సిరిసిల్ల కలెక్టరేట్, మే 25: మద్యం ధరలు పెంచవద్దని మద్యం ప్రియుల పేరుతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌కు రాసిన వినతిపత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కేవలం సరదా లేఖనా? లేక పెరుగుతున్న జీవన వ్యయాలపై కొందరి ఆవేదనా? అన్న చర్చ మొదలైంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే మద్యం ధరలు ఎకువగా ఉన్నాయని, ప్రభుత్వం మరోసారి 20 నుంచి 30శాతం ధరలు పెంచే ఆలోచన చేస్తున్నదని, ధరల పెంపును నిలిపివేసేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కలెక్టర్‌ను లేఖలో కోరినట్టు ఉన్నది. కాగా, ఈలేఖ నిజంగా కలెక్టర్ కార్యాలయానికి చేరిందా? లేదా? అనేది స్పష్టత లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతున్నది. “ఇతర సమస్యలపై నోరు మెదపకపోయినా.. మద్యం ధరలపై మాత్రం కొందరు వెంటనే స్పందిస్తున్నారు” అంటూ కొందరు నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.