కుటుంబ బంధాలలోని మాధుర్యాన్ని తెలియజేస్తూ నవలలు రాయడంలో హోతా పద్మినీదేవి సిద్ధహస్తులు. ఇటీవలి కాలంలో వచ్చిన వారి నవల ’శిశిరం దాటిన వసంతం’. పాఠకుడిని అక్షరాల వెంట పరుగెత్తించే శక్తి శైలి రచయిత్రికి ఉండటంతో కథ వేగంగా సాగిపోయింది. కథలోకి వస్తే- హసిత, రుచిర స్నేహితురాళ్లు. హసిత తండ్రి- ఈశ్వర ప్రసాద్ స్థితిమంతుడు, సహృదయుడు. తన కుటుంబీకులు ఇష్టపడకపోయినా తనకు నచ్చిన సాధారణ కుటుంబానికి చెందిన అహల్యను పెళ్లాడి అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. వారి ముద్దుల తనయను పెళ్లాడిన వారికి అతని ఆస్తి వస్తుంది. కనుక, అతని అక్క తన కొడుకు కాశ్యప్‌ను హసితకు చేసుకోమని పదేపదే అడుగుతుంది.
మేనరికాలు ఇష్టం లేదని చెబుతాడు ఈశ్వర ప్రసాద్. సోదరీమణులతో పాటు అతని తల్లి కూడా కొడుకు నిర్ణయాన్ని తప్పు పడుతుంది. అతని ప్రవర్తనకు కోడలు అహల్య కారణమని భావిస్తారు.. నిందిస్తారు. ఈశ్వర్ ప్రసాద్ నిరాకరించడానికి కారణం అతని అక్కలు, తల్లి డబ్బు మనుషులు. బంధాలకన్నా డబ్బుకి విలువ ఇచ్చే వ్యక్తులు. తమ్ముడి ఆస్తి తమ ఆస్తిలో కలిసిపోవాలన్న దూరాలోచనతోనే హసితను కాశ్యప్‌కు ఇచ్చి చేయమని అతన్ని పోరుతూ ఉంటారు. అతన్ని ఏమీ అనలేక అతని భార్య అహల్యను ఆడిపోసుకుంటూ ఉంటారు. సొంత ఆడపడుచుల నుంచే సూటి పోటీ మాటలు వస్తుంటే భరించలేకపోతుంది అహల్య. దీనికి సమాంతరంగా నడిచే మరో కథ రుచిరది. ఆమె తండ్రి మధు బ్యాంక్ మేనేజర్.
తల్లి యామిని సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. భర్త పేదవాడని యామినికి అసంతృప్తి. ఒక శుభ సమయంలో ఈశ్వర ప్రసాద్‌కి మధుకి పరిచయమై, గాఢ స్నేహంగా మారుతుంది. రెండు కుటుంబాలదీ ఒకే ఆలోచన తమ పిల్లలిద్దరికీ మంచి సంబంధాలను చేయాలని! యామినికి పెద్ద జమీందారీ కుటుంబంలో కూతురిని ఇవ్వాలని తాపత్రయం. మధు ఆలోచనలు వేరు. డబ్బు, హోదా కాకుండా, వ్యక్తిగత నడవడిక, భార్యను ప్రేమగా చూసుకునే మనస్తత్వం ఉన్నవాడు కావాలనుకుంటాడు. పుట్టింట వైభవాన్ని చూసిన యామిని భర్తను లెక్కచేయక పెద్ద బిజినెస్ చేస్తున్న కాదంబరి కొడుకు నవీన్‌కు కూతుర్ని కట్టబెడుతుంది. అక్కడి నుంచి రుచిరకు కష్టాలు మొదలు. అత్త, భర్త ఇద్దరూ ఆమెను అన్యాయంగా ఇబ్బందులు పెడతారు.
పరిస్థితి విడాకుల దాకా వెళుతుంది. హసిత కథ కూడా ఇంచుమించు ఇలాగే నడుస్తుంది. ముంబైలో ఉండే తరుణ్ చాలా గొప్పవాడని ఈశ్వర ప్రసాద్ తన కూతుర్ని అతనికిచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేస్తాడు. అతి స్వల్ప కాలంలోనే తరుణ్ దారుణమైన వ్యక్తి అని తెలిసి నిర్ఘాంతపోతాడు. తల్లిదండ్రుల సాయంతో హసిత కూడా ఆ మూడుముళ్ల బంధం నుండి విముక్తి పొందుతుంది.. తర్వాత వారి జీవితాలు ఎలా సుఖాంతం అయ్యాయన్నది నవల చదివిన వారికి అర్థమవుతుంది. రచయిత్రి శైలి పాఠకుడి చెయ్యి పట్టుకుని చివరి పేజీ వరకు లాక్కుపోతుంది.. ఇందులో కాశ్యప్ పాత్రను క్లుప్తంగా చెప్పినా కడకు అతనే అందరి సమస్యలకు పరిష్కారమవుతాడు. ఈ నవల చక్కగా చదివిస్తుంది.
రచన: హోతా పద్మినీదేవి
పేజీలు: 144 వెల:రూ. 100
ప్రతులకు: 99631 94142
-చంద్ర ప్రతాప్ కంతేటి , 80081 43507