సుబేదారి (వరంగల్) ఆగస్టు 14 : హనుమకొండ హంటర్ రోడ్డులోని ‘జూలో ఏం జరుగుతోంది?’ అంటూ నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. కాకతీయ జూ పార్క్ ఇంజార్జి మయూరి డిప్యూటేషన్‌ను చీఫ్ కన్జర్వేటర్ వినయ్ కుమార్ రద్దు చేశారు. ఆమెను యథావిధిగా మహబూబాబాద్ జిల్లా గంగారం పాత పోస్టులోనే కొనసాగించాలని ఆయన ఆదేశించారు.
“జూ పార్క్‌కు పూర్తి స్థాయి అధికారి లేక.. పర్యవేక్షణ కరువు .. హనుమకొండ కాకతీయ జూ పార్కు లో ఏం జరుగుతుంది..? అనే కథనాన్ని గురువారం నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించారు. మంత్రి ఇలాకాలో వరుసగా వన్య ప్రాణులు, పెద్ద పులి, కుక్కల వేటలో కృష్ణ జింకలు, మూషిక జింకలు, ఇటీవల కరెంట్ షాక్ తో ఎలుగుబంటి మరణాలను ప్రస్తావించిన నమస్తే కథనంపై అటవీ శాఖ ఉన్నత అధికారులు స్పందించారు.

హనుమకొండ కాకతీయ జూ పార్క్‌కు డిప్యూటేషన్ పద్దతి ఇంఛార్జిగా పనిచేస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మయూరితో పాటు భద్రాద్రి జోన్ లోని మరో నలుగురి ఫారెస్ట్ ఉద్యోగుల డిప్యూటేషన్లు రద్దు చేస్తూ , పాత రెగ్యులర్ పోస్టుల్లో కొనసాగిస్తూ శుక్రవారం చీఫ్ కన్జర్వేటర్ వినయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
