వరంగల్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతాంగానికి నీళ్లు ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్‌రెడ్డి తప్పుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరాన్ని తమకు అప్పగిస్తే 15 రోజుల్లో నీళ్లిచ్చి చూపిస్తామని స్పష్టంచేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తుమ్మలు మొలిచి..పడావుపడిన ఎస్సారెస్పీ కాలువ వెంట సోమవారం ఆయన పాదయాత్ర చేశారు. రాయపర్తి మండలం మైలారం నుంచి తొర్రూరు మండలం నాంచారిమడూరు దాకా 10 కిలోమీటర్ల మేర వందలాది మంది రైతులతో కలిసి పాదయాత్ర చేశారు. కేసీఆర్ హయాంలో నీళ్లు పారిన ఎస్సారెస్పీ కాలువల్లో రైతులు, బీఆర్ఎస్ నాయకులు మోటర్‌బైక్‌లు, ట్రాక్టర్లు నడిపి రేవంత్ సర్కార్‌పై నిరసన తెలిపారు. మైలారం నుంచి నాంచారిమడూరు దాకా ఎస్సారెస్పీ కాలువకు ఇరువైపులా ఉన్న గ్రామాల్లో మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని మాజీ మంత్రి ఎర్రబెల్లితో పాదయాత్రలో భాగమయ్యారు. పాదయాత్ర నాంచారి మడూరుకు చేరుకోగానే వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై ఎర్రబెల్లి మెరుపు ధర్నాకు దిగారు. జాతీయ రహదారిపై వందలాది మంది రైతులు, ట్రాక్టర్లతో బైఠాయించారు.
రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రేవంత్ సర్కార్ చేతగానితనంతో రైతులు అరిగోసపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్యాణలక్ష్మిని శాశ్వతంగా ఎగ్గొట్టేందుకే రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మికి కేసీఆర్ ఇచ్చే పైసలతోపాటు తులం బంగారం ఇస్తామని రేవంత్ మోసం చేశారని విమర్శించారు. కల్యాణలక్ష్మి పథకంపై హైకోర్టు స్టే విధిస్తే ఈ ప్రభుత్వం నాలుగు వారాలైనా కౌంటర్ వేయాలనే సోయిలేకుండా పోయిందని మండిపడ్డారు. పేదింటి ఆడబిడ్డకు మేనమామగా కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆ పథకాన్ని ఆపేయాలని చూస్తే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని, ఒకవేళ నిలిపివేస్తే మహిళలే రేవంత్‌రెడ్డిని తరిమివేస్తారని హెచ్చరించారు.