చందుర్తి : ఓ వ్యక్తి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తుండగా, అకస్మాత్తుగా ఆ వృద్ధుడు లేచి కూర్చున వింత ఘటన కరీంనగర్ ( Karimnagar ) జిల్లాలో చోటు చేసుకుంది. చందుర్తి మండలం సనుగుల గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చీకటి శంకరయ్య (66) కొంతకాలంగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి రూ.80 వేల వరకు ఖర్చు చేశారు. చికిత్స అనంతరం శంకరయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
దీంతో అంబులెన్స్ లో స్వగ్రామానికి తీసుకొస్తున్న తరుణంలో మార్గం మధ్యలో జోగాపూర్ గ్రామ సమీపంలో లేచి నిల్చున్నాడు. ఒక్కసారిగా అవాక్కుకు గురైన కుటుంబ సభ్యులు తిరిగి వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకి తీసుకెళ్లగా శంకరయ్యను పరీక్షించిన వైద్యులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
ఆశ్చర్యాన్ని కలిగించే ఘటనలో తండ్రి చనిపోయాడనే వార్త విన్న కుమారులు గల్ఫ్ దేశం నుంచి స్వదేశానికి రావడం విశేషం. ఈ విషయం చుట్టుపక్కల గ్రామస్థులకు తెలియడంతో శంకరయ్యను చూసేందుకు ఆసక్తిగా తరలి వచ్చారు.