Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. నార్త్ అమెరికాలో ‘పెద్ది’ ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే 500K డాలర్ల (హాఫ్ మిలియన్) మార్క్‌ను దాటినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఈ స్థాయి బుకింగ్స్ రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్ కొనసాగితే కేవలం ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు రావడం కూడా ఈ అడ్వాన్స్ బుకింగ్స్‌కు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అమెరికా ప్రేక్షకుల్లో రామ్ చరణ్‌కు ఏర్పడిన క్రేజ్ ‘పెద్ది’పై భారీ హైప్‌ను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి. ముఖ్యంగా శృతి హాసన్ స్పెషల్ అప్పియరెన్స్‌తో వచ్చిన ‘హాళ్లళ్లల్లో’ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రామ్ చరణ్ కొత్త మాస్ లుక్, బుచ్చిబాబు భావోద్వేగ కథనం, భారీ తారాగణం.. ఈ అంశాలన్నీ కలిసి ‘పెద్ది’ని ఈ ఏడాది అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో ఒకటిగా నిలబెడుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఓవర్సీస్ బాక్సాఫీస్‌పైనే ఉంది. విడుదల తర్వాత ‘పెద్ది’ ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.