బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా వెలుగొందిన పట్టణాలు, నగరాలు.. కాంగ్రెస్ పాలనలో అధ్వాన్నంగా తయారయ్యాయి. పురపాలికల్లో పేరుకుపోయిన చెత్తతో డంపింగ్ యార్డులు కొండల్లాగా దర్శనమిస్తున్నాయి. డంపింగ్ యార్డుల స్థలాలు ఆక్రమణకు గురైనా పట్టించుకునే నాథులు లేరు. రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పురపాలక సిబ్బందికి నెలనెలా జీతాలు ఇవ్వడంలేదంటే కాంగ్రెస్ పాలన ఏ స్థాయిలో దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వీధిదీపాల నిర్వహణలో వైఫల్యం, దోమలు, పందులకు ఆవాసాలుగా మారిపోయిన వీధులు, చెక్ డ్యాములను తలపిస్తున్న డ్రైనేజీలు అన్నీ కలిసి మున్సిపాలిటీలను మురికికూపాలుగా మార్చేశాయి. పాలక కాంగ్రెస్ చోద్యం చూస్తున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు నిలిచిపోయాయి. పురపాలికల నిర్వహణ ఖర్చుకు, ఆదాయానికి లెక్కలో పొంతన ఉండటంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పట్టణ పాలనను విధ్వంసానికి గురిచేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లపాటు మున్సిపాలిటీలను దేశం గర్వించేలా తీర్చిదిద్దింది. పారిశుధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ, హరితహారం, వార్డు స్థాయిలో నర్సరీలు, సెంట్రల్ మీడియన్ల అభివృద్ధి, వైకుంఠధామాల నిర్మాణం, విద్యుత్తు స్తంభాల మరమ్మతులతోపాటు ప్రజలకు పాలనను చేరువ చేసింది. మున్సిపాలిటీల పరిధిలో ప్రత్యేకంగా శాఖాహార-మాంసాహార మార్కెట్లను ఏర్పాటు చేసింది. పట్టణ ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ కోసం కంపోస్ట్ యూనిట్లు, డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్లు, వ్యర్థాల బయోమైనింగ్, బురద శుద్ధి కర్మాగారాల ఏర్పాటులో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఓడీఎఫ్++, జీఎఫ్సీ సర్టిఫికెట్ అందుకునే స్థాయికి తెలంగాణ మున్సిపాలిటీలు పురోగతి సాధించాయి. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా కేటీఆర్ సారథ్యంలో మునిసిపాలిటీల రూపురేఖలు మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛ సర్వేక్షణ పురస్కారం, ఇండియన్ శానిటేషన్ లీగ్ అవార్డ్లు గెల్చుకున్నది. ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గ్రీన్ చాంపియన్ అవార్డు, లండన్ గ్రీన్ ఆర్గనైజేషన్ నుంచి ఐదు గ్రీన్ ఆపిల్ అవార్డులు వరించాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం మునిసిపాలిటీల అభివృద్ధికి ముందుచూపుతో ఇప్పటివరకు ఒక స్పష్టమైన, చట్టబద్ధమైన ప్రణాళికను రూపొందించకపోవడం గమనార్హం. నేడు మున్సిపాలిటీల్లో అస్తవ్యస్తంగా మారిన పరిపాలనను చక్కదిద్దడానికి, మందబుద్ధి గల కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రస్తుత మునిసిపల్ ఎన్నికలు, 2026 తెలంగాణ ఓటరుకు వజ్రాయుధంగా పనిచేస్తుంది. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారమిచ్చినందుకు ప్రజలు మోసపోయి గోస పడుతున్నారు. పురపాలక ఎన్నికల ద్వారా మోసం చేయడానికి ముందుకొస్తున్న కాంగ్రెస్ పాలకులను నమ్మి మరోసారి మోసపోకుండా జర పైలం.
– శ్రీను నాయక్ దోన్వాన్
8522018001