హైదరాబాద్ సిటీబ్యూరో/ మల్కాజిగిరి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): నిషేధిత భూముల వ్యవహారంలో నైతిక బాధ్యత వహించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పెద్ద తప్పు చేసి ఇప్పుడు సారీ చెప్తే ప్రజల భాదలు తీరుతాయా? అని ప్రశ్నించారు. ‘అసలు ఆ జాబితాలో భూములు చేర్చిందెవరు? చేర్చాలని ఆదేశించిందెవరు? ఇష్టారాజ్యంగా జాబితాలో పెడుతారా? అధికారుల పేర్లు చెప్పి తప్పించుకుంటరా?’ అని నిలదీశారు.
‘నిషేధిత జాబితాలో పెట్టింది మీరే.. కాబట్టి తీసేయాల్సింది కూడా మీరే. ఎట్లా పెట్టారో అట్లాగే తొలగించండి. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోకుండా వారిని కార్యాలయాల చుట్టూ తిప్పకుండా నిషేధిత జాబితా నుంచి భూములు తొలగించాలి’ అని డిమాండ్ చేశారు. 22ఏ నిషేధిత భూముల జాబితాను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో హరీశ్ మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టిస్తున్నదని ఆగ్రహం వ్యకంచేశారు. రాత్రికిరాత్రే భూములను నిషేధిత జాబితాలో చేర్చితే ప్రజలు ఎక్కడికి పోతారని, ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి జనతాగ్యారేజ్ (తెలంగాణ భవన్) తలుపులు తెరిచే ఉంటాయని హరీశ్ స్పష్టంచేశారు. ‘ఎవరికైనా సమస్య ఉంటే రండి.. బీఆర్ఎస్ అండగా ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన తప్పును అధికారుల మీదకు నెట్టడం సరికాదని చెప్పారు. ఎలాంటి దరఖాస్తు లేకుండా, బాధితులు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నిషేధిత జాబితా నుంచి భూములు తొలగించాలని డిమాండ్ చేశారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం యూఎల్సీని రద్దుచేసిందని, ఆ తర్వాత ఆ భూములు పట్టా భూములుగా మారి, ఏండ్లుగా ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారని తెలిపారు.
20 ఏండ్లుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. రంగారెడ్డిలో 7,500 పేజీల జీవోల ద్వారా మినహాయింపు పొందిన భూములు, మేడ్చల్‌లో 6 వేలకు పైగా భూములు, హెచ్ఎండీఏ, హుడా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపై పట్టుసాధించేందుకే నిషేధిత జాబితా పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. తిలక్‌నగర్‌కు చెందిన అశోక్ 450 గజాల ఇంటిని అమ్మాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే, నిషేధిత జాబితాలో ఉన్నట్టు తెలిసిందని వివరించారు.
అమెరికాకు వెళ్లడానికి టికెట్ కూడా బుక్ చేసుకున్నాడని, ఇప్పుడు అశోక్ పరిస్థితి ఏమిటని, అమెరికా వెళ్లాలా? వద్దా? అక్కడ ఉద్యోగం చేయాలా? వద్దా? ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వారు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు 30 శాతం భూమి ఇవ్వాలని, డెవలప్మెంట్ హక్కులు కూడా ఇవ్వాలని అడుగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని హరీశ్ పేర్కొన్నారు. కోర్టులో కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకుండా కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.2,600 కోట్లు కేటాయిస్తే, కాంగ్రెస్ కేవలం రూ.800 కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు. కల్యాణలక్ష్మి విషయంలో పొన్నం ప్రభాకర్ అధికారుల తప్పు అంటున్నారని, నిషేధిత జాబితా విషయంలో అధికారులదే తప్పు అని మంత్రి పొంగులేటి అంటున్నారని చెప్పారు. ‘తప్పు మీరు చేసి, అధికారులు చేసినట్టు చెప్పడం సరికాదు’ అని హితవుపలికారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశిస్తూ హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీది 30 శాతం కమీషన్ సరార్ అని నేను ప్రత్యేకంగా చెప్పడం లేదు పొంగులేటీ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలే ఈ విషయాన్ని కోడై కూస్తున్నరు! దీనికి మీరేం సమాధానం చెప్తారు?’ అని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖ పరిధిలోని అనేక సమస్యలు, నిషేధిత భూముల (22ఏ) జాబితా లొసుగులను ఆసరాగా చేసుకొని విచ్చలవిడిగా కమీషన్లు వసూలు చేస్తున్నారని, డబ్బులు ఇస్తేనే ఫైళ్లు కదిలే పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
సర్వే భవన్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లైసెన్స్ సర్వేయర్లను పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గం, అప్రజాస్వామికమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ రూపాయి కూడా చెల్లించకున్నా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 6,500 మంది లైసెన్స్ సర్వేయర్లు ఏడాది నుంచి ఎలా బతుకుతున్నారో ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడాదిగా ఎలాంటి ఆదాయం లేకుంటే వారు తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. అరెస్టులతో నిరసనకారుల గొంతు నొకాలని చూడటం మానుకొని, వారిని వెంటనే విడుదల చేసి తక్షణమే వారితో చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాలు ఇస్తామని, గౌరవ వేతనాలు అందిస్తామని చెప్పి లైసెన్స్ సర్వేయర్లను విధుల్లోకి తీసుకొని, ఇప్పుడు వారిని వీధిన పడేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం ప డుతున్నదని హరీశ్ మండిపడ్డారు. సర్వేయర్లకు కనీస వేతనం ఇవ్వకుండా, కేవలం అర్థరహితమైన కమీషన్ల విధానం పెట్టడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. స ర్వేయర్ల సమస్యలను పరిషరించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
22ఏ జాబితా విషయంలో ఫిర్యాదులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ పనిచేయడంలేదని, ఇది ఎంత దగా ప్రభుత్వమో అర్థమవుతున్నదని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి నివాసం కూడా 22ఏ పరిధిలో ఉన్నదంటూ వచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ, సీఎం ఇంటి పరిస్థితి కూడా ఇలాగే ఉంటే, మరి ముఖ్యమంత్రికి పొంగులేటి సారీ చెప్పారా? అని ప్రశ్నించారు. నిషేధిత భూముల పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని, దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 22ఏ ముసుగులో అక్రమంగా ఆక్రమించిన, వివాదాస్పద భూములను తొలగిస్తే మాత్రం బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘తప్పులు చేస్తే మీరు ఇరుక్కుంటారు. మీరు బాధపడాల్సి వస్తది. తప్పు చేయకండి.. బలికాకండి’ అని జాగ్రత్తలు చెప్పారు. మంత్రి చేసిన తప్పులకు సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుచేసిన వారిపై బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితుల తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డి, మాజీ కా ర్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్‌రెడ్డి, సబితా అనిల్ కిశోర్, మేకల సునీతారా ము యాదవ్, నిరుగొండ జగదీశ్‌గౌడ్, శిరీష జితేందర్‌రెడ్డి, నేతలు బద్ధం పరశురాంరెడ్డి, జీకే హన్మంతరావు, పాల్గొన్నారు.