హైదరాబాద్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ) : ‘మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు ఉండాలి. కేవలం డిగ్రీ కేంద్రీకృత విద్యతో సరిపెట్టుకోకుండా విద్యార్థులు నైపుణ్యాలు, ఆచరణాత్మక అనుభవం, పరిశోధనా సామర్థ్యాలు పెంపొందించుకుని ఉద్యోగాలకు సిద్ధం కావాలి’ అని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) ఆధ్వర్యంలో జేఎన్టీయూహెచ్ వేదికగా శనివారం నిర్వహించిన ‘రీచ్-2026 పరిశోధన, విద్యాభివృద్ధి’ సదస్సును గౌరవ అతిథి బీవీ మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాసామ్తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ.. డిసెంబర్ 2026లో జరగనున్న ‘ది ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్‌కు రీచ్ సదస్సు సూచనలు ఎంతో దోహదపడుతాయని తెలిపారు.
అభ్యాసం తప్పనిసరి: మోహన్‌రెడ్డి
గౌరవ అతిథి బీవీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్య సాధనకు విద్యార్థుల్లో పరిశ్రమ ఆధారిత నైపుణ్యాలు, అనుభవపూర్వక అభ్యాసం తప్పనిసరి అని అన్నారు. టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమలు-పరిశోధనా సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకే ఈ సదస్సు నిర్వహించామని, ఇందులో 25 మంది వైస్ చాన్స్లర్లు, సంస్థల అధిపతులు పాల్గొన్నట్టు తెలిపారు. ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి రచించిన ‘హైదరాబాద్: విద్య, పరిశోధన..’ పుస్తకాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ఆవిషరించారు. జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కిషన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ సవరణ, బజాజ్ ఇంజినీరింగ్ సిల్స్ ట్రైనింగ్(బెస్ట్), ‘రీసెర్చ్ టు ఎంటర్ప్రైజ్’ దిశగా సాగుతున్నట్టు తెలిపారు.