడం వల్ల వారు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండడంతో పాటు, తోటి విద్యార్థులకు, సిబ్బందికి కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్లు తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది.
సాధారణ జలుబు వివిధ రకాల వైరస్ల వల్ల వస్తుంది. దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా స్వల్పంగా ఉండి, దాదాపు 7 నుంచి 10 రోజుల్లో తగ్గిపోతాయి. కోవిడ్-19 మాత్రం సార్స్-కోవ్-2 అనే వైరస్ వల్ల వస్తుంది. దీని లక్షణాలు సాధారణంగా 7 నుంచి 14 రోజుల వరకు ఉంటాయి. కొందరిలో మూడు నుంచి నాలుగు వారాల వరకు కొనసాగుతాయి. దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడంతోపాటు శరీర నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, అలసట, జ్వరం, రుచి లేదా వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన లక్షణాలు కూడా కొందరిలో కనిపించే అవకాశం ఉంది.
ఫ్లూ లక్షణాలు సాధారణ జలుబు లేదా కోవిడ్‌తో పోలిస్తే అకస్మాత్తుగా మొదలయ్యే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా 3 నుంచి 7 రోజుల పాటు కొనసాగుతాయి. కోవిడ్‌లో కనిపించే కొన్ని లక్షణాలు ఫ్లూలోనూ ఉంటాయి. అయితే రుచి లేదా వాసన కోల్పోవడం సాధారణంగా ఫ్లూ లక్షణంగా కనిపించదు. ఆర్ఎస్వీ లక్షణాలు జలుబును పోలి ఉన్నప్పటికీ, ఆకలి తగ్గడం కూడా కనిపిస్తుంది. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేసి ముఖ్యంగా చిన్నారులు, శిశువుల్లో తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఆసుపత్రిలో చేరే పరిస్థితికి దారితీస్తుంది. దీని లక్షణాలు మూడు నుంచి నాలుగు వారాల వరకు కొనసాగుతాయి. అందువల్ల వైరస్ ఏదో కచ్చితంగా తెలియకపోయినా, అనారోగ్యంగా ఉన్న పిల్లలను ఇంట్లో ఉంచడం ద్వారా ఇతరులకు వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు.
పిల్లలను స్కూల్‌కు పంపాలా వద్దా అనే విషయంలో వారు తరగతి గదిలో సాధారణ కార్యకలాపాల్లో సౌకర్యంగా పాల్గొనగలరా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే గత 24 గంటల్లో జ్వరం వచ్చినా, విరేచనాలు, వికారం లేదా వాంతులు ఉన్నా పిల్లలను స్కూల్‌కు పంపకుండా ఇంట్లో విశ్రాంతి ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు. లక్షణాలను బట్టి మాత్రమే కోవిడ్‌ను గుర్తించడం చాలా సందర్భాల్లో సాధ్యం కాదు. అనుమానం ఉంటే ఇంట్లో కోవిడ్ పరీక్ష చేయవచ్చు. పరీక్ష పాజిటివ్‌గా వస్తే ఫలితం సాధారణంగా నమ్మదగినదే అయినప్పటికీ, నెగెటివ్ ఫలితం వచ్చినంత మాత్రాన ఇన్ఫెక్షన్ లేదని పూర్తిగా నిర్ధారించలేం. లక్షణాలు కొనసాగితే 48 గంటల తర్వాత మళ్లీ పరీక్ష చేయడం లేదా వైద్యుల సూచన మేరకు పీసీఆర్ పరీక్ష చేయించుకోవచ్చు. కోవిడ్, ఫ్లూ టీకాలను ఆరు నెలలు దాటిన పిల్లలకు, వైద్యపరంగా ఎలాంటి అభ్యంతరాలు లేనప్పుడు ఇవ్వాలని సంబంధిత వైద్య సంస్థలు సూచిస్తున్నాయి. టీకా తీసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్ వచ్చే చాన్స్ ఉంటుంది, కానీ తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గించడంలో టీకాలు సహాయపడతాయి. సాధారణంగా చాలా మంది పిల్లలు ఇంట్లోనే కోలుకుంటారు. అయితే మందులతోనూ జ్వరం తగ్గకపోవడం, తినడం లేదా తాగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి.