అష్టదిగ్బంధనాలను రైతులే ఛేదించాలి
రాజకీయ పార్టీలు రైతులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని, వారి మౌలిక ప్రయోజనాలను విస్మరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అన్నదాతలే రాజకీయంగా చైతన్యవంతమై ఆలోచించాల్సిన చారిత్రాత్మక అవసరం ఏర్పడింది. నేడు వ్యవసాయం ఎందుకు ఇంతటి సంక్షోభంలో కూరుకుపోయింది? రైతు చుట్టూ ఎందుకు ‘అష్టదిగ్బంధనాలు’ అల్లుకున్నాయి? అనే విషయంపై లోతైన చర్చ జరుగాలి.
నేడు ఒక సామాన్య రైతు సాగు చేయాలంటే ఎనిమిది రకాల సవాళ్లు, నియంత్రణలను దాటుకోవాల్సి వస్తున్నది. కరెంట్, సాగు నీళ్లు, విత్తనాలు, ఎరువులు (క్రిమిసంహారక మందులను ఇంకా ఆధార్‌కు లింక్ చేయలేదు), బ్యాంకు రుణాలు, పంటల బీమా, మార్కెటింగ్, రెవెన్యూ వ్యవస్థ. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎనిమిది అంశాల్లో రైతులు ఏ మేరకు నిశ్చింతగా ఉన్నారో ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ఎనిమిది అంశాల్లో ఏడింటిని నేరుగా ‘ఆధార్’తో ముడిపెట్టి, ప్రతి అడుగులోనూ రైతన్నను అనుమానించే ధోరణి విపరీతంగా పెరిగింది. దేశానికి అన్నం పెట్టే ఒక వృత్తిని ఇన్ని నిర్బంధాలకు ఎందుకు గురిచేస్తున్నారు? రైతులపై ప్రభుత్వాలకు ఎందుకంత అపనమ్మకం?
రైతు క్షేమం విషయంలో అన్ని పార్టీలు ఒకే అభిప్రాయంతో రాజకీయాలు పక్కనపెట్టి కృషి చేయడం పలు రాష్ర్టాల్లో ఉన్నది. ఈ విషయాన్ని తెలంగాణ రైతులు లోతుగా గుర్తించాలి. ఇప్పటికైనా అందరూ కలిసి ప్రతి పల్లెలోనూ సాగునీటి ప్రాజెక్టులు, రైతుకు ఎదురవుతున్న అష్ట దిగ్బంధనాలపై ప్రధానంగా చర్చించాలి.
మహారాష్ట్రలో చెరకు రైతులు తమ ఐక్యతతో ప్రభుత్వాలనే శాసించగలరు. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా రైతులు తమ హక్కుల కోసం ‘క్రాప్ హాలిడే’ ప్రకటించి పాలకులను కదిలించగలరు. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే ఇటువంటి ఐక్యత లేకపోవడం వల్లే.. ఇటు ఎరువుల బస్తా దగ్గర ఆధార్ ఆంక్షల వంటి పరిపాలనాపరమైన సంకెళ్లు, అటు సాగునీటి ప్రాజెక్టులపై జరిగే కుట్రల వంటి రాజకీయ సంకెళ్లను తెలంగాణ రైతులు మౌనంగా భరించాల్సి వస్తున్నది. ఎరువుల లాంటి వ్యవసాయ ఉత్పాదకాల విషయంలో ఆధార్ నిబంధనలతో రైతును నిత్యం అనుమానించే వ్యవస్థలు ఒకవైపు ఉండగా, మరోవైపు సాగుకు ప్రాణాధారమైన సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది.
వీటన్నింటికీ కారణం రైతుల్లో రాజకీయ ఐక్యత కొరవడటమే. పాలకులపై రైతుల రాజకీయ పట్టు సడలినప్పుడు, సబ్సిడీల దగ్గర ఆంక్షలు విధించడమే కాకుండా, వారి భవిష్యత్తును మార్చే భారీ సాగునీటి ప్రాజెక్టులను సైతం రాజకీయ క్రీడలకు బలిచేసే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ విషయంలో పొరుగు రాష్ర్టాల రైతుల చైతన్యం, అక్కడి ప్రభుత్వాల వైఖరి మన రైతులకు కనువిప్పు కావాలి.రైతు సంఘటిత శక్తిగా ఉన్నచోట ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే నిదర్శనం.
రాష్ట్రవ్యాప్తంగా నిర్లక్ష్యానికి గురై మూలనపడిన వందలాది ఎత్తిపోతల పథకాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు భారీగా నిధులు మంజూరు చేయడం, తద్వారా లక్షలాది ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించాలని సంకల్పించడం నిజమైన రైతు పక్షపాత వైఖరి. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ గణాంకాల ప్రకారం..రాష్ట్రంలో ఉన్న మొత్తం 1,023 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల కింద దాదాపు 11.78 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. వీటిలో పాడైపోయిన వందలాది పథకాలను పునరుద్ధరించడంతో పాటు, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, పోతిరెడ్డిపాడు వంటి భారీ ఎత్తిపోతల వ్యవస్థలను పూర్తిచేయక తప్పని పరిస్థితి అక్కడి ప్రభుత్వానికి ఏర్పడిందంటే-దానికి కారణం అక్కడి రైతులు ఒక నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా ఎదగడమే.
భారీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వివాదాలు కొత్తవి కావు. నాడు గుజరాత్ జీవనాడి అయిన సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణ సమయంలో ఎన్నో అపోహలు, అంతర్జాతీయ స్థాయిలో దుష్ప్రచారాలు జరిగాయి. కానీ, ఆ ప్రాజెక్టు పూర్తయి ఫలాలు అందడం మొదలయ్యాక అక్కడి రైతులు దాని విలువను గుర్తించారు. నేడు కరువు కోరల నుంచి తమను కాపాడిన ‘ఆపద్బాంధవి’గా వారు సర్దార్ సరోవర్‌ను కొలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సర్ ఆర్థర్ కాటన్ కట్టించిన ధవళేశ్వరం బరాజ్, నాగార్జునసాగర్‌ను రైతులు ఎలా దేవాలయాలుగా భావిస్తారో, రాబోయే కొన్నేండ్లలోనే గాలేరు-నగరి, హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు నీటి వ్యవస్థలను కూడా రాయలసీమ రైతులు అలాగే ఆరాధిస్తారు. ఎందుకంటే వాటి పూర్తి ఫలాలు రాబోయే రోజుల్లో అక్కడి బీడు భూములను సస్యశ్యామలం చేయబోతున్నాయి. మరి.. తెలంగాణ విషయానికి వస్తే, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కొన్ని స్వార్థ శక్తులు మాత్రం ఎందుకు ఇంతలా విషం చిమ్ముతున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్టును ‘వైట్ ఎలిఫెంట్’ అన్నారు. సముద్రమట్టానికి 100 మీటర్ల ఎత్తులో లోతట్టున ప్రవహించే గోదావరి నీళ్లను, 600 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న తెలంగాణ పీఠభూమి ప్రాంతాలకు తీసుకురావాలంటే ఎత్తిపోతలు తప్ప మరో మార్గమే లేదు.
అయినప్పటికీ, కేవలం నీటిని లిఫ్ట్ చేయడానికి కరెంట్ ఖర్చు ఎక్కువ అవుతున్నదన్న కుంటిసాకుతో నేటి రాష్ట్ర పాలకులు కాళేశ్వరాన్ని ఒక ‘తెల్ల ఏనుగు’గా చిత్రీకరించారు. ఇలా దుష్ప్రచారం జరుగడం వెనుక బలమైన ఆర్థిక, మార్కెట్ సమీకరణాలు కూడా పనిచేశాయి. అపోహలు సృష్టించిన స్వార్థశక్తుల వెనుక ఒక బలమైన పెట్టుబడిదారీ వర్గం కూడా ఉన్నది. సాగునీటి వసతి లేనప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధరలు తక్కువగా ఉండి, బడా రియల్ ఎస్టేట్ శక్తులు కారుచౌకగా భూములు కొనుగోలు చేసే అవకాశం ఉండేది. కానీ కాళేశ్వరం జలాలు రావడంతో బీడు భూములకు జవసత్వాలు వచ్చి, వాటి విలువ పెరుగడమే కాకుండా రైతుల బేరసారాల శక్తి పెరిగింది. ఈ ఆర్థిక మార్పును జీర్ణించుకోలేని ఆ స్వార్థ వర్గాలు పరోక్షంగా ఈ వ్యతిరేక ప్రచారానికి ఊతమిచ్చాయి. అన్ని శక్తులూ కలిసి ఆంధ్ర ప్రాంతంలో లేని కుత్సిత రాజకీయాలను తెలంగాణలో ప్రవేశపెట్టాయి.
నాడు సర్దార్ సరోవర్‌ను అడ్డుకోవడానికి స్వార్థ రాజకీయ శక్తులు ఏ విధంగా వ్యవస్థలను వాడుకున్నాయో, నేడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు ఏకమై, మీడియా, దర్యాప్తు సంస్థలను తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణలోనూ కాళేశ్వరం ఫలాలను చాలా ప్రాంతాల రైతులు ప్రత్యక్షంగా అనుభవించారు; తమ భూములు బంగారంగా మారడం కండ్లారా చూశారు. కానీ, ఆంధ్ర ప్రాంతంలో లేనటువంటి కుత్సిత రాజకీయాలు ఇక్కడ రాజ్యమేలడం వల్ల, ప్రాజెక్టు అసలు ఉద్దేశాన్ని రైతులు పూర్తిగా అర్థం చేసుకునే వాతావరణాన్ని రాజకీయ శక్తులు చెడగొట్టాయి.
కాళేశ్వరంలో ఎక్కడైనా అవినీతి గానీ, సాంకేతిక లోపాలు గానీ జరిగితే, వాటిని సరిదిద్దడానికి, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన వ్యవస్థలు ఉన్నాయి. అంతేకానీ, ఆ సాకుతో ఓట్లు దండుకొని, ప్రాజెక్టునే నిర్వీర్యం చేయాలని చూడటం వల్ల అంతిమంగా నష్టపోయేది, మళ్లీ కరువుకోరల్లో చిక్కుకునేది తెలంగాణ రైతులే అనే సత్యాన్ని గ్రహించాలి.
ఇప్పటికైనా తెలంగాణ రైతుల దృక్పథంలో మార్పు రావాలి. కులమతాలకు అతీతంగా ‘రైతు’ అనే ఒకే ఒక్క ఐక్య శక్తిగా ఎదిగి, తమ సాగునీటి ప్రాజెక్టులను కాపాడుకుంటూ, తమ చుట్టూ అల్లుకున్న అష్టదిగ్బంధనాలను ఛేదించుకున్నప్పుడే రైతుకు నిజమైన స్వాతంత్య్రం లభిస్తుంది. తెలంగాణ రైతులు అటు ఆంధ్ర, ఇటు మహారాష్ట్ర ప్రాంతాల్లోని సంఘటిత రైతు శక్తిని గమనించి, రాజకీయ పార్టీల ఎజెండాలను ప్రభావితం చేసే విధంగా చైతన్యవంతులు కావాలి. మనం పోలవరం విషయంలో చూసినా, పోతిరెడ్డిపాడు విషయంలో చూసినా అక్కడి రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ కోసం పోటీ ఉంటుందే తప్ప, ప్రాజెక్టులనే రద్దు చేయాలన్న లేదా నిర్వీర్యం చేయాలన్న ధోరణి ఉండదు. రైతు క్షేమం విషయంలో అన్ని పార్టీలదీ ఒకే అభిప్రాయం; రాజకీయాలు పక్కనపెట్టి కృషి చేయడం అక్కడి సంస్కృతి. ఈ విషయాన్ని తెలంగాణ రైతులు లోతుగా గుర్తించాలి. ఇప్పటికైనా కుల, మతాలకు అతీతంగా ప్రతి పల్లెలోనూ సాగునీటి ప్రాజెక్టులు, రైతుకు ఎదురవుతున్న అష్టదిగ్బంధనాలపై ప్రధాన చర్చ జరుగాలి.
రాజకీయ పార్టీల ఎజెండాలకు బదులుగా, జీవనోపాధికి మూలమైన సాగునీరు, విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధర వంటి మౌలిక హక్కుల గురించే ఆలోచించాలి. కేవలం రైతులే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి నడిచే మండల, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని వర్తక వాణిజ్య వర్గాలు, సామాన్యులు సైతం ఈ అంశాల ప్రాధాన్యతను గుర్తించి గొంతు కలపాలి. అప్పుడే పాలకులపై రైతుకు పట్టు చిక్కుతుంది. అన్నదాతకు అష్టదిగ్బంధనాల నుంచి నిజమైన విముక్తి లభిస్తుంది.
నేడు రైతు ఎదుర్కొంటున్నది కేవలం ఆర్థిక లేదా నీటి సమస్య మాత్రమే కాదు; ఆత్మగౌరవ సమస్య! అక్రమ వలసలను నిరోధించడానికి, ప్రభుత్వ పథకాల్లో నకిలీ లబ్ధిదారులను అడ్డుకోవడానికి ఉద్దేశించిన ‘ఆధార్’ నిబంధనలను నిస్వార్థంగా దేశానికి అన్నం పెట్టే రైతు వ్యవసాయానికి ముడిపెట్టడం అత్యంత అసంబద్ధం, అనాగరికం. నాడు ‘జై జవాన్-జై కిసాన్’ అనే మహోన్నత నినాదంతో ప్రగతిపథంలో అడుగులు వేసిన స్వతంత్ర భారతదేశం, నేడు రైతును ‘ఆధార్’ అనుమానపు చట్రంలో బంధించే స్థాయికి దిగజారడం-సమకాలీన రాజకీయ పార్టీలకు రైతు పట్ల ఉన్న నిర్లిప్తతకు, చిన్నచూపునకు నిదర్శనం. ఈ అవమానకర స్థితి మారాలంటే-అన్నదాత తన ఓటు శక్తితో పాలకులకు కనువిప్పు కలిగించక తప్పదు!
(వ్యాసకర్త: ప్రొఫెసర్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం)
చంద్రి రాఘవరెడ్డి
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

