– నల్లగొండ ఎన్జీ కళాశాలలో ఆర్బీఐ అవగాహన కార్యక్రమం
రామగిరి, సెప్టెంబర్ 29 : ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవల వినియోగం, సైబర్ మోసాల నివారణ, ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నల్లగొండ జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏటీఎం కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు తదితర ఆధునిక బ్యాంకింగ్ సేవలపై అధికారులు అవగాహన కల్పించారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించే సమయంలో పాటించాల్సిన సురక్షిత పద్ధతులను వివరించారు. ముఖ్యంగా ఓటీపీ, పిన్, పాస్వర్డ్లు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత అలాగే ఆర్థిక సమాచారాన్ని ఇతరులతో పంచుకోరాదని సూచించారు.
పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఫిషింగ్ దాడులు, అధిక రాబడులు ఇస్తామని చెప్పే మోసపూరిత పెట్టుబడి పథకాలు వంటి వాటి పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. అనుమానాస్పద లింకులు, సందేశాలు, ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.
అదేవిధంగా ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ పథకం ద్వారా వ్యక్తులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో Retail Direct Gilt Account (RDG Account)ను ప్రారంభించి, ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టవచ్చని తెలిపారు. ప్రభుత్వ సెక్యూరిటీలపై అవగాహన పెంపొందించుకోవడం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలను తెలుసుకోవడం ద్వారా ఆర్థిక అవగాహనను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ అధికారులు రాజ్‌కుమార్ డాడ్గే, పిండి గణేష్ సాగర్, ఎస్బీఐ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తూడి శ్రామిక్, నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, సీఎఫ్ఎల్ సభ్యులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

‘డిజిటల్ బ్యాంకింగ్‌లో అప్రమత్తతే రక్షణ’