Tammareddy Bharadwaja | నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచే మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది సినీ విశ్లేషకుల నుంచి నెగెటివ్ రివ్యూస్ రావడం చూశాం. అయితే ఈ రివ్యూలకు భిన్నంగా సినిమా వసూళ్లు కొనసాగుతున్నాయని సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘ది ప్యారడైజ్’ గురించి మాట్లాడిన ఆయన.. రివ్యూలను చూసి సినిమాల విజయాన్ని అంచనా వేయాల్సిన అవసరం లేదని అన్నారు. ‘ది ప్యారడైజ్’కు మంచి వసూళ్లు వస్తున్నాయని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. రివ్యూలకు సినిమా కలెక్షన్లకు ప్రత్యక్ష సంబంధం లేదని తాను మొదటి నుంచీ చెబుతున్నానని అన్నారు. ప్రతికూల రివ్యూల ప్రభావం ఉంటే వసూళ్లు వెంటనే తగ్గిపోవాలి కదా అని ప్రశ్నించారు.
తాను చెప్పిన లెక్కల ప్రకారం.. ఓవర్సీస్తో కలిపి సినిమా ఇప్పటికే రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని, భారత్‌లోనే సుమారు రూ.120 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలిపారు. సినిమా భారీ రేట్లకు కొనుగోలు చేసినప్పటికీ బయ్యర్లకు రికవరీ అయ్యే పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా రోజువారీ వసూళ్లను కూడా తమ్మారెడ్డి ప్రస్తావించారు. ప్రీమియర్ షోల నుంచి వచ్చిన వసూళ్లతో పాటు విడుదలైన తర్వాత తొలి రోజుల్లో వచ్చిన కలెక్షన్లను ఆయన వివరించారు. నైజాం ప్రాంతంలో ఇప్పటికే సినిమా రికవరీ దశను దాటిందని, అక్కడ బయ్యర్లకు కమిషన్ కూడా వచ్చే పరిస్థితి ఉందని చెప్పారు. ఆంధ్రాలోనూ ఇదే తరహాలో ఫలితం రావచ్చని అభిప్రాయపడ్డారు.
‘ది ప్యారడైజ్’ను నాని గత సినిమాల కంటే ఎక్కువ రేటుకు కొనుగోలు చేసినప్పటికీ వసూళ్లు వస్తున్నాయని తమ్మారెడ్డి పేర్కొన్నారు. సినిమా కోసం హీరో, దర్శకుడు, నిర్మాతలు ఎంతో కష్టపడ్డారని చెప్పారు. తనకు సినిమా నచ్చకపోయినా ప్రేక్షకులకు నచ్చితే వారు థియేటర్లకు వస్తారని తమ్మారెడ్డి అన్నారు. రివ్యూలను చూసి చిత్రబృందాలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.‘ది ప్యారడైజ్’ కోసం భారీ స్థాయిలో సెట్లు నిర్మించారని, తాను చూసిన సెట్ టూర్ వీడియో ద్వారా సినిమా నిర్మాణం ఎంత పెద్ద స్థాయిలో జరిగిందో అర్థమైందని చెప్పారు. ఇంత భారీగా ఖర్చు చేసి సినిమా రూపొందించడానికి చిత్రబృందానికి తమ కథపై నమ్మకం ఉండాలని ఆయన అన్నారు. ‘ది ప్యారడైజ్’పై కావాలనే సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం జరిగిందని తాను అనుకోవడం లేదని తమ్మారెడ్డి స్పష్టం చేశారు. అలాంటి ప్రచారం జరిగిందని తనకు తెలియదని చెప్పారు. అయితే ఎవరైనా డబ్బులు ఖర్చు చేసి ఒక సినిమాపై కావాలనే ప్రతికూల ప్రచారం చేయిస్తే అది సరైన పద్ధతి కాదని అన్నారు.
సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, కానీ కావాలనే సినిమాను దెబ్బతీయడానికి ప్రచారం చేయడం మాత్రం సరికాదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. చిత్రబృందాలు ఎంతో కష్టపడి సినిమాలు తీస్తాయని, ప్రేక్షకులు కూడా తమకు నచ్చిన సినిమాలను ఆదరిస్తారని చెప్పారు. రివ్యూల ప్రభావం అంతగా ఉంటే ‘ది ప్యారడైజ్’ రెండో రోజుకే వసూళ్లలో పడిపోయి ఉండేదని తమ్మారెడ్డి అన్నారు. కానీ సినిమా వంద కోట్ల మార్క్‌ను దాటిందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల కేవలం రివ్యూల ఆధారంగా సినిమా భవిష్యత్తును నిర్ణయించలేమని చెప్పారు.పైరసీ, రివ్యూల విషయంలోనూ చిత్ర పరిశ్రమ భయపడాల్సిన అవసరం లేదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.