శ్రీ శుక ఉవాచ- పీతాంబరుడు జీర్ణాంబరునితో ఇంకా ఇలా పలికాడు- కుచేలా! గురు గృహంలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞాపించగా కట్టెలు తెచ్చేందుకు అడవికి వెళ్లాము, గుర్తుందా?
సీ॥ ఘుమఘుమారావ సంకుల ఘోరజీమూత
పటల సంచ్ఛనాభ్రభాగమగుచు
జటుల ఝంఝూనిలోత్కట సముద్ధూత
నానావిధ జంతు సంతాన మగుచు
జండ దిగ్వేదండ తుండ నిభాఖండ
వారిధారా పూర్ణవసుధ యగుచు
విద్యోతమానోగ్ర ఖద్యోత కిరణ జి
ద్విద్యుద్ద్యుతిచ్ఛటా విభవ మగుచు
తే॥ నడరి జడి గురియగ నిను డస్తమింప
భూరి నీరంధ్ర నిబిడాంధకార మేచి
సూచికా భేద్యమై వస్తు గోచరంబు
గాని యట్లుండ మనము నవ్వాన దడిసి’
ఆ సమయంలో ఆకాశమంతటా భయంకర కారుమేఘాలు కమ్ముకున్నాయి. వాటి గర్జనలకు భూమ్యాకాశాలు దద్దరిల్లాయి. మహావేగంగా వీచిన ప్రభంజనం- సుడిగాలులు వన్యమృగాలను నిలువనీయకుండా చేసి కలవరపెట్టాయి. చండ ప్రచండ దిగ్గజాల తుండాల వంటి బలమైన వర్షధారలచే భూతలమంతా జలమయమైపోయింది. ప్రచండంగా వెలుగుతున్న మార్తాండ- సూర్య కిరణాలను మించిన క్షణప్రభ- మెరుపుల కాంతులు క్షణక్షణం మిరుమిట్లు గొలిపాయి. ఇంతలో ఇనుడు- సూర్యుడు అస్తమించాడు. అంతలోనే కళ్లు పొడుచుకున్నా ఏమీ కనిపించనంత దట్టంగా కారుచీకటి కమ్ముకుంది. అట్టి జడివానలో, సంగడీ- ఓ నేస్తమా! మనమిద్దరం తడిసి ముద్దయిపోయాం. తెల్లవారుతుండగా వర్షం తగ్గగా మన గురువు మనలను వెదుకుచూ వడివడిగా వచ్చారు. వానలో తడిసి గడగడ వణుకుతున్న మనలను చూచి ఎంతో పరితపిస్తూ ఇలా నుడివాడు-
చ॥ ‘కటకట! యిట్లు మా కొఱకుగా జనుదెంచి మహాటవిన్ సము
త్కట పరిపీడ నొందితిరి, గావున శిష్యులు! మీ ఋణంబు నీ
గుట కిది కారణంబు సమకూరెడి బో, ఇట మీద మీకు వి
స్ఫుట ధనబంధు దార బహుపుత్త్ర విభూతి జయాయురున్నతుల్’
‘నాయనలారా! మా కోసం మీరు అడవికి వచ్చి పడరాని ఇడుముకు- కష్టానికి గురి అయ్యారు. మీ గురు రుణం తీర్చుకొన్నారు. మీకు ధన దార (భార్య) పుత్ర సంపదలూ, ఉన్నతి, విజయశ్రీ- ఇవన్నీ చేకూరగలవు అని దీవించి వాత్సల్యంతో ఇంటికి
తీసుకువెళ్లాడు కదా!
అప్పటిదాకా చడీచప్పుడు లేక ఒక్కుమ్మడిగా విరుచుకుపడ్డ ఘోరమైన కారుమబ్బుల జడివాన జోరు, వడివడిగా వీచిన దారుణమైన సుడిగాలుల హోరు, సారెసారెకూ- మాటిమాటికి మిరుమిట్లు గొలిపే మెరుపు తీగల సరిగె- కాంతులను పై సీస పద్యంలో పోతనగారు ఆలంకారిక శైలిలో వర్ణించిన తీరు కడు హృద్యం- సహృదయ హృదయాహ్లాదకరం!
పరమాత్ముడు కుచేలునితో ఇంకా ఇలా అన్నాడు- ‘మహాత్మా! మనం చదువుకున్న దినాలలో అన్యోన్య చనువు- స్నేహం, అభిమానాలతో చేసిన పనులన్నీ నీవు మరువవు కదా!’ ఇందున్న రహస్యం? ఎందుకీ కుశల ప్రశ్నలు, ప్రేమ సంభాషణలు, వినోద వార్తలు? నేస్తమా! మిత్రుని పట్ల దాపరికం పూనితే దానికి ఫలం దారిద్య్రం! అదాన దోషం, అసత్య దోషం! గాలివాన రాత్రి అడవిలో, గురుపత్ని ఇచ్చిన, దాచుకున్న శనగలను చాటుగా- రహస్యంగా తిన్నాడు కుచేలుడు. ఏమిటి మిత్రమా! నోటిలో కటకటలాడిస్తున్నావు- అని శకటాసుర భంజనుడు కృష్ణుడు అడుగగా, ‘చెలికాడా! ఏమీ లేదు, చలికి పలువరుసలు రెండూ పరస్పరం కొట్టుకుంటున్న చప్పుడు’ అన్నాడు కుచేలుడు. అప్పుడే అనుకున్నాడు పరమాత్మ- ‘అకటా (అయ్యో)! నీ నుంచి ఏదైనా పుచ్చుకొని కాని నీకు ఇవ్వలేను కదా!’ పెట్టనిదే పుట్టదంటారు గదా! ఇక భవిష్యత్తులోనైనా జాగ్రత్తగా మెలగమని హెచ్చరించాడు వ్యంగ్యంగా- నర్మగర్భంగా. అంతేకానీ, ఆ రోజున నీవు నా యెడల దాపరికం చేసినందుకు ఇంత దారిద్య్ర భాజనుడవయ్యావని వాచ్యంగా చెప్పి అతనిని నొప్పించలేదు.
శుకుడు- రాజా! ఇలా మాధవుడు మన్నన- ఆదరణతో చిన్ననాటి ముచ్చటలను పేర్కొన్న- పలికిన మధురమైన మాటలు విన్న కుచేలుడు ఉప్పొంగిపోయాడు. కృష్ణునితో ఇలా విన్నవించాడు.. వనజోదరా! గోవిందా! గురుమందిరంలో మనమున్న కాలంలో ముదమున- సంతోషంతో చేయని ఎన- సాటిలేని పనులంటూ ఉన్నాయా? అది అలా ఉండనీ..
కం॥ ‘గురుమతి దలపగ ద్రిజగ
ద్గురుడవనం దగిన నీకు గురుడనగా నొం
డొరు డెవ్వ? డింతయును నీ
కరయంగ విడంబనంబ యగుగాదె హరీ!’
‘పురుషోత్తమా! నీవు ముల్లోకాలకు గురుడవు. నీకూ గురుడంటూ ఒండొరుడు- వేరొకడు ఉన్నాడా? వనమాలీ! ఆలోచించి కనగా, ఇదంతా నీ లీలగాని వేరేమీ కాదు గదా! నీ కాయమే- శరీరమే వేదం. అయినా నీవు మోదంతో- ఆనందంగా వేదాధ్యయనం కొఱకు గురుకుల వాసం చేశావంటే, ఉరుక్రమా! ఎంత అచ్చెరువు- ఆశ్చర్యం! ఇది నీ మాయగాక మరేమిటి?’ కుచేలుడు సాభిప్రాయంగా పలికిన పై మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన గోవిందుడు మందస్మిత సుందర వదనారవిందుడై, అతనితో ముందుగా నీవిచ్చటికి వస్తూ నా యందలి భక్తితో నాకేమి బహుమానం తెచ్చావో, అది చెప్పు. ఆ పదార్థం లవలేశమైనా- లొచ్చు (తక్కువ)దైనా, హెచ్చు- పదివేలుగా అవశ్యం ఆమోదించి మోదిస్తా- సంతసిస్తా. మదిలో నాపై భక్తి లేని దుష్టాత్ముడు- నీచుడు మేరు పర్వతమంత పదార్థం ఇచ్చినా అది నాకు ఇష్టం కాదు…
కం॥ ‘దళమైన బుష్పమైనను
ఫలమైనను సలిలమైన బాయని భక్తిం
గొలిచిన జనులర్పించిన
నెలమిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్’
‘మిత్రమా! పత్రమైనా, పుష్పమైనా, జలమైనా, ఫలమైనా భక్తులు నిశ్చల- చెరగని భక్తితో నాకు సమర్పిస్తే, దాన్ని నేను రుచిరా (మధురా)న్నంగా భావించి ఆరగిస్తా’ అని వాసుదేవుడు వినయపూర్వకంగా వాక్రుచ్చగా విని విప్రుడు తనిసి- తృప్తిపడి ఎంతో ఆనందించాడు. కాని, శ్రీధరుని అనంత ఐశ్వరాన్ని కని, తాను తెచ్చిన అటుకులను అర్పించనేరక తలవంచుకొని ఊరక- మౌనంగా కూర్చిండిపోయాడు.
సంస్కృత భాగవతంలోని ‘పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి, తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః’. మాకందం- మామిడిపండు వంటి మధురమైన పై కందం ఈ శ్లోకానికి సుశ్లోకుడు పోతన అమాత్యుని అందమైన అనువాదం. ఈ శ్లోకం గీతలోని నవమాధ్యాయంలో కూడా యథాతథంగా దర్శనమిస్తుంది. శుకుడు- రాజా! సమస్త జంతు (భూత) అంతర్యామి- అంతఃకరణ సాక్షి ‘అనంతశ్రీః’ అయిన కంత (మన్మథ) జనకుడు శ్రీకృష్ణుడు తన దివ్య స్వాంతం- చిత్తంలో అంతా గ్రహించి, ఈ బ్రాహ్మణుడు ఎంత నిష్కామి! ఈ జన్నిగట్టు (బాపడు) మున్నెన్నడూ కూడా ఐశ్వర్యాన్ని కోరి నన్ను సేవించలేదు. ఇప్పుడు కూడా తన దేవేరి- గృహిణి సంతృప్తి కొరకు నన్ను చేర వచ్చాడు. కాన, ఈ అకామునికి ఇంద్రాదులకు కూడా అందరాని బహువిధ సంపదలని క్రన్నన- వెనువెంటనే ఇవ్వాలి’ అని వెన్నుడు నిశ్చయించాడు. అయితే, అతని నుంచి ఏదైనా గ్రహించి మాత్రమే అనుగ్రహించగలడు.
కుచేలుని చినిగిన ఉత్తరీయంలోని అటుకుల ముడి చూచి కవ్వడి సంగడి- అర్జున సఖుడు కృష్ణుడు ‘ఇదేమిటి?’ అని అడుగుతూ వడివడిగా ముడి విప్పి అటుకులు గుప్పెడు గ్రహించాడు. సకల లోకాలకు, నాకూ తనివి- సంతృప్తినివ్వడానికి ఇవి చాలునని కనకచేలుడు కడు గారవం- మాలిమి (అనురాగం)తో ఆ అటుకులను ఆరగించాడు. కమలా కాముకుడు- మకర కుండలుడు, శ్యామ సుందరుడు లక్ష్మీపతి సౌదామ- కుచేలుని తండుల- అటుకుల కాముకుడయ్యాడు. ఇది జ్ఞానోత్తర భక్తి శక్తి! కుచేలుడు జ్ఞానీభక్తుడు. భగవంతుని తాత్తికంగా తెలుసుకొని సహజ స్వాభావికంగా, నిష్కామ భావంతో నిత్యం నిరంతరం భజించువాడే జ్ఞానీభక్తుడు.
కుచేలుడు ఆ కోవకు చెందినవాడు. ఆయన నిర్ధనుడైనా నిర్భాగ్యుడు కాదు. భగవదారాధనలో భోగసామగ్రి- వస్తువుల కాదు, భక్తి భావం ప్రధానం. రాశి కాదు వాసి ముఖ్యం. కాన, భగవంతుని ద్రవ్య బాహుల్యంతో మెప్పించే యత్నం వ్యర్థం. అంతకంటే ఘోర తప్పిదం ఉండదేమో! మాధవుడు భక్తి ప్రియుడు. భక్తుని దృష్టిలో న్యూనాధిక్యతలు- హెచ్చుతగ్గులున్నా భగవంతుని దృష్టిలో అవి ఉండవు. ‘అటుకులల్పము కుచేలుడు గణించక దేర, బొక్క సాగితివేల లెక్కగొనక/ భక్తులకు నీవు పెట్టుట భావ్యమౌను, వారికాశించితివి తిండివాడ వగుచు’- అంటూ శేషప్పకవి ఉపాలంభనం చేస్తాడు- దెప్పుతాడు.
కుచేలుడు సులభంగానూ, విరివిగాను లభించే పత్ర, పుష్ప, ఫల, జలాలలో ఏ ఒక్కటీ తీసుకెళ్లలేదు. ఎంత పూట గడవని పేద అయినా ఇంట్ల ఫలపుష్పాదులు లేకపోవచ్చు గాక, పెరట్లో తులసి మొక్క కూడా ఉండదా? అలాకాక అటుకులే ఎందుకు తీసుకెళ్లాడు? భార్య పొరుగిళ్లలో యాచించి తెచ్చినవి అవే గనకగా? కథాపరంగా అయితే అంతే. కాని, పరమార్థ పరంగా వాటికి ఎంతో విశేషముందని విశిష్టమైన వ్యాఖ్య.
భగవంతుడు గీతలో బోధించిన ‘పత్రం పుష్పం ఫలం తోయం’ అనేది సకామ భక్తులకు ఎక్కువగా అన్వయిస్తుంది. ఈ నాల్గింటిలో ఏది భక్తితో సమర్పించినా భగవంతుడు స్వీకరించి భక్తుల కోరికలు తీరుస్తాడు. కాని, మనిషికి ఎప్పటికప్పుడు కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. ఈ సకామ కర్మలే భవిష్య జ్జన్మలకు బీజాలవుతాయి. ఆకులలో వ్యాకులపరచే పునరావృత్తి (రీబర్త్) స్వభావముంది. క్రోటన్ మొదలైన కొన్ని మొక్కల ఆకుల నుంచి పునరుత్పత్తి (రీ ప్రొడక్షన్) కల్గుతుంది. బంతిపూల వంటి కొన్ని పుష్పాలు కూడా పునరావృత్తికరాలు. ఇక, గింజలు, టెంకలు కలిగిన ఫలాల సంగతి చెప్పనవసరం లేదు. ఈ వృక్షజాతి పుట్టి, పెరిగి, ఫలించడానికి కారణమైన తోయం- నీటి మాట (నీరే ప్రాణాధారం) సరేసరి! సూర్యుని వల్ల వర్షం, వర్షం వల్ల అన్నం, అన్నంలో నుంచి వివిధ ప్రాణుల ఉత్పత్తి గదా! ఇంత విచారణ చేసి జ్ఞానియైన కుచేలుడు లోక శిక్షణ బుద్ధితో ఈ నాల్గింటిని విసర్జించాడు.
సంకల్పాల నుంచి పుట్టుకొచ్చే సకామ కర్మలే పునర్జన్మ కారణాలు కనుక ఆ జన్మ బీజాలను- విత్తనాలను- ‘జ్ఞానాగ్నిః సర్వ కర్మాణి భస్మపాత్ కురుతే’ (గీత)- జ్ఞానాగ్నిలో వేయించి, వాటి పునరుత్పాదక శక్తిని నశింపజేసి పృథుక తండులాలు- అటుకులుగా రూపొందించి పరమాత్మకు అవి అర్పించాడు. భాగవతంలో గోపకన్యల కాత్యాయనీ వ్రత సమాప్తి రోజున పరమాత్మ వారిని అనుగ్రమిస్తూ- ‘మీరు మీ మనోబుద్ధులను- కోరికలను నా యందు సమర్పించారు కాన, ఇక ముందు మీకు లౌకిక భోగవాంఛలు కలుగవు’ అని ఆశీర్వదిస్తూ- ‘భర్జితా క్వథితాధానాః ప్రాయో బీజాయ నేష్యతే’- వేయించిన లేక ఉడకబెట్టిన ధాన్యపు గింజలు మొలకెత్తలేవు గదా! అని ఈ దృష్టాంతమే ఇచ్చాడు. జీవులకు జన్మ రాహిత్యం కలిగించే పటుతరమైన అటుకుల సమర్పణలో కిటుకు- మర్మం ఇదే!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006