హైదరాబాద్ , అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): గురుకులాలు, వసతి గృహాలకు నెలవారీగా సరుకులను సకాలంలో అందించాలని, అదే సమయంలో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గురుకులాలు, వసతిగృహాల పనితీరుపై చర్చించారు. ‘విద్యార్థులకు యూనిఫామ్‌లు, షూస్, పుస్తకాలు తదితర సామగ్రిని పూర్తిస్థాయిలో అందించాలి.
కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలి. ప్రతి అంశానికి నిర్దిష్ట గడువు నిర్ణయించి, పురోగతిపై నివేదికలు తీసుకోవాలి. మౌలిక వసతులను మెరుగుపరచాలి. సీసీ కెమెరాల ఏర్పాటుపై సమగ్రంగా పరిశీలించాలి. గురుకులాల్లో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని ఆదేశించారు. సమీక్షలో సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యసాచి ఘోష్, ఎస్సీ డీడీ కార్యదర్శి విజయేంద్ర బోయి, ఎస్సీ గురుకులాల కార్యదర్శి రవి, ఎస్టీ గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి, ఆశ్రమ పాఠశాలల డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, ఎస్సీ స్టడీ సరిల్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.