కేసీఆర్‌పై కక్షతో కేసీఆర్ కిట్, రైతుబీమా, కల్యాణలక్ష్మి లాంటి పథకాలకు కాంగ్రెస్ సర్కార్ మంగళం పాడుతున్నది. సంక్షేమం అనేది పాలకుల బాధ్యత అనే విషయం రాజ్యాంగంలోని ఆర్టికల్-35 స్పష్టంచేస్తున్నది. అసెంబ్లీలో చట్టబద్ధంగా ఆమోదించిన బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించాం. పథకాలను చట్టబద్ధం చేయాలనే ప్రశ్న అసహేతుకం. పేదలపై కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధిని, కాంగ్రెస్ సర్కార్ దగాబుద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో కర్రుకాల్చి వాతపెడ్తరు. – హరీశ్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 22-ఏ పేరిట దోపిడీకి తెరతీసి, అడ్డగోలుగా ప్రజల ఆస్తులు, భూములను నిషేధిత జాబితాలో పెట్టి కమీషన్లు దండుకుంటున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ముమ్మాటికీ 30శాతం కమీషన్ సర్కారేనని, ఆ కమీషన్ల మంత్రి ఎవరో ప్రజలందరికీ తెలుసని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేశారు. రైతుబీమా ఎగ్గొట్టిన సర్కార్‌ను ఎండగట్టారు. జీఆర్ఎంబీలోని ఎజెండాలోని అంశాలపై ప్రభుత్వ అలక్ష్యాన్ని బహిర్గతం చేశారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో కార్పొరేషన్లు నిర్వీర్యమైన తీరును వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, అధికార పార్టీ నేతలు తనపై చేస్తున్న ‘క్షుద్ర’ రాజకీయాలను తిప్పికొట్టారు. రేవంత్‌రెడ్డి సోషల్ జస్టిస్ గురించి మాట్లాడటం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. ‘రేవంత్ పాలన అంటే కుటుంబ పాలన.. ఫోర్ బ్రదర్స్ పాలనగా మారిపోయింది.. అనుయాయులు, బావమరిది, అన్నదమ్ములు గద్దల్లా దోచుకుంటున్నారు’ అని విమర్శించారు.
సీలింగ్ భూములన్నీ నిషేధిత జాబితాలోకి
రాష్ట్రంలో 22ఏ పేరిట కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టిందని హరీశ్‌రావు ఆరోపించారు. ‘దేశవ్యాప్తంగా అర్బన్ సీలింగ్ యాక్ట్ రద్దు చేశారు, 2008లో వైఎస్సార్ ప్రభుత్వం ఆ చట్టాన్ని ఎత్తేశారు.. కానీ ఘనత వహించిన రేవంత్ సర్కార్ సీలింగ్ పరిధిలోని భూములన్నింటినీ 22ఏలో పెట్టింది’ అని ఆయన ఆరోపించారు. ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ లాంటి ప్రభుత్వ భూములు, శ్రీనగర్‌కాలనీ సర్వే నంబర్ 8, 9లోని ఇండ్ల స్థలాలు, 30 ఏండ్ల కింద కొనుక్కున్న అపార్ట్మెంట్లు, బంజారాహిల్స్ హౌసింగ్ సొసైటీలోని స్థలాలు, చివరికి ముఖ్యమంత్రి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో చేర్చారని చురకలంటించారు. రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన తర్వాత చివరి నిమిషంలోనే ప్రజలకు తమ నిషేధిత జాబితాలో ఉన్నదనే విషయం తెలియని పరిస్థితి ఉన్నదని చెప్పారు. చలాన్ డబ్బులు కూడా తిరిగివ్వకుండా ప్రభుత్వం నిలువునా దోచుకుంటున్నదని విమర్శించారు. గతంలో ప్రభుత్వం అధికారికంగా ఎన్వోసీ ఇవ్వడంతో ఇప్పుడు 22ఏలో పెట్టిన భూములకు బ్యాంకులు లోన్లు ఇచ్చాయని గుర్తుచేశారు. తక్షణమే భూములన్నింటినీ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, ఈ దోపిడీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ దెబ్బకే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీల వాయిదా
తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఏపీ నీళ్లు దోచుకెళ్తున్నా చీమకుట్టినట్టు కూడా లేదని దుమ్మెత్తిపోశారు. ఆగస్టు 5న తాను ప్రెస్‌మీట్ పెట్టిన తర్వాతే ప్రభుత్వం నిద్రలేచి మరుసటి రోజే జీఆర్ఎంబీకి లేఖ రాసిందని ఆయన గుర్తుచేశారు. బీఆర్ఎస్ చేసిన పోరాటం వల్లే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ బోర్టుల మీటింగ్‌లు వాయిదా వేసుకోవాల్సి వచ్చిందన్నారు.
కేసీఆర్‌పై కక్షతో రైతుబీమాకు ఎగనామం
నాడు కేసీఆర్ తెచ్చిన రైతుబీమా, రైతుబంధు పథకాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని, యూఎన్వో సైతం ప్రశంసించిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తుచేశారు. రాష్ట్రంలోని 42.15 లక్షల రైతులకు భరోసానిచ్చిన రైతుబీమాను గత ఆగస్టు 13 నుంచి నిలిపివేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
కల్యాణలక్ష్మిపై కుప్పిగంతులు
కల్యాణలక్ష్మి స్కీమ్‌పై రేవంత్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని హరీశ్ దుయ్యబట్టారు. కోర్టు స్టే పేరుతో కుప్పిగంతులు ఆడుతూ పథకాన్ని ఎత్తేసేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. కోర్టు స్టే ఇచ్చినందునే ఆపామని చెప్పడం సిగ్గుచేటు.. స్టే ఇవ్వకముందే ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు? ఆపొద్ద్దని ఎందుకు అప్పీల్ చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ కేసులపై వాదించేందుకు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను రప్పించి రూ.50లక్షలు కట్టబెట్టిన ప్రభుత్వం.. మరి కల్యాణలక్ష్మిపై ఎందుకు మంచి లాయర్‌ను పెట్టలేదని నిలదీశారు. మంత్రి పొన్నం చెప్పిన తప్పుడు లెక్కలే ఇందుకు సాక్ష్యమని దుమ్మెత్తిపోశారు.
ఉద్యోగులకు అన్యాయం.. జర్నలిస్టులకు ద్రోహం..
ఈహెచ్ఎస్ పేరిట ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. మూడు నెలలుగా వారి వేతనాల నుంచి ఈహెచ్ఎస్ డబ్బులు కట్ చేస్తున్న ప్రభుత్వం కార్డు మాత్రం మంజూరు చేయలేదని మండిపడ్డారు. నాడు బీఆర్ఎస్ సర్కార్ పైసా కాంట్రిబ్యూషన్ లేకుండానే జర్నలిస్టులను ఈహెచ్ఎస్లో చేర్చిందని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వారికి మొండి చెయ్యి ఇచ్చి ద్రోహం చేసిందని దుయ్యబట్టారు.
కేటాయింపు రూ.14,500 కోట్లు.. ఖర్చు 305 కోట్లు
కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత 33 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులివ్వకుండా నిర్వీర్యం చేస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. ‘ఎస్సీల కోసం బడ్జెట్లో రూ.5,400 కోట్లు కేటాయించి 74 కోట్లే ఖర్చు చేశారు.. గిరిజనుల కోసం రూ.2,730 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది కేవలం రూ.52 కోట్లే.. బీసీ కార్పొరేషన్ ద్వారా కేవలం రూ.6 కోట్లే ఖర్చుచేశారు.. దళితబంధుకు బడ్జెట్లో రూ.2వేల కోట్లు కేటాయించి రూపాయి కూడా విడుదల చేయలేదు.. 33 కార్పొరేషన్లకు రూ.14,500 కోట్లు కేటాయించినట్టు చెప్పిన సర్కార్ ఖర్చు చేసింది రూ.305 కోట్లే’ అని తెలిపారు.
ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది.. ప్రచారం కాంగ్రెస్‌ది
ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది అయితే ప్రచారం కాంగ్రెస్‌ది అన్నటు ఉన్నదని టిమ్స్ దవాఖాన ప్రారంభంపై హరీశ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్టే.. కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్‌ను అలాగే ప్రచారం చేసుకుంటున్నది. డేట్లు, డెడ్లైన్లు మార్చుకుంటూ పోయి, చివరకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్న ఆసుపత్రిలో కూడా పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాకపోవడం శోచనీయమని మండిపడ్డారు. టిమ్స్ పేరుతో మూడు హాస్పిటళ్ల నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2,679 కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు.
నడుపుతున్నది సర్కారా.. సర్కస్‌నా?
సీఎం రేవంత్ సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా? అని సోమవారం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు ప్రశ్నించారు. కల్యాణలక్ష్మిపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో అధికారులను బలిపశువులను చేయడం దుర్మార్గమన్నారు. తప్పు ప్రభుత్వానిదైతే శిక్ష అధికారులకా? అని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మిని అమలుచేయాలని డిమాండ్ చేశారు.
22ఏ అనేది ప్రభుత్వ పెద్దల దోపిడీకి ఆయుధంగా మారింది. రెవెన్యూ శాఖలో ఏ పని కావాలన్నా, నిషేధిత జాబితా నుంచి భూమిని తీసేయాలన్నా, ఫైల్ కదలాలన్నా 30శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందే. ముందుగా 22ఏ లో చేర్చడం.. ఆ తర్వాత కమీషన్లు గుంజడం.. ఆ తర్వాత సవరిస్తామని జీవోలు తెస్తామని నాటకాలాడటం.. దోచుకోవడం.. దాచుకోవడం.. ఇప్పుడు ఇదే వ్యవహారం నడుస్తున్నది. – హరీశ్‌రావు