నర్సంపేట గడ్డపై పెద్ది విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్న య్. అందుకే పోలీసులను ఉసిగొలిపి విగ్రహాన్ని తొలగించింది. ఇది పాశవిక చర్య. ప్రభుత్వం వెనక్కి తగ్గాలి
–కేటీఆర్
వరంగల్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కార్ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి తొలగించిన పోలీసులు, నిరసనలకు దిగుతారనే నెపంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. శాసనమండలిలో విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, రాష్ట్ర రైతు విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి సహా వందలాది మంది నాయకులు, కార్యకర్తలను మంగళవారం పోలీసులు నిర్బంధించారు. నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలు పోలీసుల గస్తీతో భీతిల్లాయి.
ఇటీవల అకాల మరణం చెందిన పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని స్థానిక మెడికల్ కాలేజీ ఎదుట ప్రైవేట్ స్థలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశాయి. ఈ విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి దాటాక తొలగించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగుతాయని ముందస్తుగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. నర్సంపేట, ఖానాపూర్, దుగ్గొండి, నెక్కొండ, నల్లబెల్లి మండలాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. దుగ్గొండి మండలం గిర్నిబావిలో సీఎం దిష్టిబొమ్మను బావిలో వేసి నిరసన తెలిపారు. నల్లబెల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు పెద్ది విగ్రహం తొలగింపు చర్యను నిరసిస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కారు. తొలగించిన చోటే పెద్ది విగ్రహం ప్రతిష్ఠించాలని శాసనమండలిలో విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నదని విమర్శించారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏందని ప్రశ్నించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ హెచ్చరించారు. అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలతో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం నర్సంపేటలో ప్రతిష్ఠ కాకుండా ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్పష్టం చేశారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పోలీసులు అనుసరించిన వైఖరిని చూసి నల్లబెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంట్లో ఆయన సతీమణి పెద్ది స్వప్న తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పెద్ది చిత్రపటం ముందు ఆమె విలపించారు.
నర్సంపేట నియోజకర్గంతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తల అరెస్టులను నిరసిస్తూ బుధవారం నర్సంపేట బంద్‌కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఎలాంటి నోటీసులు లేకుండా రాత్రికి రాత్రే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అరెస్టులను ఖండిస్తూ నర్సంపేట బంద్ పాటించాలని ఎర్రబెల్లి కోరారు.

హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయం వద్ద సిరికొండను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సుబేదారి పోలీసులు

మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు

హౌస్ అరెస్ట్ చేయడంతో వరంగల్‌లోని తన నివాసంలోనే ఉన్న నన్నపునేని

నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట ఈ నెల 10న ఆవిష్కరించిన పెద్ది విగ్రహం

పెద్ది విగ్రహాన్ని తొలగించి ఇటుకలు, సిమెంట్ బిల్లలను ట్రాక్టర్లో తరలిస్తున్న మున్సిపల్ సిబ్బంది

గిర్నిబావిలో నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు