భారతీయ ఓటీటీ చరిత్రలో సంచలనం సృష్టించడంతో పాటు అత్యంత ప్రజాదరణ పొందిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది. అమెజాన్ ఎమ్జీఎం స్టూడియోస్ మరియు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 04న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, సిరీస్‌లో అదరగొట్టిన ప్రధాన నటీనటులందరూ మళ్లీ పెద్ద తెరపై తమ విశ్వరూపం చూపించడానికి వస్తున్నారు.
“సింహాసనం అనేది రాజకీయాల ద్వారా రాదు, అలా అని వంశపారంపర్యంగానూ రాదు… కేవలం బాహుబలం ఉంటేనే సింహాసనం దక్కుతుంది అనే పవర్ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఓటీటీలో వెబ్ సిరీస్‌గా ప్రేక్షకులను అలరించిన ఈ నేర ప్రపంచాన్ని, మరింత భారీ హంగులతో, అత్యున్నత నిర్మాణ విలువులతో వెండితెర కోసం మలిచారు. గతంలో సిరీస్‌లో మరణించినట్లు చూపించిన మున్నా భయ్యా (దివ్యేందు) పాత్ర ఈ చిత్రంలో మళ్లీ రీఎంట్రీ ఇస్తుండటం అభిమానులకు అసలైన విందుగా మారనుంది. ఇక మిర్జాపూర్ సింహాసనం కోసం జరిగే పోరులో కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డూ పండిట్ (అలీ ఫజల్) మరియు మున్నా భయ్యా మధ్య జరిగే రక్తపాతంతో కూడిన పోరాటం ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందులతో పాటు శ్వేతా త్రిపాఠి, రసికా దుగ్గల్, అభిషేక్ బెనర్జీ, జితేంద్ర కుమార్, రవి కిషన్ మరియు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.