న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన నిరసనల విజయంతో నూతనోత్సాహంలో ఉన్న విద్యార్థులు, యువత రైతులతో చేతులు కలిపి ఒక ఉమ్మడి వేదికపైకి వచ్చి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త విస్తృత స్థాయి ఉద్యమాన్ని చేపడుతారా? నగరాల్లో నివసించే జెన్జీ తరం, పొలాల్లో కష్టపడి పనిచేసే రైతులతో చేతులు కలుపగలదా? పరస్పర విరుద్ధమైన ఆసక్తులు, ఆశయాలు, కోరికలు కలిగిన ఇటువంటి భిన్న వర్గాలు కలిసి పనిచేయగలవా? కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) అధినేత రాకేశ్ టికాయిత్ను కలిసి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టే ప్రణాళికలపై చర్చించిన తర్వాత ఈ ప్రశ్నలు తలెత్తాయి. రెండు వర్గాలకు చెందిన మరికొందరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
విద్యార్థులు, యువజనులు, రైతులను ఒకే వేదికపైకి తెచ్చి ప్రభుత్వంపై ఉద్యమాన్ని చేపట్టడానికి అవసరమైన భవిష్యత్తు వ్యూహం, కార్యాచరణ ప్రణాళికపై వారు చర్చించారు. అన్ని వైపుల నుంచి మోదీ ప్రభుత్వాన్ని చుట్టుముట్టడానికి ఈ దేశంలోని మా రైతన్నలు, విద్యార్థులు, యువజనులు కలిసి పనిచేస్తారని మేము ఆశిస్తున్నాము అని రంకా విలేకరులకు తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోరాదన్న తమ డిమాండుకు మద్దతు ఇవ్వవలసిందిగా సీజేపీ టికాయిత్ను కోరింది. నిరసనకారులపై చర్యలు నిలిపివేయకపోతే మళ్లీ దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని సీజేఐ హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. బీహార్, పశ్చిమ బెంగాల్లో విద్యార్థులపై కేసులు నమోదయ్యాయని, రాజస్థాన్లో విద్యార్థులపై ఇప్పటికీ కేసులు నమోదు అవుతున్నాయని సీజేపీ ఆరోపించింది. మధ్యప్రదేశ్లో రైతుల తాజా ఆందోళన దృష్ట్యా సీజేపీ-టికాయిత్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులు
బీజేపీపాలిత మధ్యప్రదేశ్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని భోపాల్లో పెసలు కొనుగోలు, ఈ టోకెన్ విధానం తదితర డిమాండ్లను నెరవేర్చాలంటూ రైతులు చేపట్టిన నిరసన రెండో రోజుకు చేరింది. బుధవారం 2,000 వేల మందికి పైగా రైతులు పోలీసుల బారికేడ్లను ఛేదించుకుని, సీఎం మోహన్ యాదవ్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నిస్తూ, రోడ్లపైనే బైఠాయించారు. కనీస మద్దతు ధర, చట్టపరమైన గ్యారెంటీ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన కలెక్టర్ ప్రియాంక్ మిశ్రా నర్మదాపురం రోడ్డులోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ ఆందోళన ప్రాంతాన్ని సందర్శించి, తమతో కలసి భోజనం చేయాలని, తమ సమస్యలను వినాలని రాజకీయ నేతలను రైతులు ఆహ్వానించారు.
రైతులు ప్రధానంగా మూడు డిమాండ్లు వినిపిస్తున్నారు. ఒకటి రాష్ట్రంలో 100 శాతం పెసలు కొనుగోలుకు హామీ ఇవ్వాలి. రెండోది ఎరువుల పంపిణీ వ్యవస్థను మెరుగు పరచాలి. మూడవది రైతుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి. కాగా ఈ డిమాండ్లపై మంగళవారం రాత్రి అధికారులకు, రైతులకు మధ్య గంట పాట చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. కాగా వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులతోపాటు వచ్చి రైతులు ఆందోళన కొనసాగిస్తుండటం గమనార్హం. ఇదిలావుండగా ఈ రైతుల ఉద్యమానికి ‘జెన్ జీ’ వర్గం మద్దతు కూడా అందుతోంది. ఢిల్లీలో రైతు నేత రాకేశ్ టికాయిత్తో సీజేపీ నేతలు భేటీ అయి, విద్యార్థులు, యువతతో కలసి సంయుక్త వేదిక ఏర్పాటు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.