దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు.. సభ్యసమాజం అసహ్యించుకునేలా ఉన్నాయి. ఎవరిని విమర్శిస్తున్నాం అనేది గుర్తుంచుకోవడం లేదు. తమకు ఉన్న స్థాయి ఏంటని కూడా గుర్తించడంలేదు. చిన్నంతరం, పెద్దంతరం లేకుండా అవాకులు, చెవాకులు పేలుతున్నారు. శాశ్వతమనే భ్రమలో విర్రవీగుతున్నారు. ఆ రెండు పార్టీల జుగుప్సాకరమైన భాష, దుష్ట రాజకీయం రచ్చకెక్కుతున్నది. రెండు పార్టీల తీరును ప్రజాస్వామికవాదులు అసహ్యించుకుంటున్నారు. మరి ఇది ఆ రెండు పార్టీలకు కొత్తనా అంటే.. అసలు ఆ పార్టీల సంస్కృతే అంతది.
మర్యాదలు, పద్ధతులను మంటగలిపి రాజకీయ ప్రత్యర్థులను దూషించడం, నీచాతినీచంగా కించపర్చడంలో కాంగ్రెస్, బీజేపీకి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. ఈ నెల 4, 5వ తేదీల్లో పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ పౌరులను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఇటీవల లోక్‌సభలో గొడవ చేసినందుకు సస్పెండ్ అయిన పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీలకు సంఘీభావంగా రాహుల్‌గాంధీ నిలబడి మాట్లాడారు.
పార్లమెంట్ భవనం ద్వారం వద్ద రాహుల్ బృందం నిరసన తెలుపుతుండగా లోపలకి ప్రవేశించే క్రమంలో కేంద్రమంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టూ మెట్లు ఎక్కడానికి అక్కడికి వచ్చారు. ఆయనను ఉద్దేశించి రాహుల్, ‘ఇక్కడ గద్దార్ (ద్రోహి) నడుచుకుంటూ వస్తున్నాడు. అతని ముఖం వంక చూడండి, ఎలా ఉన్నాడో తెలుస్తుంది,’ అంటూ బిట్టూతో కరచాలనం చేయడానికి చేయి ముందుకు చాపారు. అంతటితో ఆగకుండా, ‘హలో బ్రదర్, నా గద్దార్ దోస్త్! దిగులు చెందకు. నువ్వు మళ్లీ వెనక్కి వస్తావు (కాంగ్రెస్‌లో చేరిపోతావు)’ అని ఎగతాళిగా మాట్లాడారు.
రాహుల్‌తో కరచాలనం చేయడానికి బిట్టూ నిరాకరిస్తూ, రాహుల్ వైపు తిరిగి, ‘దేశ్ కే దుష్మన్’ (దేశ శత్రువు) అని పదేపదే దూషించారు. గతంలో మూడుసార్లు కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఉన్న బిట్టూ 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. లూథియాణా నుంచి పోటీచేసి ఓడిపోయినా గాని వెంటనే మోదీ కొత్త మంత్రివర్గంలో బిట్టూ స్థానం సంపాదించారు. బీజేపీ ఆయనను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపించింది. ఇక తాజా గొడవ విషయానికి వస్తే కాంగ్రెస్ ఎంపీలు బిట్టూను ఉద్దేశించి, ‘లొంగిపో, లొంగిపో’ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత బిట్టూ మీడియాతో మాట్లాడుతూ, ‘రాహుల్ చెడిపోయిన పిల్లోడు. రాజీవ్ తీవ్రవాదుల చేతుల్లో హతుడైన కారణంగా ఆయన పిల్లలు అతిపెద్ద దేశభక్తులు అని అనుకుంటారు. నెహ్రూ, గాంధీ కుటుంబం రాజకీయ స్వార్ధం కోసం రాజేసిన మంటల్లో నా తాత బియాంత్‌సింగ్ (పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి) ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. కాంగ్రెస్‌ను వదిలిన ఎందరో నేతలు ఎంపీలయ్యారు. నేను సిక్కు మతస్థుడిని కాబట్టే రాహుల్ నన్ను దూషించారు’ అని అన్నారు.
దొంగిలించడం కొందరికి కుటుంబ వృత్తి!
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు రాజ్యసభలో గురువారం ప్రధాని మోదీ జవాబిస్తూ, ‘కొందరికి ఇతరుల సొమ్ము దొంగిలించడం కుటుంబ వృత్తి. ఒక కుటుంబం తన పూర్వీకుల అసలు ఇంటిపేరును వాడుకోదు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే చోరీలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న కొందరు.. గుజరాతీ అయిన మహాత్మా గాంధీ ఇంటిపేరును దొంగిలించి సొంతం చేసుకున్నారు’ అన్నారు. ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీ కుటుంబం అసలు సిసలు ఫార్సీ ఇంటిపేరు ‘ఘాండీ’(Ghandy) అయితే, తన కూతురు ఇందిర పెళ్లి సమయంలో నెహ్రూ ఆ ఇంటిపేరును ‘గాంధీ’గా (Gandhi) మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ‘ఘాండీ’ అనే కుటుంబ నామం ఆయనకు వింతగా కనిపించిందట. మామ గారి మాటను మన్నించిన ఫిరోజ్ తన ఇంటిపేరు స్పెల్లింగ్‌ను ‘గాంధీ’గా మార్చుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఇంటిపేరును దొంగిలించారని మోదీ పేర్కొనడం మర్యాదలను విస్మరించి మాట్లాడినట్టు కనిపిస్తున్నది.
సర్దార్ కీ బేటీ హై గద్దార్ కీ బేటీహై!
1980 జులైలో విమాన ప్రమాదంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రెండో కొడుకు సంజయ్ గాంధీ మరణించాక, ఆయన భార్య మేనక తన భర్తకు రాజకీయ వారసురాలుగా కావాలని కోరుకున్నారు. పెద్ద కొడుకు రాజీవ్‌గాంధీని తన వారసుడిని చేయాలని ఇందిరా నిర్ణయించారు. ఆ తర్వాత పలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇందిరాగాంధీ తన చిన్న కోడలు
మేనకను 1982 మార్చి 28 రాత్రి తన అధికార నివాసం నుంచి వెళ్లగొట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ గుమిగూడి మేనకను దూషిస్తూ నినాదాలు చేశారు. ‘సర్దార్ కీ బేటీ
హై గద్దార్ కీ బేటీ హై’ (సిక్కు సర్దార్ కూతురు, ద్రోహి బిడ్డ) అంటూ ఆవేశంగా వారు అరిచారు. అంటే, ఇందిర కుటుంబంతో విభేదించినవారు ఎవరైనా ద్రోహులనే నిందను అప్పడూ, ఇప్పుడూ భరించాల్సిన దుస్థితి కొనసాగుతున్నది.
1984 లోక్‌సభ ఎన్నికల్లో అమేఠీ నుంచి రాజీవ్‌గాంధీపై మేనకా గాంధీ పోటీ చేసినప్పుడు కూడా ‘బేటీ సర్దార్ కీ దేశ్ కే గద్దార్ కీ’ (సర్దార్ కూతురు దేశ ద్రోహి బిడ్డ) అనే నినాదాలు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల నోట వినిపించాయి. కాంగ్రెస్ బడా నేతల ప్రోత్సాహంతోనే ఇదంతా జరగడం గమనార్హం. మేనక సిక్కులైన అంతేశ్వర్కౌర్, తర్లోచన్ సింగ్ ఆనంద్ సంతానం.
కమ్యూనిస్టులు విదేశీ తొత్తులా?
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాలంలో (197577) యువరాజుగా, ఉదయిస్తున్న సూర్యుడిగా కాంగ్రెస్ నేతల ప్రశంసలు అందుకున్న ఆమె చిన్న కొడుకు సంజయ్‌కి ఉన్న రాజకీయ చారిత్రక పరిజ్ఞానం అంతంత మాత్రమే. అయినా, ఎమర్జెన్సీని సమర్థిస్తూ వస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఆయన ఆగ్రహానికి గురైంది. అత్యవసర పరిస్థితి చివరి దశలో కమ్యూనిస్టులపై సంజయ్ విరుచుకుపడ్డారు. ‘కమ్యూనిస్టుల సిద్ధాంతం విదేశాల నుంచి వచ్చింది. వారు విదేశాలకు తొత్తులు’ అంటూ అనుచితంగా మాట్లాడారు.
మొరిగే కుక్కలను పట్టించుకోనన్న రాజీవ్
రాజీవ్ ప్రధాని పదవిలో ఉండగా 198789 మధ్య దేశాన్ని బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణం కుదిపివేసింది. ఈ ఆయుధాల కొనుగోలు ఒప్పందంలో స్వీడన్ కంపెనీ బోఫోర్స్ నుంచి రాజీవ్‌కు ముడుపులు ముట్టాయని ఆరోపణలు వెలువెత్తాయి. ఈ ముడుపులు రాజీవ్ సన్నిహితుల స్విస్ బ్యాంక్ ఖాతాలకు బదిలీ అయ్యాయని నిరూపించే డాక్యుమెంట్లను ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రిక ‘ద హిందూ’, ఇంకా ఇతర పత్రికలు ప్రచురించాయి. ముడుపులు తీసుకోవడంలో తన పాత్ర లేదంటూ నాటి ప్రధాని రాజీవ్ పార్లమెంటు సాక్షిగా చెప్పారు. బడా కుంభకోణాలపై ప్రసిద్ధ లాయర్, మాజీ కేంద్ర మంత్రి రామ్ జెఠ్మలానీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో రాజీవ్‌కు రోజూ పది ప్రశ్నలను సంధించేవారు. ఆగ్రహించిన రాజీవ్ ఒక రోజు మీడియాతో మాట్లాడుతూ ‘మొరిగే ప్రతి కుక్కకూ నేను జవాబివ్వను’ అని అన్నారు. రాజీవ్‌గాంధీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన జెఠ్మలానీ.. రాజీవ్‌కు లేఖ రాస్తూ ‘ప్రియమైన ప్రధానమంత్రీ, నేను మొరిగే కుక్కను మాత్రమే. నేను రక్తం పీల్చే వేటకుక్కను కాకపోవడం వల్ల మీరు అదృష్టవంతులు అయ్యారు. కానీ, దొంగలు కనిపించినప్పుడే కుక్కలు మొరుగుతాయనే విషయం మరవకండి’ అని అంతే దూకుడుగా హెచ్చరించారు.
కాంగ్రెస్ నేతలకు దిగజారుడు కొత్తకాదు
ఇందిరాగాంధీ పాలన చివరి కాలంలో (198084)లో కేంద్రపర్యాటకశాఖ మంత్రి అనంత ప్రసాద్‌శర్మ ఒక రోజు పార్లమెంటులో మాట్లాడుతూ ‘కేరళ గొప్ప పర్యాటక కేంద్రం. అక్కడి స్త్రీలు అందంగా ఉంటారు. ముఖ్యంగా రాత్రిపూట మలయాళీ మహిళలు చాలా ఆకర్షణీయంగా, సౌందర్యంతో మెరిసిపోతుంటారు’ అన్నారు. అనంత ప్రసాద్‌శర్మ ద్వంద్వార్థాలతో మాట్లాడడం ప్రతిపక్షాల నిరసనకు దారితీసింది. ఒక రాష్ట్రం మహిళల గురించి ఇలా కేంద్రమంత్రి పార్లమెంటులో బరి తెగించి మాట్లాడడం నాటి కాంగ్రెస్ సంస్కృతికి అద్దం పడుతున్నది.
ఉన్ లోగోంకో ఠోక్ దేంగే!
దేశంలో కాంగ్రెస్ తర్వాత సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండో జాతీయపక్షంగా బీజేపీ నేతలు కూడా అనేక సందర్భాల్లో చట్టసభల్లో, బయటా తమ రాజకీయ ప్రత్యర్థులను కించపరిచేలా దూషించడం ఆనవాయితీగా మారింది. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌తోపాటు కేంద్ర మంత్రి అనురాగ్ఠాకూర్, ఝార్ఖండ్‌కు చెందిన బీజేపీ నేత నిశికాంత్ దూబే, ఇంకా బీజేపీ నేతలు తరచుగా ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్షాల నేతలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం పరిపాటిగా మారింది. 2014లో కేంద్రంలో, ఇంకా అత్యధిక రాష్ర్టాల్లో పాలకపక్షంగా అవతరించిన బీజేపీ నేతలు ప్రతిపక్షాల న్యాయబద్ధమైన విమర్శలను సహించలేకపోతున్నారు. విపక్ష నేతలపై నోరు పారేసుకుంటున్నారు. 2022 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని, ‘ఉన్ లోగోంకో ఠోక్ దేంగే’ (రాజకీయ శత్రువులను లేపేద్దాంఅనే అర్థంలో) అని సొంత పార్టీ వారితో చెప్పడం జగమెరిగిన సత్యం. దేశంలో జాతీయ రాజకీయ పక్షాలుగా చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీ పెద్ద నేతలే నోరుపారేసుకుంటారని, అడ్డగోలుగా బెదిరించే రీతిలో మాట్లాడతారని భారత ప్రజలు ఎప్పుడో గ్రహించారు. ఈ రెండు పెద్ద పార్టీల అగ్రనేతలే ఈ విషయంలో ముందుండి తమ నాయకులు, కార్యకర్తలను నడిపించడం భారత ప్రజాస్వామ్యానికి ఎనలేని నష్టం.
నాంచారయ్య మెరుగుమాల