హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : సెక్షన్ 22-ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఎందుకు పెట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఫలానా భూమి, స్థలం నిషేధిత జాబితాలో ఉన్నట్టు ప్రజలకు తెలిస్తే వాళ్లు ఇబ్బందుకు గురికారని వ్యాఖ్యానించింది. నిషేధిత ఆస్తుల వివరాలను బహిరంగంగా అందుబాటులో ఉంచాల్సిన అవసరంపై ప్రభుత్వ వైఖరి ఏందో స్పష్టం చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఇతర ఆస్తుల వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచకపోవడాన్ని సవాల్ చేస్తూ అమెరా పాషా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఏవీ శ్రవణ్ కుమార్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపిస్తూ నిషేధిత జాబితాలోని పలు ఆస్తుల వివరాలు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో కనిపించడం లేదని దృష్టికి తెచ్చారు. దీంతో వాస్తవ పరిస్థితి తెలియక ప్రజలు అలాంటి ఆస్తులను కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదురొనే ప్రమాదం ఉన్నదని తెలిపారు.
నిషేధిత ఆస్తుల జాబితాను వెబ్సైట్లో పరిశీలించేందుకు పలుమార్లు ప్రయత్నించినా జాబితా సమీక్షలో ఉన్నదని, త్వరలో ప్రచురిస్తామని మాత్రమే సందేశం వస్తున్నదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే అయినా, ఆయా భూములకు సంబంధించిన సమాచారాన్ని ప్రజల ప్రయోజనం కోసం పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచాల్సిన బాధ్యతను నిర్వర్తించడం లేదని చెప్పారు. రిజిస్ట్రేషన్ చట్టం – 1908లోని సెక్షన్ 22-ఏ(1)(17)(ఏ) నుంచి (డీ) పరిధిలోకి వచ్చే నిషేధిత ఆస్తుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉన్నదని, దీనిపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. నిషేధిత జాబితాలో ఉన్న వ్యవసాయ భూముల్లో నాలా కన్వర్షన్ జరిగినా, వాటి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించారు. నిషేధిత ఆస్తుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచకపోవడంపై ప్రభుత్వ వైఖరిని వారంలోగా చెప్పాలని ఆదేశించారు.