తెలంగాణ, ఆంధ్ర విలీనాన్ని వర్ణిస్తూ జవహర్లాల్ ఒక ప్రకటన చేశారు. ఒక అమాయకపు బాలిక (తెలంగాణ)ను, ఒక తుంటరి బాలుడు (ఆంధ్ర)కు ఇచ్చి పెండ్లి చేస్తున్నాం అని. అసలు ఈ వర్ణనలోనే ఒక పెద్ద తప్పు దాగి ఉన్నది. తెలంగాణను అబ్బాయి అనాల్సింది. అమ్మాయి అయితే,మరి వరుడు ఇల్లరికం వచ్చాడా? ఇల్లరికపుటల్లుడు అణిగి, మణిగి ఉండాలి గానీ, అథారిటీ చెయ్యడమేమిటి? తన చుట్టాలందరినీ తీసుకువచ్చి అత్తారిల్లును ఆగం చేయడమేమిటి? వారి ప్రవర్తన వల్ల ఆ పెండ్లి రెండో రోజే పెటాకులైంది. ఇది అమ్మాయి తరఫు పెద్దలందరికీ అర్థమయ్యింది.
తెలంగాణ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల పంపిణీలో రీజినల్ కమిటీ జోక్యాన్ని తగ్గించటంతో తెలంగాణ ప్రాజెక్టులన్నీ మూలనపడ్డాయి. సగం పూర్తయిన ప్రాజెక్టులు తుంగభద్ర (ఎల్బీసీ), ఎక్స్టెన్షన్, భీమా, ఎగువ కృష్ణా, గోదావరి బహుళార్థక సాధక, ఇచ్చంపల్లి, దేవనూరు తదితర ప్రాజెక్టుల సంగతిని వివక్ష పాలన చేసిన కుటిల ఆంధ్రా నాయకులు పట్టించుకోలేదు. ఇది కాంగ్రెస్ చేసిన 16వ తప్పు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం మంజూరైన నిధులన్నీ నాయకుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లిపోయాయి.
తెలంగాణ, ఆంధ్ర మధ్య జరిపించిన పెండ్లి సజావుగా సాగకపోతే విడాకులు తీసుకోవచ్చన్న వెసులుబాటు కూడా ఇచ్చాడు నెహ్రూ. కానీ, జరిగిందేమిటి? ఆ గయ్యాళి మొగుడు నుంచి విడాకులు తీసుకోవటానికి ఆ అమాయకురాలికి 57 ఏండ్ల 7 నెలల 1 రోజు పట్టింది. అతడు వదిలాడు, కానీ అతడి చుట్టాలందరూ ఇంకా ఆ అమాయకపు మహిళను ఏడిపిస్తున్నారు. తిన్నది చాలలేదు వారికి. ఇన్నేండ్లలో వెనుకేసుకున్న సంపదతో సంతృప్తి లేదు వారికి. ఇంకా ఆవిడ ఇంట్లోనే పడి ఉండి మెక్కుతూనే, తమ దాష్టీకం చెల్లాలంటున్నారు.
ఈ రకంగా పైన చెప్పినవి, ఇంకా పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న నిబంధనలు 1956 ఆగస్టు 10న పార్లమెంటులో కేంద్ర హోంశాఖ సమర్పించిన రక్షణల నోట్లో లేనేలేవు. దాని ప్రకారం తయారు చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు 1958 ఫిబ్రవరి 1న వెలువడ్డాయి. దానిని చూసిన తెలంగాణ నేతలు దిగ్భ్రాంతి చెందారు. ముఖ్యమంత్రి అంశాలన్నింటిని తొలగించడంతో తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, భూములు, ఉర్దూ భాషకు ఆదరణ అన్నీ గాలిలో కలిసిపోయాయి. యథేచ్ఛగా తమ ప్రాంత పాలన చేతకాని నేతలు పరాయి ప్రాంతమైన తెలంగాణను తేరుకోలేని నష్టాలకు గురి చేశారు. వీటన్నింటినీ చూసి కూడా ఏమీ ఎరుగనట్టు నటించిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఎప్పటికీ క్షమించకూడదు.
-కనకదుర్గ దంటు