– పెన్పహాడ్ ఎంపీడీవో కార్యాలయంలో బాధితురాలు, సాక్షుల విచారణ
పెన్పహాడ్, సెప్టెంబరు 26 : పెన్పహాడ్ మండలంలోని మాచారం గ్రామానికి చెందిన వీఓఏ జయమ్మ ప్రజావాణిలో కలెక్టర్కు ఇచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల ఫిర్యాదుపై డిప్యూటీ సీఈఓ మహాలక్ష్మి శనివారం విచారణ చేపట్టారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జయమ్మను, మరికొందరు సాక్షులను విచారించినట్లు డిప్యూటీ సీఈఓ తెలిపారు. జయమ్మ తన ఫిర్యాదులో నూతనకల్ ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ గా విధులు చేపడుతున్న, మాచారం గ్రామ వాసి గడ్డం మదన్మోహన్రెడ్డి, మాచారం సర్పంచ్ ఇటికాల శ్రీనివాస్, గ్రామానికి చెందిన హోంగార్డు గండమళ్ల రమేష్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. కులం పేరుతో దూషిస్తున్నారని, విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. వీఓఏ ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. గ్రామంలోని కొందరిని తనపైకి ఉసిగొల్పి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఈ విషయమై జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందులపై జిల్లా ఎస్పీ, షీ టీంకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విచారణ అనంతరం తుది నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని డిప్యూటీ సీఈఓ మహాలక్ష్మి తెలిపారు. వారి వెంట ఎంపీడీఓ జానయ్య ఉన్నారు.