సూర్యాపేట, జూలై 29 : జిల్లా కేంద్రమైన సూర్యాపేటలోని పలు వార్డుల్లో నీడనిచ్చే పలు భారీ వృక్షాలను ఇటీవల కాలంలో నిలువునా నరికేస్తున్నారు. ఇదేమని అడిగితే అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల పేర్లు చెబుతుండటం పర్యావరణ ప్రేమికులను, స్థానికులను కలవరపెడుతున్నది. చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమని ప్రభుత్వం చెబుతూ.. ఓ పక్క వనమహోత్సవాలు నిర్వహిస్తుంటే సూర్యాపేటలో మాత్రం మొక్కలు నాటింది లేదు కానీ.. నిలువునా నరికేస్తుండటంపై పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీడనిచ్చే చెట్లను ఎందుకు నరుకుతున్నారని ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధుల పేర్లు చెబుతున్నారని, వారిని అడిగితే విద్యుత్తు తీగలకు, ఇండ్లకు అడ్డం వస్తున్నాయని, ప్రమాదాలు జరుగుతాయని తామే నరికివేయిస్తున్నామని చెబుతున్నారు. స్వ యాన టూరిజం మాజీ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి నివాసం ఎదుట ఉండే రెండు భారీ వృక్షాలను కొట్టి వేయడంతో వారికి పర్యావరణంపై, మొక్కల సంరక్షణపై ఉన్న ప్రేమ అర్థమవుతోంది. పదేండ్ల బీఆర్ఆర్ పాలనలో కరెంట్ తీగలకు, ఇం డ్లకు, ప్రమాదాలకు అడ్డురాని చెట్లు నేడు ఎందుకు అడ్డు వస్తున్నాయని జనం ప్రశ్నిస్తున్నా సమాధానం లేదు.

పర్యావరణాన్ని కాపాడాలని, అందుకు మొక్కలు నాటి సంరక్షించాలంటూ బీఆర్ఎస్ ప్రభు త్వం హయాంలో హరితహారం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి జూన్‌లో వేలాది మొక్కలు నాటి పర్యావరణాన్ని పెంచి పోషించింది. రోడ్ల వెంట మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించేలా చర్యలను కూడా చేపట్టింది. పదేండ్ల పాటు నియోజకవర్గంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి అడవుల శాతాన్ని గణనీయంగా పెంచారు. ప్రతి ఒక్క రూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరుతూ ప్రతి ఇంటికీ ఆరు రకాల మొక్కలు పంపిణీ చేశారు.
గత రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో వన మహత్సవంలో ఎక్కడా ఒక్క మొక్కను నాటిందే లేదు.. కానీ రోడ్ల వెంట.. వీధుల్లో ఏపుగా పెరిగిన చెట్లను అందినకాడికి నరుకుతూ పర్యావరణానికి పెను ప్రమాదం సృష్టిస్తున్నారు. ఒక మొక్క నాటి సంరక్షించాలంటే యేళ్ల తరబడి సమయం పడుతుంది. అలాంటిది భారీ చెట్లను నిలువునా నరికివేయడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటి సంరక్షించలేని ప్రజా ప్రతినిధులకు వాటిని నరికే అధికారం ఎవరిచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు.
సూర్యాపేటలోని 14వ వార్డులోని పటేల్ రమేశ్‌రెడ్డి నివాసం వద్ద 33, 24, 42 వార్డుల్లో కరెంటు తీగలు, ఇండ్లకు ఎలాంటి అడ్డం లేకున్నా భారీ వృక్షాలను నరికివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ చెట్లు కరెంట్ తీగలకు, ఇండ్లకు అడ్డుగా ఉంటే కొమ్మల వరకు లేదా మధ్య వరకే నరకాలి.. కానీ మొదలుకు నరకడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇవే కాకుండా పట్టణంలోని అనేక వార్డులో భారీ వృక్షాలను నరికివేస్తున్నా మున్సిపల్, ఫారెస్టు అధికారుల్లో ఎలాంటి స్పందన లేదు. అసలు ఈ వృక్షాలను మొదలుకే నరికేందుకు అనుమతులు తీసుకున్నారా లేదా తెలుసుకుందామని ప్రయత్నించినా అధికారులు స్పందించక పోవం గమనార్హం.

చెట్ల నరికివేత వల్లే ఎల్‌నినో..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లపాటు సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం చేపట్టి అడవుల శాతం పెంచారు. కానీ రెండున్నరేండ్లుగా కరెంటు తీగలకు అడ్డు వస్తున్నాయంటూ ఇష్టారాజ్యంగా పట్టణంలోని చెట్లు నరికివేస్తున్నారు. తీగలకు అడ్డు వస్తే చెట్ల కొమ్మల వరకు నరికితే ఫర్వాలేదు. కానీ మొదలుకే నరకడం బాధగా ఉంది. ఇలా చెట్లను నరకడం వల్లే పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని ఎల్‌నినోకు కారణమైంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చెట్లు నరికే వారిపై చర్యలు చేపట్టాలి.
-సోమగాని వేణుగౌడ్, 13వ వార్డు, సూర్యాపేట