కాంగ్రెస్ ఆడుతున్న మూడు ముక్కలాట నగర ఖ్యాతిని నిర్వీర్యమయ్యేలా ఉంది. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఆడుతున్న నీచమైన క్రీడ నగర ఖ్యాతిని అంతర్జాతీయంగా దెబ్బతీయనుంది. స్వరాష్ట్రం తర్వాత నగరాన్ని అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించి, ప్రపంచ నగరాలతో పోటీపడే స్థాయి నుంచి నేలకు జారేలా చేస్తున్నది. చారిత్రక నగర ఆనవాళ్లను తుడిపెట్టే లక్ష్యంతో, దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే అతి తక్కువ విస్తీర్ణంలో ఉండే సాదాసీదా కార్పొరేషన్లుగా మార్చిందనే ఆరోపణల నేపథ్యంలో.. బృహత్ బెంగుళూరు నగరాన్ని ముక్కలు చేసిన చందంగా కర్ణాటక కాంగ్రెస్ వేసిన తప్పటడుగులనే రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
-సిటీబ్యూరో, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ)
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ 2007లో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించింది. పెట్టుబడుల నుంచి మౌలిక వసతుల వరకు నగరానికి నగిషీలు అందిన గత ప్రభుత్వ ఆనవాళ్లను చెరిపివేసే కుట్రలను కాంగ్రెస్ సర్కారు పక్కాగా అమలు చేస్తోంది. విస్తీర్ణంలో న్యూయార్క్, షెన్జెన్, షాంఘై, లాస్ ఏంజిల్స్, వాషింగ్టన్ వంటి నగరాలతో పోటీపడాల్సిన నగరాన్ని కాంగ్రెస్ సర్కారు ముక్కలు చేసి నామారూపాల్లేకుండా చేస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. పాలన వికేంద్రీకరణ పేరిట కాంగ్రెస్ ఆడుతున్న వికృత క్రీడ పరిణామాలు దేశ రాజధాని అయిన ఢిల్లీ కార్పొరేషన్, ఐటీ కేంద్రమైన బెంగళూరు నగరాల తరహాలో విఫల ప్రయోగమేనని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే రెండు పాలించిన కాంగ్రెస్ సర్కారుతో నగరాభివృద్ధిలో ఐదేళ్లు వెనక్కి వెళ్లిందనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తం అవుతున్నది. ఏ ఒక్క ప్రాజెక్టును ప్రారంభించకుండానే, వేల కోట్లు విలువ చేసే టెండర్లతో హడావుడి చేస్తుంది. కానీ సర్కారు మాత్రం నగరానికి అవసరమైన ఏ ఒక్క మౌలిక వసతులను పక్కాగా అమలులోకి తీసుకురాలేకపోయింది.
అస్తిత్వానికి ప్రమాదం..
హైదరాబాద్ నగరానికి 400ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. విదేశీ దిగ్గజ కంపెనీలతో వరల్డ్ క్లాస్ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నది. కానీ నగర చారిత్రక హోదాను ప్రశ్నార్థకంగా చేస్తూ, పాలన వికేంద్రీకరణ పేరి సాగుతున్న విధ్వంసం పరిణామాలే ఆందోళన కలిగిస్తున్నాయి. బెంగుళూరు తరహాలో రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా బృహత్ బెంగళూరు కార్పొరేషన్‌గా ఐదు భాగాలు అక్కడి కాంగ్రెస్ చేసింది. అదే తరహాలో నగరాన్ని కూడా మూడు ముక్కలు చేయడంలో వేసిన తప్పటడుగు మూల్యం భావితరాలు చెల్లించుకునే పరిస్థితులు రానున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడులు పక్కా రాష్ర్టాలకు తరలించే పరిస్థితులూవచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్ అస్తిత్వానికి ప్రమాదం పొంచి ఉందనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అనుభవాలు మరిచి..
గతంలో ఇదే తరహాలో ఢిల్లీ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేస్తూ స్థానిక పాలనను నిర్వీర్యం చేసిన అనుభవాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ తర్వాత ఎదురైన ఇబ్బందులు, మౌలిక వసతుల కల్పనలో వచ్చిన ఆటంకాలు, నిర్వహణలో తలెత్తిన సమన్వయ లోపం దేశ రాజధాని ఖ్యాతిని దిగజార్చింది. అలాంటి అనుభవాల నుంచి పాఠాలు నుంచి బయటపడేలా మూడు కార్పొరేషన్లను కలిపి ఏకీకృత వ్యవస్థగా తీర్చిదిద్దారు. ఇక బృహత్ బెంగళూరు, ఐటీ ఎగుమతులకు పెద్దన్నలా నిలిచిన బెంగుళూరు నగర గొప్పతనాన్ని ఓర్వలేని కాంగ్రెస్ సర్కారు… ఐదు ముక్కలు చేసింది. ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్ కార్పొరేషన్ల చేసిన ముక్కలాట ఫలితాలు ఇప్పుడిప్పుడే ఎదురైతున్నాయి. అదొక విఫల ప్రయోగంగానే మారింది. కానీ అనుభవాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేని కాంగ్రెస్ సర్కారు ఇక్కడా కూడా అమలులోకి తీసుకువచ్చింది.
ఈ తంటా మనకెందుకు..?
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నయ్, గ్రేటర్ నోయిడా వంటి నగరాలకు లేని తంటా హైదరాబాద్ నగరానికి ఎందుకనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. భారీ జనాభా, విస్తీర్ణం ఉన్నప్పటికీ ఒకే గొడుగు దశాబ్ధాల కాలంగా పటిష్టమైన పాలన ఫలాలను అందిస్తున్నాయి. ప్రపంచ నగరాలతో పోటీ పడే స్థాయిలో నగరాన్ని విస్తరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు మహానగరాన్ని బలిపీఠమెక్కించిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని హబ్ ఆఫ్ మైగ్రేషన్‌గా గుర్తింపు ఉన్న హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ లక్షలాది మంది దేశ, విదేశీయులకు ప్రధాన ఆవాస కేంద్రంగా నిలుస్తున్నది. న్యూయార్క్, షాంఘై వంటి ఆధునాతన సదుపాయాలను ఇప్పుడిప్పుడే అందిపుచ్చుకుంటున్న నగరాన్ని మూడు ముక్కలు చేసి రేవంత్ రెడ్డి వికృత చేష్టలతో జనాలే విసిగిపోతున్నారు.
బీడీఏ తరహాలో హెచ్ఎండీఏ..
బెంగుళూరు మున్సిపల్ కార్పోరేషన్‌ను ఐదు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ, వీటిని పర్యవేక్షించేందుకు పట్టణ ప్రణాళికలను అమలు చేసే బాధ్యతను బెంగుళూరు డెవలప్మెంట్ అథారిటీ(బీడీఏ)కి అప్పగించింది. అదేతరహాలో జీహెచ్ఎంసీ బాధ్యతలకు కత్తెర వేసిన కాంగ్రెస్ సర్కారు భవన నిర్మాణాల విషయంలో హెచ్ఎండీఏకు బాధ్యతలు అప్పగించింది. దీంతో జీహెచ్ఎంసీ ఆర్థిక స్వయంప్రతిపత్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక హెచ్ఎండీఏ ఇచ్చే 8-10శాతం కోసం అడుక్కోవాల్సిన దుస్థితి గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు ఎదురు కానుంది.అదే విధంగా అభివృద్ధి విషయంలో మూడంచెల వ్యవస్థతో సమన్వయ లోపించే ప్రమాదం ఉంది.
ప్రపంచ జాబితాలో కనుమరుగు..
ప్రపంచవ్యాప్తంగా విస్తీర్ణం, జనాభా పరంగా 20కిపైగా అతిపెద్ద నగరాలు ఉన్నాయి. విస్తీర్ణంపరంగా న్యూయార్క్ 11వేల చదరపు కిలోమీటర్లు ఉంటే, షెన్జెన్ (10,65), షాంఘై (9731), బోస్టన్ (8847), టోక్యో(8775), అట్లాంట (7151), లాస్ఏంజిల్స్ (6918), మాస్కో (6643), చికాగో (6532), వాషింగ్టన్ (5600) వంటి నగరాల తరహాలో హైదరాబాద్ నగరం 2,000చదరపు కిలోమీటర్లతో అతిపెద్ద విస్తీర్ణం కలిగిన నగరాల జాబితాలో చోటు దక్కేది. కానీ మూడు ముక్కలు చేయడం ఇప్పుడు ఆ జాబితాలో నగరం పేరు కనుమరుగు కానుంది. ఇక దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్ హోదాను కూడా కోల్పోనుంది. దీంతో ప్రధానంగా పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. నిజానికి బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే… పారిశ్రామిక విధానాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి… ఏకీకృత విధానాలను పకడ్బందీగా అమలు చేసింది. దీంతో ఊహించిన దాని కంటే తక్కువ సమయంలోనే అంతర్జాతీయ పెట్టుబడులతో హైదరాబాద్ నగరం నిండిపోయింది.
మరో ఢిల్లీలా హైదరాబాద్ విభజన
జీహెచ్ఎంసీ విభజన వల్ల ఆర్థిక అసమానతలు, ద్రవోల్బణ సమస్యలు, వాణిజ్య పరమైన ఇబ్బందులు తలెత్తే ప్రమాదమున్నది. ఇది కేవలం వికేంద్రీకరణ కాదు.. ఆర్థికమైన ఇబ్బందులను కొని తెచ్చుకోవడమే. దీనికి ప్రధానమైన ఉదాహరణ ఢిల్లీ. ఢిల్లీని కూడా నార్త్, సౌత్, ఈస్ట్ కార్పొరేషన్ల పేరిట మూడుముక్కలు చేశారు. వాణిజ్య పరమైన ప్రాంతాలన్నీ అక్కడే ఉండటం వల్ల అభివృద్ధి సౌత్ ఢిల్లీకే పరిమితమైంది. నార్త్, ఈస్ట్ ఢిల్లీ ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నాయి.. దీని ఫలితంగా ఆ రెండు కార్పొరేషన్లు మురుగుకూపంలా మారిపోయాయి. డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలు దారితప్పాయి. ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితికి చేరుకున్నన్నాయి. ఆర్థిక ఒడుదొడుకులు విపరీతంగా పెరిగిపోవడంతో చేసేదేమీ లేక 2022లో తిరిగి ఢిల్లీని మళ్లీ ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చారు. హైదరాబాద్‌ను ముక్కలు చేయడమంటే ఆర్థికంగా వెనుకబాటుకు గురిచేయడమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.