హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ విద్య వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నది. అడ్మిషన్ల సీజన్లో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తాయి. పరిస్థి తి చూస్తుంటే తెలంగాణ ఉన్నత విద్యామండలి వర్సెస్.. కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ అన్నట్టుగా పరిస్థితులున్నాయి. ఫలితంగా డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. 2026-27 విద్యాసంవత్సరంలో డిగ్రీలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని సర్కార్ ఆదేశించింది. దీంతో కళాశాల విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి వేర్వేరుగా ప్రయత్నాలు ప్రారంభించాయి. కళాశాల విద్యాశాఖ అప్రెంటిస్‌షిప్ కోర్సులు(ఏఈడీపీ) ప్ర వేశపెట్టేందుకు ప్రయత్నించగా, ఉన్నత విద్యామండలి ఎమర్జింగ్ కోర్సుల పేరిట నాన్ అప్రెంటిస్‌షిప్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేశాయి. 94 న్యాక్ గుర్తింపు పొందిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అప్రెంటిస్‌షిప్ కోర్సులను కళాశాల విద్యాశాఖ ప్రవేశపెట్టింది. గతంలో 16 కోర్సులు ప్రవేశపెట్టగా, ఈ విద్యాసంవత్సరం 11 కోర్సులు ప్రవేశపెట్టింది. ఉన్నత విద్యామండలి ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 11 నాన్ ఏఈడీపీ కోర్సులు ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. నాన్ ఏఈడీపీ కోర్సులను ఇంతవరకు దోస్త్‌లో చేర్చలేదు. ఇంతకాలం కోల్డ్ వార్‌కు దారితీయగా, తాజాగా సోమవారం వివాదం రోడ్డెక్కింది. ఒకరి వాదనను మరొకరు తప్పుబట్టడం.. ఇదే విషయంపై సర్కార్‌కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది.
‘డిగ్రీలో కొత్త కోర్సులకు మేం వ్యతిరేకం కాదు. ప్రొసిజర్ ఫాలో కావాలని మాత్రమే మొదటి నుంచి చెబుతున్నాం. పైగా ప్రైవేట్ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టే అంశం యూనివర్సిటీలు, ఉన్నత విద్యామండలి పరిధిలోనిది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కో ర్సులు ప్రవేశపట్టే అంశం మాత్రమే మాది. మేం యూజీసీ మార్గదర్శకాలు అనుసరించి అప్రెంటిస్‌షిప్ కోర్సులను న్యాక్ గుర్తింపు పొందిన డిగ్రీ కాలేజీల్లో ప్రవేశపెట్టాం. ప్రైవేట్‌లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలంటే రూల్స్ భిన్నంగా ఉంటాయి. ముందుగా సిలబస్‌ను అన్ని యూనివర్సిటీలు ఆమోదించాలి. కాలేజీల్లో తనిఖీలు పూర్తికావాలి. నివేదికల ఆధారం గా యూనివర్సిటీలు ఎన్ని సీట్లు సిఫార్సు చేస్తే అన్ని సీట్లను ఆమోదించి మేం దోస్త్‌లో అప్లోడ్ చేస్తాం. ఆమోదించిన వెంటనే సీట్లను దోస్త్‌లో అప్లోడ్ చే స్తాం. ఈ విషయంలో మాకేం భేషజాల్లేవు’ అంటూ కళాశాల విద్య కమిషనరేట్ వివరణ ఇచ్చింది.
‘కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు అన్ని యూనివర్సిటీల వైస్‌చాన్స్‌లర్స్ (వీసీ) ఆమోదం తెలిపారు. కోర్సుల సిలబస్‌ను వర్సిటీల బీవోఎస్‌లు ఆమోదించారు. పలు కొత్త కోర్సుల కో సం దరఖాస్తు చేసుకు న్న కాలేజీల్లో తనిఖీ లు కూడా పూర్తయ్యా యి. ఆయా నివేదిక లు కళాశాల విద్యాశా ఖ కమిషనరేట్‌కు చే రాయి. కానీ కావాలనే అప్రూవల్ ఇవ్వడంలే దు. దోస్త్ కన్వీనర్ చె ప్పినా.. కమిషనర్ ఆ మోదం లేదని అప్రూవల్స్ ఇవ్వడంలేదు. దోస్త్ కన్వీనర్ ఆదేశాల ను పట్టించుకోకపోతే ఎట్లా..? ఏదో ఒక కా రణం చెబుతూ వాయిదాటవేస్తున్నారు. కన్వీనర్‌ను సంప్రదించకుండానే దోస్త్‌లో ఏఈడీపీ కోర్సులను చేర్చారు’ అని ఉన్నత విద్యా మండలి వాపోతున్నది.
కొత్త కోర్సులు ప్రవేశపెట్టే విషయంలో కౌన్సిల్, కమిషనరేట్ మధ్య నెలకొన్న పంచాయితీ ఆఖరుకు సర్కార్ వద్దకు చేరింది. తాడో.. పేడో తేల్చుకోవాలన్న భావనతో ఉన్న ఉన్నత విద్యామండలి చైర్మన్ వీ బాలకిష్టారెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ప్రయత్నా లు చేస్తున్నట్టు సమాచారం. సోమవారం ప్రభుత్వ సలహాదారు కే కేశవరావును కలిసి అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. తాను విద్యార్థులకు మంచి చే సేందుకు ప్రయత్నిస్తుంటే మోకాలడ్డుపెడితే ఎట్లా..? అని ప్రశ్నించడమే కాకుండా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరినట్టు తెలిసింది. ఈ కోర్సులను ఆపి తే నష్టపోయేది స్టూడెంట్లేనని బాలకిష్టారెడ్డి చెప్పారు.