Egg Yolk | మన శరీరానికి కావల్సిన పోషకాలను అందించే ఆహారాల్లో గుడ్డు ఒకటి. దీనిలో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. గుడ్డును తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చాలా మంది గుడ్డు తెల్లసొనను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. పచ్చసొనను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వాస్తవమే అయినప్పటికీ గుడ్డు పచ్చసొనను తీసుకోవడం వల్లే మన శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు. గుడ్డు పచ్చసొనలోనే విటమిన్ ఎ, ఇ, ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ఆరోగ్యవంతులు గుడ్డు పచ్చసొనను ఆహారంగా తీసుకోవచ్చని ఇది శరీరానికి శక్తిని అందించే పోషక కేంద్రం లాంటిదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాకుండా తాజా పరిశోధనలు గుడ్డు పచ్చసొనలో ఉండే కొలెస్ట్రాల్ మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని తెలియజేస్తున్నాయి. పచ్చసొనను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే అవి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలే అయి ఉంటాయని చెడు కొలెస్ట్రాల్ పై ఇవి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. గుడ్డు పచ్చసొనను మితంగా తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలపై పెద్దగా ప్రభావం ఉండదని గుడ్డు పచ్చసొనలో ఉండే కొలెస్ట్రాల్ అనుకున్నంత హానికరం కాదని వారు తెలియజేస్తున్నారు. పచ్చసొన పోషకాలతో నిండి ఉంటుందని ఇది ఆరోగ్యకరమైనదని వైద్యులు చెబుతున్నారు. గుడ్డు తెల్లసొన ఒక శోథ నిరోధక ప్రోటీన్ అని కేవలం తెల్లసొనను తీసుకోవడం అంత మంచిది కాదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
కొలెస్ట్రాల్ గురించి తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉండడం వల్ల చాలా మంది గుడ్డు పచ్చసొనను ఆహారంగా తీసుకోవడం లేదని వైద్యులు అంటున్నారు. మన శరీరంలో కణ నిర్మాణానికి, హార్మోన్ల ఉత్పత్తికి, మెదడు పనితీరుకు, రోగనిరోధక వ్యవస్థకు కొలెస్ట్రాల్ చాలా అవసరం. దాదాపు 85 శాతం కొలెస్ట్రాల్ ను మన శరీరంలో ఉండే కాలేయమే తయారు చేస్తుంది. కొలెస్ట్రాల్ లో కూడా తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ (ఎల్డిఎల్), అధిక సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్( హెచ్డిఎల్) అని రెండు రకాలు ఉంటాయి. ఎల్డిఎల్ అధిక స్థాయిల ఉండడం వల్ల ధమనులలో అడ్డంకులు ఏర్పడి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కనుక దీనిని చెడు కొలెస్ట్రాల్ అంటారు. హెచ్డిఎల్ ని మంచి కొలెస్ట్రాల్ అని అంటారు. ఇది ధమనుల్లో ఉండే కొలెస్ట్రాల్ ను కాలేయానికి తీసుకెళ్లి శరీరం బయటకు వెళ్లేలా చేస్తుంది.
ఇక శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి గుడ్డు పచ్చసొన కారణం కాదని అధిక సంతృప్త కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, ధూమపానం వంటి కారణాల వల్లే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. గుడ్డు పచ్చసొనను పూర్తిగా మానేయకుండా దీనిని మితంగా తీసుకుంటూనే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడం, ధూమపానం మానేయడం వంటివి చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయని వైద్యులు సలహా ఇస్తున్నారు. గుడ్డు పచ్చసొన ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీనిని మితంగా తీసుకోవాలి. అలాగే గుండె జబ్బులు ఉన్న వారు, డయాబెటిస్ రోగులు, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు, గౌట్ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.